Updated : 08/12/2021 16:44 IST

దుర్గ పూజకు...మహిళా పూజారులు

కోల్‌కతాలోని ‘రాస్‌ బిహారీ 66 పల్లి’ వేదికపై దుర్గాపూజ ఈ ఏడాది మరింత విశిష్టతను సంతరించుకుంది. మహిళాశక్తికి ప్రతీకగా నిలిచే మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజాకార్యక్రమాలను నలుగురు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ శరన్నవరాత్రులలో తమదైన సేవలందిస్తూ దుర్గమ్మను సేవించుకోవడంలో వీరు తొలిమహిళా పూజారులుగా చరిత్రలో నిలిచారు. ఇంత అపురూపమైన అవకాశాన్ని అందుకున్న నందిని భౌమిక్‌, రుమారాయ్‌, సేమంతి బెనర్జీ, పౌలామి చక్రవర్తి గురించి తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయ వివాహాది శుభకార్యాలను గత పదేళ్లగా ఈ నలుగురు మహిళా పూజారులు నిర్వహిస్తున్నారు. వీరి నియమ నిబద్ధత, భక్తిశ్రద్ధలు, నైపుణ్యాలను గుర్తించిన ‘66 పల్లీ’ కమిటీ నిర్వాహకులు ఈ ఏడాది అమ్మవారికి సేవచేసే అదృష్టాన్ని కల్పించారు. వివాహాలు, అన్నప్రశన, వ్రతాలు వంటివి వ్యక్తిగత సందర్భాలు. అమ్మవారి సేవంటే భక్తులందరికీ సంబంధించింది అంటారు నందిని భౌమిక్‌. ‘దుర్గా పూజలో ప్రతి అంశం భక్తుల నమ్మకాలు, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతోపాటు భక్తులకు ఎటువంటి లోపం జరగకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వందల సంవత్సరాల నుంచి పురుషులు మాత్రమే ఉండే ఈ రంగంలో మహిళలకు ఇప్పుడిప్పుడే అవకాశాలొస్తున్నాయి. భగవంతుడిని కొలుచుకోవడానికి అందరికీ సమానహక్కులున్నాయి. ఇందులో మేం తొలి అడుగు వేశాం. ఈ మార్గాన్ని మరికొందరు అనుసరించి దైవారాధనలో మహిళా పూజారులుగా రావాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది ‘శుభమస్తు’ పేరుతో మా నలుగురు    మహిళల బృందానికి ఈ దసరాకు దుర్గాదేవికి పూజలు నిర్వహించే అదృష్టం దక్కింది’ అని సంబరంగా చెప్పారు నందిని భౌమిక్‌.

రెండు నెలలుగా...

ఈ పూజా నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, పూజలతో పాటు నవరాత్రుల్లో వల్లించాల్సిన సంస్కృత శ్లోకాలు, మంత్రాలు వంటివన్నీ రెండు నెలలుగా వీరు శిక్షణ పొందుతున్నారు. అమ్మవారికి ఇష్టమైన పాటలు, భక్తులను అలరించే బంగ్లా గీతాలను కూడా సాధన చేశాం అంటున్నారు వీరిలో ఒకరైన రుమారాయ్‌. ‘నలుగురం కలిసి చాలా శుభకార్యాలను నిర్వహిస్తుంటాం. సాధారణంగా నందిని, నేను పూజ చేస్తే, సేమంతి, పౌలామి శ్లోకాలతోపాటు పాటలనూ పాడుతుంటారు. ఇప్పుడు అమ్మవారి పూజలో ప్రతి అంశాన్నీ నలుగురం విడివిడిగా పూర్తి చేయగలిగేలా సాధన చేశాం. నవరాత్రులలో ఏరోజుకారోజు ఏం చేయాలో ముందుగానే సిద్ధమయ్యాం’ అని చెబుతున్నారు రుమారాయ్‌. తొలి మహిళాపూజారులుగా అమ్మవారి పూజలకు ఎంపిక కావడానికి ముందు ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి ఎంతో కష్టపడ్డాం అంటారు సేమంతి. ‘మహిళలు పూజారులేంటి అనే విమర్శలు ఎదుర్కొన్నాం. వాటన్నింటినీ దాటి మంచి పేరు తెచ్చుకొన్నాం. ఇప్పుడిక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించడం గర్వకారణంగా భావిస్తున్నా’ అని అంటారీమె.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని