విడాకులు చర్చాంశం కాదు

విడాకులపై విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవాలంటోంది రచయిత్రి, వ్యాపారవేత్త శశ్వతి శివ. భర్త నుంచి విడిపోవాలనుకునే మహిళ మనసులోని కల్లోలాన్ని అందరూ గుర్తించాలంటోంది. ఈ అంశంపై

Published : 13 Aug 2021 00:57 IST

విడాకులపై విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవాలంటోంది రచయిత్రి, వ్యాపారవేత్త శశ్వతి శివ. భర్త నుంచి విడిపోవాలనుకునే మహిళ మనసులోని కల్లోలాన్ని అందరూ గుర్తించాలంటోంది. ఈ అంశంపై అందరిలో అవగాహన కలిగించి, ఆ బంధం నుంచి బయటపడాలనుకుంటున్న మహిళలకు చేయూతను అందించేందుకు ఓహెల్ప్‌ గ్రూపునూ నిర్వహిస్తోంది శశ్వతి...

ప్రముఖులు వివాహబంధం నుంచి విడిపోవాలనుకున్నప్పుడు మీడియా నుంచి తెలిసినవారి నుంచి ప్రశ్నల శరపరంపరను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి వ్యక్తిగత విషయాలనూ బహిర్గతం చేయాల్సిన పరిస్థితి. వీటి మీద సామాజిక మాధ్యమాల్లో చర్చలు! పెళ్లికి ముందో, తర్వాతో ప్రేమించిన వ్యక్తితో విడిపోవాలనుకుంటోందంటే దాని వెనుక ఎన్నో బాధాకరమైన కారణాలుండొచ్చు. భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ, సామాజికపరమైన పలు రకాల అంశాలు ఆమె మనసులో దాగి ఉంటాయి. ఇవన్నీ స్వీయ అనుభవంలో గుర్తించింది శశ్వతి. భర్త నుంచి రెండేళ్ల క్రితం విడాకులు కోరినప్పుడు తానెదుర్కొన్న సమస్యలే మరెందరికో అనుభవంలోకి వస్తున్నట్లు గుర్తించింది. ఆ దిశగా ఆలోచించి, 2020లో ప్రారంభించిందే... ‘హాష్‌ ట్యాగ్‌ డైవోర్స్‌ ఈజ్‌ రెగ్యులర్‌’ హెల్ప్‌ గ్రూపు. విడాకులనో కళంకంగా చూపుతున్న వారిని ఎదుర్కోవడం, అది వ్యక్తిగతం అని చెప్పడానికి బాధితులకు ఈ గ్రూపు చేయూతనందిస్తోంది. 

కారణాలు వ్యక్తిగతం...

వివాహం రద్దు చేసుకుంటున్న వారు దానికి కారణాలను పది మందికీ చెప్పాల్సిన అవసరం లేదంటుంది శశ్వతి. ‘జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. తీరా భాగస్వామి నుంచి ఆనందానికి బదులుగా బాధ ఎదురైతే ఆ బంధంలోంచి బయటపడాలనుకోవడం ఆ మహిళ వ్యక్తిగతం. కానీ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే, ఎదురయ్యే విమర్శలు ఆమెను ఒంటరిగా మార్చేస్తున్నాయి. అప్పటికే గందర గోళంగా మారిన జీవితంలో ఆ తర్వాతి అడుగు ఎలా వేయాలో సందిగ్థంలో పడేస్తున్నాయి. కొందరికి కనీసం అమ్మానాన్నలు కూడా పరిష్కారాన్ని చూపించడం లేదు. సమాజం విడాకులను ఇప్పటికీ తప్పుగానే చిత్రీకరిస్తోంది. ఈ సమస్యలన్నింటి గురించి ధైర్యంగా మాట్లాడి, వాటిని ఎదుర్కొనేలా ఈ గ్రూపు ద్వారా అవగాహన కలిగిస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఇప్పటికే వేలమంది మాకు మద్దతు పలుకుతున్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై గళమెత్తుతున్నారు. దుర్భర జీవితాన్ని అనుభవించేకంటే.. అందులోంచి బయటపడటం సిగ్గు పడాల్సిన అంశం కాదంటూ.. ఇది మిగతా విషయాల్లాగే సాధారణమైందంటూ ఈ గ్రూపు ద్వారా ప్రచారం చేస్తున్నాం. అంతేకాదు, సింగిల్‌ మదర్స్‌, విడాకులు తీసుకున్న వారితోపాటు పిల్లల వల్ల ఇంకా విడిపోకుండా కష్టాలను అనుభవిస్తున్న వారు ఇందులో తమ అభిప్రాయాలను పొందు పరుస్తున్నారు. వివాహరద్దులో ఎదురయ్యే ఛాలెంజ్‌ను ఎదుర్కో గలగాలి. అంతేకాదు, దీనికి సంబంధించి ఓ ప్రాజెక్ట్‌గా 14 మంది మహిళల అనుభవాలతో వీడియోలను చిత్రీకరించి సిరీస్‌గా గ్రూపులో పొందు పరిచా. అవగాహన అందించే దిశగా నేను రూపొందించిన ఈ వీడియోలు అందరికీ చేరాలనేదే నా లక్ష్యం. విడాకులంటే బాధాకర జీవితం నుంచి బయటకు రావడమే తప్ప, జీవితమే ముగిసిపోయినట్లు కాదు అనేదే మా నినాదం’ అంటున్న శశ్వతి జంతువుల సంరక్షణ కోసం ‘కౌవాతీ’ అనే స్వచ్ఛంద సంస్థనూ స్థాపించింది. టెడెక్స్‌ వంటి పలు వేదికలపై వివాహ సమస్యలపై అవగాహన ప్రసంగాలు చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్