మిద్దెతోటలో కాసులు పూయిస్తూ...

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాపించి, లాక్‌డౌన్‌ విధించిన సమయమది. గడపదాటి బయటకు రాలేని పరిస్థితి. బాల్కనీలో సరదాగా పెంచిన మల్లె మొక్కలు ఆమెకో కొత్త ఆలోచన ఇచ్చాయి. ఆ ఆలోచనే ఏడాది తిరిగే సరికల్లా ఆమెను...

Updated : 15 Aug 2021 05:04 IST

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాపించి, లాక్‌డౌన్‌ విధించిన సమయమది. గడపదాటి బయటకు రాలేని పరిస్థితి. బాల్కనీలో సరదాగా పెంచిన మల్లె మొక్కలు ఆమెకో కొత్త ఆలోచన ఇచ్చాయి. ఆ ఆలోచనే ఏడాది తిరిగే సరికల్లా ఆమెను చిరు వ్యాపారిగా  మార్చింది.  కేవలం మిద్దెతోటతోనే స్వయంఉపాధి సాధించిన  కిరానా దేవిక కథనం ఇదీ...

చిన్నప్పటి నుంచి తోట పెంపకమంటే కిరానాకు ఆసక్తి. కర్ణాటకలోని మంగుళూరు తనది. పెళ్లైన తర్వాత బాల్కనీలో పూల మొక్కలను పెంచేది. వాటిలో మూడు నాలుగు మల్లె మొక్కలుండేవి. గతేడాది లాక్‌డౌన్‌లో ఆ మొక్కలకు పూలు పూశాయి. వాటిని చూసి కొత్తగా ఆలోచించింది కిరానా. వీటితోనే మిద్దెతోట మొదలు పెడితే ఎలా ఉంటుందని భర్త మహేష్‌ను అడిగింది. అతడి ప్రోత్సాహంతో పని మొదలుపెట్టింది.

అవగాహన పెంచుకుంటూ...
మల్లెల సాగుపై అధ్యయనం ప్రారంభించింది. యూట్యూబ్‌ వీడియోలు చూసేది. నర్సరీల వాళ్లతో మాట్లాడేది. తన తోట తనకు ఆర్థిక చేయూతగా మారాలనుకుని, ఉడుపి మల్లెలను ఎంచుకుంది. లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యే సమయానికి ఇంటికి దగ్గర్లోని ఓ నర్సరీలో ఈ రకం మల్లెమొక్కలు ఎక్కువగా ఉండటం గుర్తించింది కిరానా. ‘నర్సరీ మూసేసే సమయానికి అక్కడ ఉన్న మొత్తం 90 మల్లె మొక్కలను రూ.3వేలు పెట్టి కొనుక్కున్నా. అప్పటికే ఇంటి వెనుక తొట్టెలు విక్రయించే ఉత్తర భారత దేశానికి చెందిన ఓ కుటుంబం లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వాతో మాట్లాడి మొత్తం 100 తొట్టెలను రూ.6,500 ఇచ్చి తీసుకున్నా. మా వారి సహకారంతో మిద్దె మీద మల్లెల పెంపకం ప్రారంభించా. గతేడాది చివరికల్లా మొక్కలు మొగ్గలు తొడిగాయి. దీనికంతటికీ నా పెట్టుబడి రూ.12వేలు. ఇప్పుడు నాకు నెలకు రూ.15, 16 వేలు ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.లక్షకు పైగానే సంపాదించాను. తెలిసిన వాళ్లు ఇంటికే వచ్చి కొనుక్కుంటున్నారు. పూలమ్మే వాళ్లు కూడా వచ్చి తీసుకెళ్తారు. కాస్తంత కష్టం, కొంచెం ఆసక్తి ఉంటే చాలు. ఈ పూల పెంపకం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందొచ్చు. దీనికి నేనే ఉదాహరణ’ అంటోంది కిరానా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్