బంగారు పతకాల బామ్మ..

ఓ రైలు ప్రయాణం తన జీవితాన్ని మార్చేసింది. ఈ వయసులో ఆటలా అన్నవారి నోటికి తాళం వేసింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వెటరన్‌ క్రీడాకారిణిగా మార్చింది. డెబ్బై మూడేళ్ల వయసులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిందావిడ. పట్టుదల ఉంటే వయసు అడ్డుకాదని చాటుతోంది...

Published : 30 Jun 2021 01:59 IST

ఓ రైలు ప్రయాణం తన జీవితాన్ని మార్చేసింది. ఈ వయసులో ఆటలా అన్నవారి నోటికి తాళం వేసింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వెటరన్‌ క్రీడాకారిణిగా మార్చింది. డెబ్బై మూడేళ్ల వయసులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిందావిడ. పట్టుదల ఉంటే వయసు అడ్డుకాదని చాటుతోంది నెల్లూరు జిల్లా కావలికి చెందిన మానికల రామసుబ్బమ్మ. కష్టాల సుడిగుండాలను ఈదిన ఆవిడ జాతీయ క్రీడాకారిణిగా ఎదిగిన తీరు తెలుసుకుందాం...

రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టిన మానికల రామసుబ్బమ్మ బతుకంతా కష్టాల మయమే. కావలి పట్టణం వెంగళరావునగర్‌కు చెందిన గిరిజన కుటుంబంలో పుట్టిన ఆమె ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేసింది. దాంతో తనకు ఇష్టమైన క్రీడలకూ వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో తల్లితో కలిసి పాచి పనులకు వెళ్లేది. జవహర్‌ భారతి కళాశాల వసతి గృహంలో ఔట్‌ సోర్సింగ్‌ వంట సహాయకుడిగా పనిచేసే కొండయ్యను వివాహం చేసుకుంది. తనకో కూతురు, కొడుకు. వారిని చదివించేందుకు మళ్లీ పాచి పనులకు వెళ్లేది. వాళ్లిద్దరినీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దేంత వరకూ విశ్రమించలేదు.

మలుపు తిప్పిన రైలు ప్రయాణం...
2016లో ఓసారి నెల్లూరులో ఉన్న కూతురిని చూసేందుకు రామసుబ్బమ్మ రైల్లో వెళుతోంది. బోగీలో నలభై ఏళ్లకు పైబడిన కొందరు క్రీడా దుస్తుల్లో కనిపించారు. ఆమెకు చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. నాటి పరుగు పందాలు, గెలిచిన బహుమతులు కళ్ల ముందు కదిలాయి. వారిలో ప్రముఖ క్రీడాకారిణి జెట్టి రాజేశ్వరితో మాట కలిపింది. వెటరన్‌ క్రీడా పోటీల్లో పాల్గొని వెళుతున్నారని తెలుసుకుంది. తనకూ మళ్లీ ఆటలాడాలని, పోటీల్లో పాల్గొనాలని ఉందని వాళ్లతో చెప్పింది. వారు ఎంతో సంతోషించారు. రామసుబ్బమ్మ ఆసక్తిని, పట్టుదలను పసిగట్టి వెటరన్‌ క్రీడలపై అవగాహన కల్పించారు. ఇంటికి వచ్చి చుట్టుపక్కల వారితో చర్చించింది తను. ఈ వయసులో నీకు ఆటకెందుకు అని వాళ్లు హేళన చేశారు. కానీ రాజేశ్వరి సహకారంతో నెల్లూరులో కోచ్‌ అయిన కోటేశ్వరమ్మ దగ్గర చేరింది రామసుబ్బమ్మ. అంతే ఇక ఆమె తిరిగి చూసుకోలేదు. క్రీడల్లో మెలకువలు నేర్చుకుని వెటరన్‌ క్రీడాకారిణిగా తనను తాను తీర్చిదిద్దుకుంది.

బంగారు పతకాలెన్నో...
రామసుబ్బమ్మ క్రీడల్లో శిక్షణ తీసుకుని వెటరన్‌ విభాగంలో మాస్టర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల రిలే పోటీల్లో పాల్గొంది. రన్నింగ్‌, వాకింగ్‌, డిస్క్‌త్రో, జావెలిన్‌త్రో పోటీల్లో సత్తా చాటింది. నెల్లూరు, శ్రీహరికోట, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నాసిక్‌, తమిళనాడులోని మంగుళూరు వంటి వివిధ ప్రాంతాల్లో జరిగిన జిల్లా, రాష్ట్ర, జాతీయ వెటరన్‌ పోటీల్లో పాల్గొని అద్భుతంగా రాణించింది. 13 బంగారం పతకాలు, 8 రజత, 3 కాంస్యం పతకాలు సాధించింది. ప్రముఖుల చేతులమీదుగా సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు అందుకొని కావలి పేరును మారుమోగించింది. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.

ఆసరా ఇస్తే ఇంకెంతో సాధిస్తా!

నాకు  క్రీడలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలోనే వదిలేశా. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాతల సహాయంతో పాస్‌పోర్టు కూడా తీసుకున్నా. ఆసరా అందిస్తే మరిన్ని బంగారు పతకాలు సాధిస్తా.

- రామసుబ్బమ్మ

- ఎం.వి.రామణ్యం, కావలి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్