‘పలుకు’ తేనెల తల్లి..

కొన్ని సెకన్లపాటు చెవులు వినిపించకపోతే? నోటి నుంచి మాట పెగలకపోతే! పెద్ద కష్టమేమీ కాదనిపించొచ్చు. కానీ వారికి పుట్టుక నుంచే ఈ రెండూ లేవు. అందరిలా ‘అయ్యో’ అని ఊరుకోలేదామె. సాయమందించాలనుకుంది. వాళ్ల కాళ్లపై వాళ్లను నిలబెట్టాలనుకుంది. అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టింది. అందుకు నలుగురి సాయమూ తోడైంది. రాజమహేంద్రవరంలోని ‘పలుకు’ విద్యాలయ నిర్వాహకురాలు కనకదుర్గ

Published : 09 Aug 2021 01:07 IST

కొన్ని సెకన్లపాటు చెవులు వినిపించకపోతే? నోటి నుంచి మాట పెగలకపోతే! పెద్ద కష్టమేమీ కాదనిపించొచ్చు. కానీ వారికి పుట్టుక నుంచే ఈ రెండూ లేవు. అందరిలా ‘అయ్యో’ అని ఊరుకోలేదామె. సాయమందించాలనుకుంది. వాళ్ల కాళ్లపై వాళ్లను నిలబెట్టాలనుకుంది. అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టింది. అందుకు నలుగురి సాయమూ తోడైంది. రాజమహేంద్రవరంలోని ‘పలుకు’ విద్యాలయ నిర్వాహకురాలు కనకదుర్గ స్ఫూర్తి ప్రస్థానమిది.

చిన్నప్పుడు మా బంధువుల్లో ఒకరికి పుట్టు చెవుడు, మూగతో బాబు పుట్టాడు. తనకి మాటలు నేర్పించడానికి వాళ్లు ఎంతో ఇబ్బందిపడ్డారు. శక్తికి మించి ఖర్చు చేశారు. అది చూసినప్పుడే ఇలాంటివారికి ఏమైనా చేయాలనుకున్నాను. నిజానికి వీరికి మాట్లాడటమూ, వినడమూ మాత్రమే తెలియదు. మిగతా ఏ విషయంలోనూ ఇతరులతో తీసిపోరు. కొంత సాయం చేస్తే చాలు.. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడతారు. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను.

నా పేరు గంటా కనకదుర్గ. మాది తూర్పుగోదావరి జిల్లా. పదోతరగతి పూర్తవగానే పెళ్లయింది. మావారు వీరవెంకట సత్యనారాయణది ధవళేశ్వరం. ప్రైవేటు ఉద్యోగి. పెళ్లి తర్వాత చదువు కొనసాగించేలా ప్రోత్సహించారు. అలా ఇంటర్‌, డిగ్రీ చదివాను. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో బీఈడీని ఏలూరులో పూర్తిచేశాను. పుట్టుకతో బధిరులైన పిల్లలకు స్పీచ్‌ థెరపీ లాంటి ఖరీదైన వైద్యం చేయించడం సాధారణ కుటుంబాలకు సాధ్యం కాదు. అందరిలా తమ పిల్లలు మాట్లాడితే వినాలని వాళ్లెంత తపిస్తారో! వారికి నావంతు సాయమందించాలనే నా ఆలోచనను ఇంట్లోవారితో పంచుకున్నాను. వారు వెన్నుతట్టి ప్రోత్సహించారు. మొదట్లో సాయం మావారి నుంచే తీసుకున్నాను. వీరికోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నా. అలా ఇరవై మందితో 2009లో ధవళేశ్వరంలో ‘పలుకు’ ప్రారంభమైంది. తోడుగా ప్రత్యేక శిక్షణ పొందిన కొందరు టీచర్లనూ ఎంచుకున్నాను. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచీ తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొచ్చి చేర్పిస్తున్నారు.

అంతా సమానమే!

ప్రస్తుతం 65 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 30 మంది వరకూ ఆడపిల్లలే. ప్రతి వేసవిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారేమో సర్వే చేసి. మా పాఠశాల గురించి చెబుతాం. కొంతమంది పంపడానికి ఇష్టపడరు. వాళ్లు వచ్చి చూసుకునే వీలు కల్పిస్తాం. పిల్లలూ మొదట అలవాటు అవ్వడానికి కాస్త ఇబ్బందిపడతారు. అలవాటు పడ్డాక వయసును బట్టి ప్రణాళిక రూపొందిస్తాం. ప్రతిరోజూ గ్రూప్‌ హియరింగ్‌ సిస్టమ్‌తో స్పీచ్‌ థెరపీ అందిస్తాం. అందుకు తగ్గ పరికరాలనూ ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద పెద్ద శబ్దాలను వినిపించడం.. అది దేనిదో గుర్తుపట్టమనడం లాంటివీ శిక్షణలో భాగంగా ఉంటాయి. ఇది రోజూ రెండు గంటలపాటు ఉంటుంది. ఆపై తరగతులు ఉంటాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడ చదువుకోవచ్చు. డాక్టర్స్‌ స్పీచ్‌’ ద్వారా కంప్యూటర్‌ సంబంధిత అంశాలనూ నేర్పిస్తున్నాం. ఇంటర్‌ నుంచి నగరంలోని కళాశాలల్లో చేర్పిస్తాం. వీరిలో ఆత్మవిశ్వాసం పెంచడం కోసం ఆటలు, నృత్యంలో శిక్షణ వంటివీ అందిస్తున్నా. మా స్కూల్‌కీ యూనిఫాం ఉంటుంది. ఎందుకంటే.. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటారు. సాధారణంగా ఉన్న అబ్బాయి యూనిఫాం, బెల్ట్‌, టై, షూతో వెళితే.. బధిర విద్యార్థి తను వేరే అనో, తక్కువ అనో భావించే అవకాశముంది. అది వాళ్లలో కలగకూడదనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశాం. వీటన్నింటినీ ఉచితంగానే అందిస్తాం. చదువు పూర్తిచేసుకున్నవారికి పోస్టులు ఏవైనా పడితే అప్లికేషన్లు మేమే పెడతాం. లేదా ఫోన్లు చేసి చెబుతాం. ఇప్పటికి 55మంది అలా స్థిరపడ్డారు కూడా.

ముందుకొచ్చారు

ఒక మంచి మనసుతో చేసేపనికి దేవుడూ సాయమందిస్తారంటారు కదా! సరిగ్గా ఈ పాఠశాల ప్రారంభించిన ఇరవై రోజులకు ధవళేశ్వరం సాయిబాబా మందిరం వారు మా గురించి తెలుసుకుని పిల్లలకు రెండు పూటలా భోజన సదుపాయాన్ని అందించడం మొదలుపెట్టారు. అలానే స్థానిక ఎమ్మెల్యే చందన్‌తో పాటు మరెంతో మంది మాకు చేయూతనిచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ ఉచితంగా రెండంతస్థుల భవనం కేటాయించింది. అందులోనే హాస్టల్‌, పాఠశాల నిర్వహిస్తున్నాం. మాకు ఇద్దరు అబ్బాయిలు.. తొమ్మిది, పది తరగతులు చదువుతున్నారు.

- వై.సూర్యకుమారి, రాజమహేంద్రవరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్