ఈ క్షోభ..మరెవరికీ వద్దనీ!

ఉన్నత స్థాయి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్లింట్లో వాళ్లకి ఇష్టం లేకుండా చేసుకుని పెద్ద నేరం చేసిందని ఆమెకు అప్పుడు తెలీదు. ఫలితం.. పదమూడేళ్ల జైలు. కన్నబిడ్డలనూ చూసుకోలేని స్థితి. కోర్టు నిర్దోషిగా తేల్చినా.. పిల్లలు మాత్రం దోషిగానే చూశారు. కానీ ఆమె కుంగి పోలేదు.

Published : 05 Aug 2021 01:14 IST

ఉన్నత స్థాయి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్లింట్లో వాళ్లకి ఇష్టం లేకుండా చేసుకుని పెద్ద నేరం చేసిందని ఆమెకు అప్పుడు తెలీదు. ఫలితం.. పదమూడేళ్ల జైలు. కన్నబిడ్డలనూ చూసుకోలేని స్థితి. కోర్టు నిర్దోషిగా తేల్చినా.. పిల్లలు మాత్రం దోషిగానే చూశారు. కానీ ఆమె కుంగి పోలేదు. ఆగిపోలేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. జైలు పాలవుతున్న నిర్దోషులకు న్యాయం జరిగేలా చూస్తోంది. అపరాజితా గంగూలీ బోస్‌ జీవితగాథ ఇది...

అపరాజిత... మధ్యతరగతి అమ్మాయి. కునాల్‌ బోస్‌ను ప్రేమించింది. వాళ్ల ప్రేమకు అతని ఇంట్లో వాళ్లు అడ్డుచెప్పారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. జీవితం అన్యోన్యంగానే సాగింది. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. కానీ అత్తగారి తీరు మారలేదు. రోజూ ఏదో విషయంలో మాటలనేది. భర్త కోసం అన్నింటినీ భరించేదామె.

ఇంతలో తన జీవితం అనుకోని మలుపు తిరిగింది. 1999లో కునాల్‌ తన స్నేహితుడి వ్యాపారానికి అప్పు ఇచ్చారు. తర్వాత ఆ విషయంలో స్నేహితులిద్దరికీ తేడాలొచ్చాయి. కొట్టుకునే వరకూ వెళ్లారు. అప్పుడే తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని అపరాజిత పుట్టింటికి వెళ్లింది. కునాల్‌ రెండు రోజులుగా ఇంటికి రాలేదని అత్తగారి ఫోన్‌. ఆయన స్నేహితుడికి ఫోన్‌ చేస్తే స్పందన లేదు. మిస్సింగ్‌ కేసు పెట్టింది. వారం తర్వాత భర్త శవంగా కనిపించాడు. అప్పటికి పిల్లలకు ఐదు, మూడేళ్లే. దిక్కుతోచని పరిస్థితి ఆమెది. తర్వాత ఎంక్వైరీ కోసమని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమే తన భర్తను చంపినట్లు కేసు నమోదు చేశారు. అలా ఫిర్యాదు చేసిందీ అత్తగారే. పేపర్లలో ‘ప్రియుడి కోసం భర్తనే చంపిద’నే వార్త. నిజం చెప్పమని అత్తని ఎంత ప్రాథేయపడినా లాభం లేకపోయింది. పైగా ఆవిడ బెయిల్‌ రాకుండా అడ్డుపడింది. ‘చిన్న జైలు గదిలో ఎంతో మందిమి ఉండేవాళ్లం. జైలర్‌కి ఏదైనా నచ్చకపోతే కొట్టేది. అలా 13 ఏళ్లు గడిపాను. పిల్లల్ని ఒక్కసారి చూపించమన్న కోరికా అత్తింటి వాళ్లు తీర్చలేదు. ఆఖరికి మా నాన్నని చివరి చూపూ చూసుకోలేకపోయా...’ అని వివరించింది అపరాజిత.

2013లో బెయిల్‌ లభించింది. ‘బయటికొచ్చాక చేయాలనుకున్న మొదటి పని నా పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం. కానీ మా అత్తగారు ఒప్పుకోలేదని’ గుర్తు చేసుకుంది అపరాజిత. తర్వాత ఆమె నిర్దోషని హైకోర్టు, సుప్రీంకోర్టులు తేల్చాయి. పదే పదే ప్రయత్నించగా 2014లో పిల్లల్ని కలిసే అవకాశమొచ్చింది. ‘నాన్నని ఎందుకు చంపావ్‌?’ అన్న ప్రశ్న మినహా వాళ్లేమీ మాట్లాడలేదు. ఆపై కలవడానికీ వాళ్లు ఇష్టపడలేదు. ఆ గుండెకోతను మాటల్లో చెప్పలేను. వాళ్లు నా దగ్గరకు ఎప్పుడు వచ్చినా ఆనందమే. రాకపోతే.. ఇంతకన్నా బాధపడేదేమీ లేదు’ అని సర్ది చెప్పుకుంది. ముదిమి దశలో ఉన్న తల్లి ఆమెను అక్కున చేర్చుకుంది. ఆమెతో కలిసి ఓ ఎన్‌జీవోలో పిల్లలను చూసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో మానవ హక్కుల సంఘం గురించి తెలుసుకుంది. తన జీవిత గమ్యం ఇదేననుకుంది. అయిదేళ్లుగా వారితో కలిసి నిర్దోషులకు న్యాయం కలిగేలా చూస్తోంది. ‘ఇప్పటివరకూ ఎంతో మంది బాధితులకు న్యాయం కలిగేలా చూశా. వాళ్లు అలా జైలు నుంచి బయటకు వస్తోంటే నాకో కొత్త జీవితం లభ్యమైనట్లుగా అనిపిస్తుంటుంది.  కొన్నిసార్లు కునాల్‌ ఉంటే నాకిలా అవ్వకుండా చూసుకునేవాడు కదా అనిపిస్తుంది. మరు క్షణమే... ఈ అభ్యాగులకు సాయం చేయడానికే నాకిలా అయ్యిందేమో అనీ అనిపిస్తుంటుంది. కానీ గతం పట్ల బాధా లేదు... భవిష్యత్‌ కోరికలూ లేవు. వర్తమానంలో ఏం చేయాలన్న దానిపైనే దృష్టి’ అంటోంది తను. ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా సేవకే ప్రాధాన్యమిస్తున్న అపరాజిత స్ఫూర్తి ప్రశంసనీయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్