Updated : 03/10/2021 01:54 IST

కిలాడీల పనిపడుతుంది!

కనిపించే దొంగల పనిపట్టొచ్చు! మరి డిజిటల్‌ తెరల చాటునుండే సైబర్‌ కిలాడీల పనిపట్టేదెలా? ఆ పని పాతికేళ్ల కామాక్షిశర్మ ఇట్టే చేసేస్తుంది. తనంటే ఇలాంటి నేరగాళ్లకు హడల్‌! ‘సైబర్‌ మిషన్‌’ పేరుతో వివిధ రాష్ట్రాల్లోని వేలమంది పోలీసులకు శిక్షణ ఇస్తున్న ఈ యువ హాకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే....

మె వయసు పాతికే. అయితేనేం దేశంలో సైబర్‌ నేరగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ‘సైబర్‌ మిషన్‌’ పేరుతో దేశంలోని పోలీసులకు శిక్షణ ఇస్తోంది. దేశభద్రత విషయంలోనూ సేవలందిస్తోంది. ఘజియాబాద్‌లో మధ్యతరగతి కుటుంబం కామాక్షి వాళ్లది. నాన్న రఘుశర్మ ప్రైవేటు ఉద్యోగి. శ్రీనగర్‌లో బీటెక్‌ చదువుతున్నప్పుడు ఆన్‌లైన్‌లోనే ఎక్కువ సమయం గడిపేది. సైబర్‌, ఇన్ఫ్‌ర్మేషన్‌ సెక్యూరిటీల గురించి లోతుగా అధ్యయనం చేసేది. బీటెక్‌ అయ్యేసరికి సైబర్‌ మోసాలపై అవగాహనతోపాటు వాటిని ఛేదించే సామర్థ్యాల్నీ పెంచుకుంది. 2017లో ఘజియాబాద్‌లో ‘డిజిసెక్‌’ అనే సంస్థ సీఈవోగా రెండేళ్లు బాధ్యతలు నిర్వర్తించింది.
‘నాకు హ్యాకింగ్‌పై ఆసక్తి ఎక్కువ. బీటెక్‌లో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన కోర్సులను ఆన్‌లైన్‌లో పూర్తిచేశా. స్నేహితులు, బంధువుల్లో చాలా మందికి సైబర్‌ సమస్యలను పరిష్కరించడంలో సాయం చేశా. ఓ రోజు ఘర్వాల్‌ పోలీసుస్టేషన్‌ నుంచి ఓ సైబర్‌కేసును పరిష్కరించడంలో సాయం చేయమని ఫోన్‌ వచ్చింది. అతి తక్కువ సమయంలోనే దాన్ని ఛేదించగలిగా. దాంతో మరిన్ని కేసులు అప్పగించారు. వాటినీ సులువుగా పరిష్కరించి, నిందితులను పట్టించగలిగా. అక్కడ సైబర్‌ కేసులెక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో... దీనిపై సిబ్బందికి శిక్షణనివ్వాలని కోరడంతో సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌నే నా కెరియర్‌గా మార్చుకున్నా. ఘర్వాల్‌ పోలీసు విభాగం నన్ను ఎథికల్‌ హ్యాకర్‌గా నియమించింది. అప్పటి నుంచి మ్యాట్రిమోనియల్‌, ఫైనాన్షియల్‌ నేరాలకు పాల్పడే వారినీ, సోషల్‌ మీడియాలో ఫేక్‌ఐడీలతో మోసాలకు పాల్పడే సైబర్‌ నేరగాళ్లనూ పట్టించే దాన్ని. ప్రస్తుతం నెలకు నా దగ్గరకు 90కిపైగా కేసులు వస్తుంటాయి’ అంటున్న కామాక్షికి పలు విదేశీ సంస్థలూ ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. అయితే మాతృభూమి సేవకే ప్రాధాన్యం అంటూ వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటుంది.

35 రోజుల్లో 30 నగరాల్లో వర్క్‌షాపులను నిర్వహించి 50 వేల మంది పోలీసులకు సైబర్‌ సెక్యూరిటీపై శిక్షణనందించింది కామాక్షి. అలా ‘వరల్డ్‌ యంగెస్ట్‌ సైబర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ట్రైనర్‌’గా రికార్డులకెక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానాన్నీ దక్కించుకుంది. ఇప్పటివరకు ఐదువేల కేసుల్లో నిందితులను పట్టించింది. శ్రీలంక, దుబాయి దేశాల సెక్యూరిటీ ఏజన్సీలతోనూ కలిసి పలు పరిశోధనాత్మక కేసుల్లో పనిచేసింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని