అఫ్గాన్‌ సంక్షోభ వేళ.. అతివల తెగువ!

ఎటు చూసినా తాలిబన్లు..  పారిపోయిన దేశ అధ్యక్షుడు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు.. రైళ్లు, బస్సుల్లోలా కిక్కిరిసిన విమానాలు.. సామాజిక మాధ్యమాల నిండా సాయం కోసం అర్థింపులు.. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి ఇదీ. ఇలాంటి సమయంలోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కొందరు ధీర మహిళలు. తాలిబన్ల శిక్షల గురించి వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. అంత కఠినంగా ఉంటాయి. పైగా ఆడవాళ్లకు అన్నింటా ఆంక్షలే. ఎక్కువ శాతం మంది...

Updated : 19 Aug 2021 12:42 IST

ఎటు చూసినా తాలిబన్లు..  పారిపోయిన దేశ అధ్యక్షుడు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు.. రైళ్లు, బస్సుల్లోలా కిక్కిరిసిన విమానాలు.. సామాజిక మాధ్యమాల నిండా సాయం కోసం అర్థింపులు.. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి ఇదీ. ఇలాంటి సమయంలోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కొందరు ధీర మహిళలు.


తాలిబన్లను ఢీకొట్టింది...

అఫ్గాన్‌లో మహిళా భద్రత గురించే ప్రతి ఒక్కరి దిగులూ... అలాంటి చోట ఓ వనిత... వారి ఆగడాలను ఎదిరించింది. తాలిబన్లతో పోరాడేందుకు సైన్యాన్ని ఏర్పాటు చేసింది... వారి తుపాకీ గుళ్లకు ఎదురెళ్లింది. అగ్రనేతలే... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న వేళ... తన నగరాన్ని దక్కించుకోవడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది. ఆ ధీర ఇప్పుడు తాలిబన్ల చేతిలో బందీ ఆయింది... అయినా ఆమె తెగువ అక్కడి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంతకీ ఎవరీమె? ఏంటా కథ అంటారా?

సలీమా మజారీ.. ఇరాన్‌లో శరణార్థిగా పుట్టి పెరిగిన అఫ్గాన్‌ జాతీయురాలు. సోవియట్‌ యుద్ధం తర్వాత ఆమె కుటుంబం దేశం విడిచి వెళ్లిపోయింది. తొమ్మిదేళ్ల క్రితమే తన భర్త, పిల్లలతో కలిసి సొంత గడ్డపై తిరిగి అడుగు పెట్టిందామె. ‘నేను ఎప్పటికీ శరణార్థిగా ఉండాలనుకోలేదు. నా దేశాన్ని పునర్నిర్మించుకోవడం కోసమే ఇప్పుడు తిరిగి వచ్చా’ అని తరచూ చెప్పే సలీమా... బల్క్‌ ప్రావిన్స్‌ జిల్లాలోని చాహర్‌కింట్‌ జిల్లా గవర్నర్‌గా పనిచేస్తోంది. ఇలా పని చేసిన తొలి మహిళ కూడా తనే.

సలీమా తన ఆశయాలకు అనుగణంగా చివరి క్షణం వరకూ దేశాన్ని, తన ప్రాంతాన్నీ కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కీలక నేతలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతుంటే... ఆమె మాత్రం ప్రజల మధ్యే తిరిగింది. తాలిబన్‌ ముష్కరులకు అడ్డుకట్ట వేయడానికి వ్యూహాలు పన్నింది. ఎలాగైనా తన నగరాన్నీ, ప్రజల ప్రాణాల్నీ కాపాడటానికీ ప్రయత్నించింది.

