డిగ్రీల టీచర్‌సునీత

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కామర్స్‌ విభాగం అధ్యాపకురాలు డాక్టర్‌ టి.సునీత. చిత్తూరుకు చెందిన మురహరి, స్వరాజ్యభారతి దంపతుల ఏకైక కుమార్తె. మూడేళ్ల వయస్సులో పోలియో సోకింది. ఆ వైకల్యాన్ని మర్చిపోయి చదువుకుంటున్న కూతుర్ని అమ్మానాన్నలు ప్రోత్సహించారు. రోజూ ఎత్తుకుని పాఠశాలలో దింపేవారు వాళ్ల అమ్మ...

Published : 06 Jul 2021 00:40 IST

ఒక్క డిగ్రీ పూర్తి చేయడానికే నానా తంటాలు పడుతుంటారు కొందరు. ఇక ఉద్యోగం వస్తే చదువుని పూర్తిగా మర్చిపోతారు. డాక్టర్‌ సునీత అలా కాదు. వైకల్యాన్ని జయించి ఉద్యోగం సాధించడమే కాదు.. పట్టుదలతో ఏడు డిగ్రీలూ, రెండు పీహెచ్‌డీలూ సాధించారు.  

పీజీలు 2
ఎంఈడీలు 2
ఎంఫిల్‌ 1
పీహెచ్‌డీలు 2

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కామర్స్‌ విభాగం అధ్యాపకురాలు డాక్టర్‌ టి.సునీత. చిత్తూరుకు చెందిన మురహరి, స్వరాజ్యభారతి దంపతుల ఏకైక కుమార్తె. మూడేళ్ల వయస్సులో పోలియో సోకింది. ఆ వైకల్యాన్ని మర్చిపోయి చదువుకుంటున్న కూతుర్ని అమ్మానాన్నలు ప్రోత్సహించారు. రోజూ ఎత్తుకుని పాఠశాలలో దింపేవారు వాళ్ల అమ్మ. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు సునీత. పదోతరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ ఇలా అన్నింటిలోనూ తనది ప్రథమ స్థానమే. బీఈడీ చేసి 22 సంవత్సరాలకే తితిదే బధిర పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉద్యోగం సాధించారు. ఇవన్నీ అమ్మ ప్రోత్సాహం వల్లనే సాధ్యమయ్యాయి అంటారామె.

కొనసాగిన విద్య...

తాను కోరుకున్న ఉపాధ్యాయిని ఉద్యోగం వచ్చింది. ఇక చాల్లే అని తృప్తిపడలేదు. ఉద్యోగం, కుటుంబ బాగోగులు చూసుకుంటూ మరిన్ని డిగ్రీలు, డాక్టరేట్లు సాధించారు. ఎస్వీయూలో ఎమ్మే సోషియాలజీ చేశారు. తర్వాత 1999-2002 విద్యాసంవత్సరంలో ఎంఫిల్‌ పూర్తి చేశారు. అన్నామలై యూనివర్సిటీలో జనరల్‌ ఎంఈడీ కోర్సు చేశారు. 2003లో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీహెచ్‌డీలో చేరారు. 2004లో దూరవిద్యా విధానంలో బీఏ, అనంతరం ఎంకాం చదివారు. 2005లో ఏడాదిపాటు ఉద్యోగానికి సెలవుపెట్టి మహిళా వర్సిటీలో రెగ్యులర్‌ పద్ధతిలో స్పెషల్‌ ఎంఈడీ కోర్సు చేశారు. 2011లో ‘మూగ పిల్లల్లో భాషాభివృద్ధి’ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఇటీవలే కామర్స్‌లో పరిశోధన చేసి రెండో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

29 ఏళ్ల బోధనానుభవం

1992లో అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించిన సునీత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమందిలో స్ఫూర్తినీ నింపారు. కళాశాలలో సాధారణ ఉద్యోగులు చేసే పనులన్నీ సునాయాసంగా చేసుకుంటూ వారికి పోటీగా నిలుస్తున్నారు. తాజాగా సావిత్రీబాయ్‌ఫూలే అవార్డు అందుకున్నారు. 2014లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం వచ్చినా ...పద్మావతి డిగ్రీ కళాశాలలో తాను చేస్తున్న ఉద్యోగంపై ఇష్టంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. మంచి అధ్యాపకురాలిగా విద్యార్థినుల మనస్సుల్లో నిలిచిపోవాలనే తన ఆకాంక్ష అంటున్నారామె.  

-గుడికోన కృష్ణకుమారి, తిరుపతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్