మా దేశం వెళ్తే... ఏమైనా చేస్తారని భయం!

ఒకప్పుడు తాలిబన్ల నిరంకుశాధికారాన్ని చూసింది. తర్వాత అందివచ్చిన స్వేచ్ఛతో చదువును కొనసాగించింది... డైరెక్టర్‌గా ఉన్నత స్థాయికి ఎదిగింది. మళ్లీ తాలిబన్లు దేశాన్ని ఆక్రమించారు. ఇక భవిష్యత్‌ అంధకారంగా మారుతుందేమోనని ఆందోళన. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కోసం వచ్చిన ‘హొమైరా జలాల్‌జయ్‌’ వసుంధరతో పంచుకున్న అంతరంగ ఘోష ఇది. అఫ్గానిస్థాన్‌

Updated : 26 Aug 2021 13:07 IST

ఒకప్పుడు తాలిబన్ల నిరంకుశాధికారాన్ని చూసింది. తర్వాత అందివచ్చిన స్వేచ్ఛతో చదువును కొనసాగించింది... డైరెక్టర్‌గా ఉన్నత స్థాయికి ఎదిగింది. మళ్లీ తాలిబన్లు దేశాన్ని ఆక్రమించారు. ఇక భవిష్యత్‌ అంధకారంగా మారుతుందేమోనని ఆందోళన. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కోసం వచ్చిన ‘హొమైరా జలాల్‌జయ్‌’ వసుంధరతో పంచుకున్న అంతరంగ ఘోష ఇది. అఫ్గానిస్థాన్‌ నుంచి దాదాపు 30 మంది అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. అందరిలోనూ ఇదే భయం! ఆ వివరాలు.. ఆమె మాటల్లోనే!

ఫ్గానిస్థాన్‌లోని ఘజని నా స్వస్థలం. చిన్నతనంలో తాలిబాన్ల పాలన నాకు అనుభవమే. స్త్రీలపై తీవ్ర ఆంక్షలు. మాకు చదువు, ఉద్యోగాల అవకాశమే లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయమే. మా అవస్థలు, బాధలను ఇంట్లో వారికి తప్ప ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. భావప్రకటన స్వేచ్ఛనే మరచిపోయాం. మా నాన్న, ఇద్దరు సోదరులు అఫ్గాన్‌ జాతీయ సైన్యంలో పని చేసే వారు. అయినా నాకు పాఠశాలకు వెళ్లే అవకాశం దక్కలేదు. నాకేమో చదువంటే ఇష్టం. నాన్న, సోదరులు చదువుకున్న వాళ్లు కావడంతో వారితో పాఠాలు చెప్పించుకునే దాన్ని. చదువుకున్న బంధువులు వస్తే వాళ్ల సాయాన్నీ తీసుకునే దాన్ని.

తాలిబన్లు వెళ్లిపోయాక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆడవాళ్లకు చదువుకునే వీలు కల్పించింది. వాళ్లు కోల్పోయిన పాఠ్యాంశాలన్నింటినీ చెప్పించి, వయసుకు తగ్గ తరగతులకు ప్రమోట్‌ చేసింది. అలా ఏడేళ్ల తర్వాత నాకు బడికి వెళ్లే వీలు కలిగింది. తర్వాత డిగ్రీ చేసి, ఉపాధ్యాయినిగా చేరా. ఆపై ఉపాధ్యాయులకు శిక్షకురాలినయ్యా. పీజీ చేస్తే పదోన్నతి సాధించొచ్చనే ఉద్దేశంతో 2016లో పుణె విశ్వవిద్యాలయంలో ఎమ్మే (ఎడ్యుకేషన్‌) చేశా. మా దేశానికి వెళ్లి పరీక్షలు రాసి విద్యా విభాగ సంచాలకురాలినయ్యా. కాబూల్‌లో ఉద్యోగం. మొత్తమ్మీద 15 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగా.

ఆ కోరిక నెరవేరదేమో!

