వజ్రాల కోసం... విమానం ఎక్కేదాన్ని కాదు!

ఓ చిన్న బంగారు గొలుసు వేసుకుని రోడ్డు మీద నడిచి వెళ్లాలన్నా భయంగా ఉంటుంది. కానీ ఆమె... విలువైన వజ్రాలను వెంట పెట్టుకుని రాష్ట్రాలు చుట్టేశారు.  ఎందుకంటే ఆవిడది డైమండ్‌ వ్యాపారం. అప్పటికి ఈ రంగంలో మహిళల సంఖ్య తక్కువే... ఏ మాత్రం తేడా వచ్చినా... కోలుకోలేని నష్టం... మహిళగా నీకు మరింత కష్టం... అన్న మాటల్ని సవాల్‌గా తీసుకుని తన సత్తా నిరూపించుకున్నారు. కస్టమైజ్డ్‌ వజ్రాల నగల తయారీలో తనదైన ముద్ర వేశారు రాధిక మన్నె.

Published : 15 Jul 2021 00:45 IST

ఓ చిన్న బంగారు గొలుసు వేసుకుని రోడ్డు మీద నడిచి వెళ్లాలన్నా భయంగా ఉంటుంది. కానీ ఆమె... విలువైన వజ్రాలను వెంట పెట్టుకుని రాష్ట్రాలు చుట్టేశారు.  ఎందుకంటే ఆవిడది డైమండ్‌ వ్యాపారం. అప్పటికి ఈ రంగంలో మహిళల సంఖ్య తక్కువే... ఏ మాత్రం తేడా వచ్చినా... కోలుకోలేని నష్టం... మహిళగా నీకు మరింత కష్టం... అన్న మాటల్ని సవాల్‌గా తీసుకుని తన సత్తా నిరూపించుకున్నారు. కస్టమైజ్డ్‌ వజ్రాల నగల తయారీలో తనదైన ముద్ర వేశారు రాధిక మన్నె. ఆ వివరాలు వసుంధరతో పంచుకున్నారు.

ష్టనష్టాలకు, అడ్డంకులకు భయపడి వెనకడుగు వేస్తే జీవితాన్ని నచ్చినట్లు డిజైన్‌ చేసుకోలేం. అలానే నగల డిజైనర్‌గా ప్రత్యేకతను, గుర్తింపుని తెచ్చుకోవడం కూడా ఒక్కరోజులో జరిగిపోలేదు. ముందు నుంచీ అనుకుని ఈ రంగంలోకి రాలేదు. మాది గుడివాడ. నా ఎనిమిదేళ్ల వయసులో మా అమ్మ చనిపోయింది. దాంతో గుంటూరులో అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగా. డిగ్రీ అవ్వగానే పెళ్లయ్యింది. మా వారితో కలిసి బెంగళూరు వెళ్లిపోయా. అక్కడ ఆయన రియల్‌ ఎస్టేట్‌ చేసే వారు. ఖాళీగా ఉండకుండా ఏదైనా సొంతగా చేయాలనుకున్నా. అది పది మందికీ ఉపాధి కూడా చూపించేదై ఉండాలని అనుకున్నా. అప్పుడే అమెరికాలో డాక్టర్‌గా పని చేసే మా బావగారు ఆ దేశంలో నర్సుల కొరత గురించి, విదేశాల నుంచి రప్పించుకుంటోన్న విధానం గురించి చెప్పారు. ఆ ఉద్యోగానికి అవసరమైన అర్హత పరీక్ష మన దేశంలో రాసే వీలు లేక... శ్రీలంక వంటి దేశాలకు వెళ్లి రాయాల్సి వచ్చేది. సరిగ్గా అదే సమయంలో మన దేశంలో ఆ అవకాశం కల్పిస్తున్నారని తెలిసింది. దాంతో బెంగళూరులో నర్సింగ్‌ మాన్‌పవర్‌ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశా. కొచ్చి, చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరుల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించాం. అన్ని వ్యవహారాలూ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించే వాళ్లం. ఈ పనుల మీద తరచూ అమెరికా వెళ్లొచ్చే దాన్ని. అంతా బాగుందనుకుంటే ఒబామా ప్రభుత్వం వచ్చింది. స్థానికులకే ఉద్యోగావకాశాలు అంటూ చట్టం చేశారు. నా కన్సల్టెన్సీ ఆగిపోయింది. అప్పటికే భారీగా పెట్టుబడి పెట్టా. ఇక నష్టపోయినట్లే అని అర్థమయ్యాక డిప్రెషన్‌లోకి వెళ్లా. కానీ పగలు, రాత్రి ఒకదాని వెనకే మరొకటి ఉన్నట్లు జీవితం కూడా అంతే అని సర్ది చెప్పుకున్నా.

కోటి రూపాయలకు గుప్పెడు డైమండ్లు...

ఆ ఆలోచనల నుంచి బయటపడాలంటే... కొత్తదారి వెతుక్కోవాలి. అంతకు కొన్నేళ్ల ముందే వజ్రాలు, నగల పట్ల నా ఆసక్తిని చూసిన వజ్రాల వ్యాపారి ఒకరు జెమాలజీ కోర్సు చేయమని సలహా ఇచ్చారు. నేను ఆసక్తి చూపించలేదు. మళ్లీ ఆయనే ‘మీకు చక్కటి అభిరుచి ఉంది... ఈ రంగంలోనూ మంచి పేరు సంపాదించగలరు. ప్రయత్నించండి’ అని చెప్పారు. సరేనని బెంగళూరులోనే జెమాలజీ కోర్సు చేశా. అప్పటికి నా వయసు 34. ఈ కోర్సు భిన్నమైంది. మ్యాథ్స్‌, సైన్స్‌ అర్థమయ్యేవి కావు. రాత్రింబవళ్లూ చదివితే కానీ పట్టు చిక్కలేదు. తర్వాత రెండేళ్లు ఆయనతో పని చేసి డైమండ్‌ గ్రేడింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌, డిజైనింగ్‌.. అన్నింట్లోనూ పట్టు సాధించా.

వజ్రాల వ్యాపారం అంటే భారీగా పెట్టుబడి పెట్టాలి. కోటి రూపాయలకు గుప్పెడు వజ్రాలు కూడా రావు. అయినా సరే! ఉన్నదంతా పెట్టి మరో సాహసం చేశా. నా మెంటార్‌తోనే కలిసి హోల్‌సేల్‌ వ్యాపారం చేశా. ఇలా చేసిన మొదటి దక్షిణాది మహిళను బహుశా నేనే! మగ వాళ్లే రిస్క్‌ అనుకునే ఈ బిజినెస్‌ని ఒంటరిగానే చేస్తున్నా. నాలుగైదు కోట్ల రూపాయల వజ్రాల నగలు వెంట పెట్టుకుని రాష్ట్రాలు తిరిగే దాన్ని. ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌ సమస్యలతో బస్సుల్లోనే వెళ్లాల్సి వచ్చేది. భద్రత దృష్ట్యా ఎక్కడికి వెళ్లేదీ మా వారికీ చెప్పేదాన్ని కాదు. ఒక్కోసారి ప్రయాణంలో రాత్రంతా వాష్‌రూమ్‌కి కూడా వెళ్లలేక పోయేదాన్ని. ఆ రోజులు చాలా కష్టంగా ఉండేవి. ఇలానే ఏడేళ్లు దక్షిణాది అంతా తిరిగేశా.

సెలబ్రిటీలకు నగలు చేసిస్తా...

వ్యాపారం నిమిత్తం తరచూ హైదరాబాద్‌కి వచ్చేదాన్ని. ఇక్కడ వందల ఏళ్ల నాటి షాపులెన్నో ఉన్నాయి. కొత్తవాళ్లు, అందునా స్త్రీలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. సాధారణంగా బంగారు, వజ్రాల నగల వ్యాపారంలో నమ్మకం, స్థిరత్వం ప్రధానం. ఖాతాదారుకి డిజైన్‌ ఎంతగా నచ్చినా సంస్థ ఎన్నేళ్లుగా ఉందనే చూస్తారు. కొత్త కావడంతో ఖాతాదారులను ఆకట్టుకోవడానికి మొదట్లో చాలా కష్టపడ్డా. నాణ్యమైన వజ్రాలను అందించడమే నన్ను నిలబెట్టింది. దక్షిణాదిలో ఆడంబరాన్ని కోరుకునేది తెలుగు ప్రజలే. అందుకే హైదరాబాద్‌ కేంద్రంగా ‘రాధిక డైమండ్స్‌’ పేరుతో కస్టమైజ్డ్‌ జ్యూయలరీ దుకాణాన్ని ప్రారంభించా.

ఇప్పుడు ప్రత్యేకంగా చేసిచ్చే బొటిక్‌ జ్యూయలరీకి ఆదరణ పెరిగింది. దాంతో ఫ్యాషన్‌ డిజైనర్‌ శశి వంగపల్లితో కలిసి మరో వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ని ఏర్పాటు చేశాం. కొద్ది కాలంలోనే సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎందరికో డిజైనర్‌ నగలు చేసిచ్చే అవకాశం దొరికింది. వజ్రాల నగలు తరతరాలకూ ఉంటాయి. వాటితో పాటే నా పేరు కూడా...! ముప్పైమందికి ఉపాధీ కల్పించగలిగా. ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది చెప్పండి.

 


మంచిమాట

జీవితంలో సాధించే విజయాలన్నీ మన ప్రతిభ, కృషి మీదే ఆధారపడి ఉంటాయని గుర్తించండి.

- దీపికా పదుకొణె, బాలీవుడ్‌నటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్