అమెరికా దళాలు వెనక్కి వెళ్తోన్న తరుణంలోనే... తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్నీ ఆక్రమించుకుంటున్నారనే వార్త సలీమా చెవినపడింది. దాంతో వారిపై పోరాటానికి తన సైన్యాన్ని సిద్ధం చేసింది. నేరుగా యుద్ధం చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల అన్ని జిల్లాలూ తాలిబన్ల వశమైనా చాహర్‌ కిట్‌ని చేజిక్కించుకోవడానికి మాత్రం వారు కాస్త ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది. ఇందుకు సలీమా పోరాట పటిమే కారణం. బల్క్‌ ప్రావిన్స్‌ వారు పూర్తిగా దక్కించుకుంటున్నారని తెలిసినా... పోరాడుతూనే ఉంది. చివరికి ఆ నగరం వారి చేతుల్లోకి రావడం, సలీమా శత్రువుల చేతికి చిక్కడం రెండూ... వెను వెంటనే జరిగిపోయాయి.

ఉన్నత విద్యావంతురాలు...

సలీమా ఇరాన్‌లో టెహ్రాన్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. కొన్నాళ్లు ‘ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌’లో పనిచేసింది. తర్వాత... ఆఫ్గాన్‌లో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామి కావాలనుకుంది. అలా సలీమా కుటుంబం తిరిగి ఆఫ్గానిస్థాన్‌లో అడుగుపెట్టింది. చార్కింట్‌ వారి పూర్వీకుల ప్రాంతం. అందుకే ఆ కుటుంబం అక్కడే స్థిరపడింది. 2018లో ఆ జిల్లా గవర్నర్‌ పదవికి ఖాళీ ఏర్పడటంతో... దరఖాస్తు చేసుకుంది. అన్ని అర్హతలూ ఉండటంతో అది సలీమానే వరించింది. కొంతకాలానికే అక్కడి పరిస్థితులు తనకు అవగతమయ్యాయి. ఆ ఉద్యోగం తను ఊహించినట్లు లేదు. ‘ఈ బాధ్యతల్లో చాలావరకూ సైనిక సంబంధిత పనులు ఇమిడి ఉంటాయి. నేను అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావాలనుకున్నా. కానీ ఎక్కువ వనరుల్ని భద్రత కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వ్యవస్థలో అవినీతి, రాజకీయ గందరగోళాలే దేశాన్ని అనిశ్చితిలో పడేస్తున్నాయనేది’ సలీమా ఆరోపణ.

ప్రజాసైన్యం ఏర్పాటు...

తాలిబన్లు తరచూ చార్కింట్‌ చుట్టుపక్కల గ్రామాలు, పోలీస్‌ అవుట్‌పోస్టులపై దాడిచేసి ఆయుధాలు, వస్తువులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకునేవారు. స్థానికుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యవస్థలపై దాడులు చేయించేవారు. వీటికి చెక్‌ పెట్టాలనుకుంది. మొదటిసారి తుపాకీని అంత దగ్గరగా చూడటం ఇక్కడే అనే సలీమా... ‘తుపాకీ రక్షణల మధ్య ఉండటం కాదు...ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం నేను నిలబడతా’ అని చెప్పేది. ఇందుకోసం ప్రజల్నే సైన్యంగా మార్చాలనుకుంది. మత పెద్దలు, గ్రామ నాయకుల్ని కలిసి... భవిష్యత్తు గురించి చెప్పేది. అభివృద్ధి ఉంటే బతుకులు ఎలా బాగుపడతాయో వివరించేది. ఇందుకోసం తాలిబన్లపై పోరాటానికి వారందరి మద్దతూ కూడగట్టింది. అక్కడి ప్రజలు కూడా ‘తమ కుటుంబాల్ని, వనరుల్ని కాపాడుకునేందుకు’ సలీమాకు మద్దతిచ్చారు.అవసరమైన ఆయుధాల్ని కొనుక్కునేందుకు తమ పశువుల్ని సైతం అమ్మేశారు. తుపాకులు కొని... వంతుల వారీగా గస్తీలు తిరిగి వాళ్ల ఊళ్లను కాపాడుకునే వారు. మరోవైపు తాలిబన్‌ ఫైటర్లతో మాట్లాడి లొంగిపోయేలా ఒప్పించడంలోనూ సఫలమైంది. ఆమె మాటలకు ప్రభావితమై 125 మంది ఫైటర్లు లొంగిపోయారు. ఈ క్రమంలోనే ఆమె అనేక సార్లు దాడుల నుంచీ తప్పించుకుంది. తర్వాత మరింత మంది మారేలా చేస్తాననీ చెప్పింది. కానీ ఇంతలోనే అంతా తారుమారైంది. ఆవిడ క్షేమంగా బయటికి వచ్చి మరిన్ని ప్రజా పోరాటాలు చేయాలని ఆకాంక్షిద్దాం!