మొన్న మార్చిలో పీహెచ్‌డీ కోసం విశాఖపట్నం వచ్చా. అఫ్గాన్‌, భారత్‌ల స్నేహపూర్వక ఒప్పందాల నేపథ్యంలో ఉపకార వేతనంతో పాటు ఉచితంగా పీహెచ్‌డీ చేసే అవకాశం దక్కింది. దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తీరు మా కుటుంబానిది. అందుకే నాన్న నా ఇద్దరు అన్నల్నీ, వాళ్ల పిల్లల్నీ సైన్యంలోనే చేరేలా ప్రోత్సహించారు. నేనూ కష్టపడి చదివి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నా. పీహెచ్‌డీ చేసి ‘డిప్యూటీ మినిస్టర్‌’ అవ్వాలన్నది నా ఆశయం. విధాన నిర్ణయాలు చేయగలిగే స్థాయికి వస్తే ఎక్కువ మందికి, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడొచ్చన్నది నా ఆలోచన. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి, నా మీద ఆధారపడిన నా అక్కా చెల్లెళ్ల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు.

ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భవిష్యత్‌ ఏమవుతుందో తెలియడం లేదు. మా దేశం వెళితే ఉద్యోగం సంగతి దేవుడెరుడు, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అనేది భయం. నేనిక్కడ ఉన్నా.. మా వాళ్లతో మాట్లాడుతున్నా కుటుంబ భద్రత గురించి తెలియని బెంగే.

ఫేస్‌బుక్‌ ఖాతా తొలగించా...

తాలిబన్‌ పాలనను కళ్లారా చూశా. అందుకే వాళ్ల విధానాలు, ఎదుర్కోబోయే సమస్యలను ఫేస్‌బుక్‌లో పంచుకునే దాన్ని. ఎవరో ఒకరు మాట్లాడకపోతే ప్రపంచానికి తెలిసేదెలా? వాటిని ప్రస్తావిస్తున్నానని ఎన్నో బెదిరింపులు వచ్చాయి. కొందరైతే చాలా అమానవీయ వ్యాఖ్యలు చేశారు. ఆ అవమానాల్నీ, బెదిరింపుల్నీ తట్టుకోలేక ఫేస్‌బుక్‌ ఖాతానే తొలగించానంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

నానమ్మ భారతీయురాలే..

మా తాత సుమారు 30 ఏళ్లు హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేశారు. ఆ సమయంలో అక్కడే మా నాయనమ్మ మునావర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కుటుంబంతో అఫ్గానిస్థాన్‌ వచ్చేశారు. నాలోనూ భారతీయ రక్తం ఉన్నందుకేనేమో ఈ దేశమంటే ప్రత్యేక అభిమానం.


చీకట్లు తొలగేనా?

వరైనా చట్టబద్ధ పాలననే కోరుకుంటారు. అన్ని మతాలు, వర్గాలు, ప్రాంతాల వాళ్లకి ఉపయోగపడేలా చట్టాలు చేసి, ఉల్లంఘిస్తే శిక్షించడంలో తప్పు లేదు. కానీ ఎప్పుడు ఎవరేం చేస్తారోనన్న భయం ముఖ్యంగా అఫ్గాన్‌ మహిళల్లో ఉంది. తిరిగి ఈ పరిస్థితుల్లోకి వెళ్లడం మా దురదృష్టం. అమెరికా సహా ఇరాన్‌, చైనా, రష్యా, పాకిస్థాన్‌ తదితర దేశాలన్నీ తాలిబన్లను పోషించాయి. మా దేశంపై పట్టు కోసం వాళ్ల ప్రయత్నాలే తాలిబన్ల అధికారానికి కారణమైందని భావిస్తున్నా. తాలిబన్ల చట్టాలేంటి, ఎలా అమలు చేస్తున్నారన్నది చూస్తేనే కానీ వాళ్ల ప్రభుత్వంపై మహిళలకు నమ్మకం కలగదు. మునుపటి పరిస్థితి ఏనాటికైనా వస్తుందా, మా జీవితాల్లో వెలుగులు వస్తాయా అన్నది అనుమానమే.

- బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్