నేను మాట్లాడితే అనుమానంగా చూసేవారు

కొన్ని కుటుంబాలకే పరిమితమైన కళను వేలమంది మహిళలు నేర్చుకునేలా చేశారు.. దాంతోపాటు 15000 మంది ఆడవాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకునేలా బాటలు వేశారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు...

Published : 31 Aug 2021 00:48 IST

కొన్ని కుటుంబాలకే పరిమితమైన కళను వేలమంది మహిళలు నేర్చుకునేలా చేశారు.. దాంతోపాటు 15000 మంది ఆడవాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకునేలా బాటలు వేశారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఇంతకీ ఎవరామె? ఏం చేశారు?

రాజస్థాన్‌లోని మేఘవాల్‌ వర్గం మహిళలకు బయటి ప్రపంచం తెలియదు. సంప్రదాయ కుట్లు, అల్లికలే జీవనాధారం. అందులో వారిది అద్భుత నైపుణ్యం. దాని పేరే ‘కషిదకారీ’. 80వ దశకంలో వారి జీవితాల్లో మార్పులను తీసుకు వచ్చారు లతా కచావహా. దేశంలోని ప్రముఖ డిజైనింగ్‌ సంస్థల నుంచి శిక్షకులను రప్పించి ఆ మహిళలకు హస్తకళల్లో మరింత నైపుణ్యం వచ్చేలా శిక్షణ ఇప్పించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (అహ్మాదాబాద్‌), నిఫ్ట్‌(దిల్లీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్‌ అండ్‌ డిజైన్‌ (జయపుర) సంస్థలకు చెందిన నిపుణులు ఆ మహిళలతో దాదాపు 50 డిజైన్‌ వర్క్‌షాపులను నిర్వహించారు. 250 కొత్త డిజైన్లను అభివృద్ధి చేశారు. అప్పుడే దాదాపు 12000 మంది మహిళలు ‘కషిదకారీ, ప్యాచ్‌ వర్క్‌’లో శిక్షణ తీసుకున్నారు. దాంతో ఆ మహిళా లోకం ఇక వెనక్కి చూసుకోలేదు. లత శ్రమ వృథాగా పోలేదు. నేడు రాజస్థాన్‌లో దాదాపు 40,000 మందికి పైగా మహిళలు సంప్రదాయ హస్తకళలు, పశు పెంపకం, వ్యవసాయం... లాంటివాటి ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

1990లో మగ్‌రాజ్‌ జైన్‌ స్థాపించిన సొసైటీ ఫర్‌ అప్‌లిఫ్ట్‌ ఆఫ్‌ రూరల్‌ ఎకానమీ (ఎస్‌యూఆర్‌ఈ - ష్యూర్‌) వెనక ఆమె కృషి చాలా ఉంది. ఈ సంస్థ మహిళల్లో నైపుణ్యాలను వృద్ధి చేస్తుంది. వారు చేసిన హస్తకళా ఉత్పత్తులతో దేశ, విదేశాల్లో ప్రదర్శనలిస్తోంది. ‘జర్మనీ, జపాన్‌, సింగపూర్‌, శ్రీలంక దేశాల్లో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశాం. వీటివల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.’ అని చెబుతారు లత.

నేర్చుకుంటూనే సంపాదన...
దేశంలోని ఫ్యాబిండియా, ఐకియా, రంగసూత్ర... లాంటి ప్రముఖ సంస్థలు వస్త్రాలు, గృహోపకరణాలను ‘ష్యూర్‌’లోని మహిళల ద్వారా కొనుగోలు చేస్తాయి. మహిళలు తమ ఖాళీ సమయాల్లో ఈ కుట్లు, అల్లికలు చేస్తూ నెలకు కనీసం 5,000 వరకూ పొందుతున్నారు.
ఇదంతా తేలికగా జరిగిపోలేదు. ఆమె 1985లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉండేవి. ఓ మహిళ వచ్చి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల్లో మెరుగుదల గురించి చెబుతోంటే సందేహంగా చూసేవారు. అప్పట్లో కరెంటు, ఫోన్లు.. ఏవీ లేవు. రిమోట్‌ ప్రాంతాల్లో స్కూళ్లు, ఆస్పత్రులు అస్సలుండేవి కాదు. కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే అదొక సవాలే. అప్పుడప్పుడు ఒంటెపై ప్రయాణం చేసే వాళ్లం’ అని గుర్తు చేసుకుంటారామె.

ష్యూర్‌ ద్వారా దాదాపు 3,000 స్వయం సహాయక బృందాలను తయారుచేశారు. వీటిలోని 14,000 మంది మహిళలు పశుపోషణ, వ్యవసాయం చేసేవారు. పాలు, మేకలను అమ్మడం ద్వారా నెలకు 5000 నుంచి 8000 రూపాయలను ఆర్జించేవారు. ష్యూర్‌ జోధ్‌పుర్‌లోని మరో 14000 మంది మహిళలకు ఉసిరి, దానిమ్మ, నేరేడు పండ్ల తోటలను పెంచుకోవడానికి సాయం చేశారు. నీళ్ల కోసం గంటల తరబడి ప్రయాణించే మహిళల కోసం ప్రత్యేకమైన ట్యాంకులను చేయించారామె.

మార్పు మొదలైందిలా...
జోధ్‌పుర్‌కు చెందిన లత పీజీ పూర్తి చేశారు. తల్లిదండ్రుల మరణం తర్వాత ఆమె సోదరుడితో కలిసి బర్మెర్‌కు వచ్చారు. అతనే ఆమెను జైన్‌కు పరిచయం చేశాడు. గ్రామీణులకు స్థిరమైన ఆదాయ వనరులను కల్పించడానికి కృషి చేస్తున్నాడాయన. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన లత నలభై ఏళ్లుగా మహిళా సాధికారత కోసం పాటు పడుతూనే ఉన్నారు. అలాగే మహిళల జీవన ప్రమాణాలు పెంచడం, అక్షరాస్యత, ఆరోగ్యం  మెరుగుపరచడం, గ్రామీణ బాలలకు చదువు చెప్పడం, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు అండగా ఉండటం... లాంటి పనులు చేస్తున్నారు. ఇందుకుగానూ లతను స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ‘ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’ పురస్కారంతో గౌరవించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్