పరిస్థితిని కళ్లకు కడుతోంది

తాలిబన్ల శిక్షల గురించి వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. అంత కఠినంగా ఉంటాయి. పైగా ఆడవాళ్లకు అన్నింటా ఆంక్షలే. ఎక్కువ శాతం మంది ఇంటి నుంచి అడుగు బయటపెట్టడానికే భయపడుతున్నారు. కానీ.. హసిబా అతక్‌పల్‌ ధైర్యంగా బయటకు రావడమే కాదు, అక్కడి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తోంది.

హసిబా...టోలో అనే వార్తా ఛానెల్‌లో పనిచేస్తోంది. ఇది కాబూల్‌లో ప్రధాన వార్తా సంస్థ. తాలిబన్లు కాబూల్‌లో కాలు మోపారని తెలియగానే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్డు మీద చుట్టూ తాలిబన్‌లు చేతుల్లో తుపాకులతో తిరుగుతున్నారు. కానీ ఈమె ఏమాత్రం బెదురు లేకుండా పరిస్థితిని కెమెరా ముందు వివరిస్తోంది. ఈ వీడియోను ఆ వార్తా సంస్థ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఆమె వృత్తి ధర్మాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు అడుగుపెట్టాక చాలామంది ముఖ్యంగా ఆడవాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాలను వదిలేసి ఇంటికే పరిమితమయ్యారు. ప్రజల జీవితాలకు ఎలాంటి హానీ కలిగించబోమనీ, ఆడవాళ్లూ సామాజిక కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని ప్రకటించాక మహిళా జర్నలిస్టులూ విధుల్లో తిరిగి చేరుతున్నారు. తాలిబన్ల మధ్య నిలబడి వార్తలు సేకరిస్తూ, నేరుగా వాళ్లనే స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్న మహిళల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఇంకొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ‘ఇన్నేళ్లలో మేం సాధించుకున్న విజయాలు, హక్కులు వృథాగా పోవద్దు’ అంటూ బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ధైర్యంగా ప్రశ్నించింది

తాలిబన్ల పేరు వింటే.. దేశంతో సంబంధం లేకుండా మహామహులే ఉలిక్కి పడుతున్నారు. అలాంటిది యల్దా హకీం వాళ్ల ప్రతినిధి నుంచి ఫోన్‌ వచ్చినా తడబడలేదు.. పైగా ఆఫ్గాన్‌ పౌరుల మనసుల్లోని సందేహాలనూ ప్రశ్నించింది.

