Updated : 14/10/2021 05:59 IST

ప్రోత్సహిస్తే... ఏదైనా సాధించగలం

పెళ్లైతే చదువుకి దూరం కావాలా? అమ్మాయిలు టీచర్లు, డాక్టర్లు వంటి వృత్తులనే ఎందుకు ఎన్నుకోవాలి? భిన్నమైన రంగాలని ఎంచుకునేలా వారిని ప్రోత్సహించాలి. కెరియర్‌లో నిలదొక్కుకునేందుకు కుటుంబం ప్రోత్సాహం ఇవ్వాలి అంటోన్న వీరంతా తాజాగా తెలంగాణా హైకోర్టుకి న్యాయమూర్తులుగా ఎంపికయ్యారు. వారి ప్రస్థానాన్ని, మనోభావాలను వసుంధరతో పంచుకున్నారిలా...


నాన్న అడుగుజాడల్లో...

చెన్నైలో పుట్టిన పెరుగు శ్రీసుధ కర్నూలు, కడపల్లో చదువుకున్నారు తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పద్మావతి. గుంటూరు ఏసీ కాలేజీ 1991లో న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారామె. 1992లో తెనాలిలో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. భర్త డాక్టర్‌ శ్రీకాంత్‌ బాబు బీఆర్‌కేఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌. శ్రీకాళహస్తి, కావలిలో ప్రాక్టీస్‌ చేశారు. తండ్రి న్యాయాధికారి కావడంతో ఆయన అడుగు జాడల్లోనే నడిచి, ఏడేళ్లు ప్రాక్టీస్‌ చేశాక జిల్లా జడ్జిగా 2002లో మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్టణాల్లో పనిచేశారు. జ్యుడీషియల్‌ అకాడెమీ డైరెక్టర్‌గా సేవలందించారు. ప్రస్తుతం కో-ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌. ‘టీచరు, డాక్టర్‌ వంటి వృత్తుల్లోకే కాకుండా ఇతర రంగాల్లోకి అమ్మాయిలు వెళ్లడానికి అమ్మానాన్నలు ప్రోత్సహించాలి. ధైర్యం ఉన్నవాళ్లను ఎయిర్‌ఫోర్స్‌, నేవీ వంటి రంగాల్లోకీ పంపాలి. పిల్లలకు నచ్చిన రంగంలోకి వెళ్లనివ్వాలి. తల్లిదండ్రులు, అత్తమామల ప్రోత్సాహం వల్లనే ఇక్కడిదాకా వచ్చా’ అని వివరించారు శ్రీసుధ.


పెళ్లైతే చదువుని వదులుకోవాలా?

డాక్టర్‌ రాధారాణి సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి. అమ్మానాన్నలు గురిజాల సీతారామయ్య, రాజేశ్వరి. పద్దెనిమిదేళ్లకే కులాంతర వివాహం. పెళ్లయినా చదువాపలేదు. బీఎస్సీ చేశాక సీఆర్‌ఆర్‌ ఈవినింగ్‌ కాలేజీ నుంచి 1998లో న్యాయశాస్త్ర పట్టాపుచ్చుకున్నారు. ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ కూడా చేశారు. ఏలూరు, విజయవాడ, హైదరాబాద్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. సహాయ, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తూ 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఒంగోలు, హైదరాబాద్‌, సంగారెడ్డి, సికింద్రాబాద్‌ కుటుంబ న్యాయస్థానం, నల్గొండ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, వ్యాట్‌ ఛైర్‌పర్సన్‌గా చేసి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జడ్జిగా ఉన్నారు. ఎలాంటి న్యాయవాద నేపథ్యమూ లేని కుటుంబం నుంచి వచ్చారు. భర్త సీవీఎల్‌ఎన్‌ గాంధీ రవాణాశాఖలో పదవీ విరమణ చేశారు. ‘పెళ్లైనంత మాత్రాన చదువుని, లక్ష్యాలను వదిలేయాలని లేదు. పట్టువిడవకుండా చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు’ అంటారు రాధారాణి.


కుటుంబమే అండ

నెల్లూరులో పుట్టారు చిల్లకూర్‌ సుమలత. అమ్మానాన్నలు వెంకటసుబ్బయ్య, లక్ష్మీప్రసన్న. పద్మావతి యూనివర్సిటీ నుంచి 1995లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. సత్వర న్యాయంపై పీహెచ్‌డీ చేశారు. పదేళ్లు న్యాయవాదిగా చేశాక 2007లో జిల్లా జడ్జి అయ్యారు. కర్నూలు, మదనపల్లి, అనంతపురం, గుంటూరుల్లో పనిచేశారు. జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి. భర్త డాక్టర్‌ వేముల వెంకటేశ్వర్లు. ‘అమ్మానాన్నలతో పాటు నాకు మావారి ప్రోత్సాహమూ ఎంతో ఉంది. చాలామంది కుటుంబ బాధ్యతలతో వృత్తికి దూరమవుతున్నారు. మొదట్లో ఆదాయం లేక ఇబ్బందులనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు కుటుంబం అండగా నిలిస్తేనే స్త్రీలు ఈ రంగంలో నిలబడగలరు. ఇష్టాన్ని పెంచుకుంటేనే ఈ వృత్తిలో రాణించగలం’ అంటున్నారు సుమలత.


అవకాశాలను అందిపుచ్చుకోవాలి...

ట్లోళ్ల మాధవీదేవి హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. గుల్బర్గా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. నల్సార్‌లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో డిప్లొమా చేశారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా హైకోర్టు, కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్యానెల్‌ లాయర్‌గా పనిచేశారు. 13 ఏళ్లు న్యాయవాదిగా, 15 ఏళ్లు న్యాయాధికారిగా ఉన్నారు. 2005లో ఇన్‌కంట్యాక్స్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా చేరి ముంబయి, బెంగళూరుల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నేను న్యాయపట్టా అందుకోవడానికి న్యాయవాదిగా చేస్తోన్న మా వారు హనుమంతరెడ్డి తోడ్పాటే కారణం. మహిళలు రాణించాలంటే కుటుంబ ప్రోత్సాహం అవసరం. ఎవరూ అవకాశాలను అందివ్వరు. మనమే అందుకోవాలి. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుని మన స్థానాన్ని సుస్థిర పరచుకోవాలి’ అని చెప్పుకొచ్చారు మాధవీదేవి.

దండు నారాయణరెడ్డి, హైదరాబాద్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని