భారతసంతతి మహిళకు యూరోపియన్‌ ఇన్వెంటర్‌ పురస్కారం

ఇండో అమెరికన్‌ శాస్త్రవేత్త సుమితా మిత్రాను ప్రతిష్ఠాత్మక ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌’ అవార్డు వరించింది. దంతవైద్యంలో నానోటెక్నాలజీ  వినియోగం దిశగా పరిశోధనలు చేపట్టి, ‘నాన్‌ యూరోపియన్‌ కంట్రీ’ విభాగంలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారీమె.

Published : 29 Jul 2021 01:53 IST

ఇండో అమెరికన్‌ శాస్త్రవేత్త సుమితా మిత్రాను ప్రతిష్ఠాత్మక ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌’ అవార్డు వరించింది. దంతవైద్యంలో నానోటెక్నాలజీ  వినియోగం దిశగా పరిశోధనలు చేపట్టి, ‘నాన్‌ యూరోపియన్‌ కంట్రీ’ విభాగంలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారీమె.
దంతాలకు ఫిల్లింగ్‌ చేసేటప్పుడు వాటి రంగుకు సరి పోయేలా, అతి తేలికైన, బలమైన పదార్థాన్ని సుమితా ఆవిష్కరిచారు. దీన్ని నానోటెక్‌ ఫిల్లింగ్‌ అంటారు. అమెరికాలోని ఓ పరిశోధనా సంస్థలో నోటి సంరక్షణా విభాగంలో కెమిస్ట్‌ ఆవిడ. అక్కడ పని చేస్తూనే నానోటెక్‌ ఫిల్లింగ్‌పై సుదీర్ఘకాలం పరిశోధనలు చేశారు. అక్కడ పదవీ విరమణ చేసినా తన కృషిని ఆపలేదు. 2010లో సొంతంగా ‘మిత్రా కెమికల్‌ కన్సల్టింగ్‌’ ప్రారంభించారు. దీని ద్వారా కెమికల్‌ సైన్సెస్‌లో టెక్నాలజీ, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌పై కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను అందించే వారు. దంతవైద్యంలో వినియోగించే పదార్థాలు, నానోటెక్నాలజీ వంటి ఆధునిక విధానాల్లోనూ సేవలందించారు.

పరిశోధనా ఫలితం... పాలిమర్‌ కెమిస్ట్రీలో తన అనుభవానికి పలు పరిశోధనలను జోడించారు సుమితామిత్ర. నానో క్లస్టర్స్‌ అనే పదార్థాన్ని అభివృద్ధి చేశారు. నానోపార్టికల్స్‌ నుంచి తయారైన ఈ పదార్థం దంతాల ఫిల్లింగ్‌కు అనువుగా ఉంటుంది. ఇప్పటి వరకు వినియోగిస్తున్న పదార్థాల కన్నా ఇది మరింత నాణ్యమైంది. అంతేకాదు, చాలా తేలికగా ఉండటంతోపాటు పటిష్టమైంది. దంతాల్లో కావిటీని పూడ్చటానికి ఉపయోగించినప్పుడు వాటి రంగుకు సరిపడేలా మ్యాచ్‌ చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఫిల్లింగ్‌ చేసినట్లుగా కనిపించకుండా, సహజసిద్ధమైన దంతాల్లా కనిపించేలా చేసే ఈ నానోక్లస్టర్స్‌ వైద్యులు, దంత రోగులను ఆకట్టుకుంది. ప్రజలకు ఉపయోగపడే అంశంలో గొప్ప పరిశోధనలు చేసే వారికి ఏటా యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డు’ ఇస్తుంది. ఈ ఏడాది పురస్కారానికి సుమితా మిత్రా ఎంపికయ్యారు. ‘నానో టెక్నాలజీ విధానం ఓ కొత్త ప్రయోగానికి అవకాశాన్నిచ్చింది. నేను కనిపెట్టిన ఈ పదార్థాన్ని పాడైన దంతాలను ఫిల్‌ చేయడానికి మాత్రమే కాకుండా, దంతాలకు పాలిష్‌, ముందు వరుసలో ఉండే దంత సమస్యలకు వినియోగించొచ్చు. దీని వల్ల అందరికీ స్వేచ్ఛగా నవ్వగలిగే అవకాశం లభిస్తుంది. అంతే కాదు, దీర్ఘకాల దంత సమస్యలకూ ఇది పరిష్కారాన్నిస్తుంది. ఈ అవార్డు నాకు ప్రత్యేకం’ అని చెబుతున్నారు సుమితామిత్రా. గొప్ప పరిశోధకురాలిగా గుర్తింపు పొందిన సుమితా మిత్రా 2018లో ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ నుంచి ‘హీరోస్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ’ అవార్డును దక్కించుకున్నారు. అంతేకాదు, ‘ఐఏడీఆర్‌ పేన్‌ స్కిన్నర్‌’తోపాటు మరెన్నో పురస్కారాలనూ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్