యల్దా కుటుంబానిదీ ఆఫ్గనిస్థానే. వీళ్ల కుటుంబం ఆస్ట్రేలియాకు పారిపోయింది. అక్కడే చదువుకుని, బీబీసీలో జర్నలిస్టుగా చేస్తోంది. ఆమె లైవ్‌ ఇంటర్వ్యూలో ఉండగా ఓ ఫోన్‌ వచ్చింది. చేసింది.. తాలిబన్‌ ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌. యల్దా షాక్‌కు గురైనా వెంటనే తమాయించుకుని ఫోన్‌ని లౌడ్‌ స్పీకర్‌లో ఉంచింది. ఆఫ్గనిస్థాన్‌లో శాంతికి భంగం కలిగించబోమనీ, ప్రజలకు సేవ చేస్తామనే సమాచారాన్ని అందివ్వడానికి అతను ఫోన్‌ చేశాడు. కానీ యల్దా అతనిపై ప్రశ్నలను సంధిస్తూ వెళ్లింది. దాదాపు 30 నిమిషాలు ఇంటర్వ్యూ సాగించింది. ప్రభుత్వాధికారంలో ప్రజల భాగస్వామ్యం, శిక్షల అమలు, మహిళల వస్త్రధారణ, విద్యాభ్యాసం మొదలైన అంశాలను ప్రస్తావించింది. భయం గుప్పిట ఉన్న ప్రజలకు ఒక అవగాహన వచ్చేలా చేసింది. ఈమె ధైర్యం, సమయ స్ఫూర్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. 38 ఏళ్ల యల్దాకు ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ఉర్దూల్లో పట్టు ఉంది. గతంలో ఆఫ్గనిస్థాన్‌ అధ్యక్షుడినీ ఇంటర్వ్యూ చేసింది.


ఇరవైయ్యేళ్లలో...

ఏ ఆటంకాలూ లేకపోతే ఎంత సాధించగలమన్నది గత రెండు దశాబ్దాల్లో అఫ్గానీ మహిళలు నిరూపించారు.

2001లో తాలిబన్ల చెరనుంచి విముక్తి పొందాక అఫ్గాన్‌ మహిళల జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. అమ్మాయిలు చదువుకో గలిగారు. 2003లో ఉన్నతవిద్యలో అమ్మాయిల శాతం 9 కాగా, 2017కి అది 39% అయ్యింది. ఇప్పుడు 35 లక్షల మంది అమ్మాయిలు ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు.

సంపాదన మగవాళ్లకీ, ఇంటి వ్యవహారాలు ఆడవాళ్లకనేది తాలిబన్ల నిబంధన. స్త్రీలు వంటకీ, పిల్లల్ని కనడానికి తప్ప విందులు ఇతరత్రా వేటిలోనూ పాల్గొనకూడదు. కుటుంబ నిర్ణయాల్లోనూ మహిళల పాత్ర శూన్యం. బయట అడుగు పెట్టాలన్నా కనీసం అయిదేళ్లు నిండిన పిల్లాడు పక్కన ఉండాల్సిందే. 2003లో కొత్త ప్రభుత్వం ఈ ఆంక్షలన్నింటినీ తొలగించింది. 2004లో సమానత్వ హక్కునూ కల్పించింది. దీంతో పలువురు మహిళలు గవర్నర్లు, మంత్రులు, రాయబారులుగా ఎదిగారు. పోలీసు సహా రక్షణ దళాల్లో ప్రవేశించారు. దేశ విద్యాశాఖ మంత్రి, కాబూల్‌ మేయర్‌ సహా ఎన్నో కీలక పదవుల్లో ఆడవాళ్లున్నారు.

దుస్తుల ఎంపిక వంటి కనీస స్వేచ్ఛా తాలిబన్ల హయాంలో అమ్మాయిలకు లేదు. తల నుంచి అరికాలి వరకు కప్పుతూ ఉండే బురఖా తప్పనిసరి. కాళ్లు కనిపించేలానూ చెప్పులు వేసుకోకూడదు. పెళ్లి విషయంలో అయిష్టతను వ్యక్తం చేసే అవకాశమూ లేదు. అత్యాచారాలు చేసినా మగవారికి శిక్ష ఉండేది కాదు. 2009లో వీటికి వ్యతిరేకంగా చట్టం వచ్చింది. 20 ఏళ్లుగా ఒక్కో అడుగూ స్వేచ్ఛ, సాధికారతల వైపు వేసుకుంటూ వచ్చారు అఫ్గానీ మహిళలు. తాజా పరిణామాలతో తిరిగి చీకటి రోజుల్లోకి వెళ్లిపోతామన్న వారి భయాలు నిజం కాకూడదని కోరుకుందాం.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్