Updated : 17/10/2021 07:19 IST

చీరకట్టు.. సూపర్‌హిట్టు!

చీర అనగానే సంస్కృతీ సంప్రదాయాలు గుర్తొస్తాయి. ఆధునికతకు దూరమనో, దీంతో పనులు ఇబ్బందనో భావించేవారూ లేకపోలేదు. కానీ.. సాధించాలన్న తపన ఉంటే ఈ సంప్రదాయ వస్త్రమేమీ ఇబ్బంది కాదని నిరూపిస్తున్నారు కొందరు. వ్యాయామం.. నృత్యం.. అవగాహన కల్పించడం అన్నింటినీ చీరలోనే సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎందరి మనసుల్నో కొల్లగొడుతున్న వారిలో కొంత మంది వీళ్లు...

చీరలో మారథాన్‌: మృణాల్‌ ఇనామ్‌దార్‌

మారథాన్‌లో పాల్గొనేవాళ్లు తేలిగ్గా, వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తుల కోసం చూస్తుంటారు. కానీ మృణాల్‌ మాత్రం మహారాష్ట్ర సంప్రదాయ చీర నవారీకే ఓటేసింది. జతగా షూలను ఎంచుకుని ఈ ఏడాది మార్చిలో 100 కి.మీ. మారథాన్‌లో పాల్గొంది. ‘మహిళలూ రోజూ మగవాళ్లతో సమానంగా కష్టపడతారు. కానీ ఇచ్చే విలువలో మాత్రం తేడా ఉంటుంది. ఆడవాళ్లూ ఏమాత్రం తీసిపోరని తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీనిలో పాల్గొంటున్నా’ అంటోంది 45 ఏళ్ల మృణాల్‌. ఈమె 2012 నుంచి మారథాన్లలో పాల్గొంటోంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన తక్కువ. తనను చూసి కొందరైనా స్ఫూర్తి పొందితే చాలంటోందీ పుణె మహిళ.


ప్రత్యేకంగా ప్రయత్నించాలని: పరుల్‌ అరోరా

జిమ్నాస్టిక్స్‌లో జాతీయ స్థాయి గోల్డ్‌ మెడలిస్ట్‌. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా. ఈమెది హరియాణలోని అంబాలా. దేన్నైనా భిన్నంగా చేయాలనేది పరుల్‌ తత్వం. ఈ ఏడాది చీరలో జిమ్నాస్టిక్స్‌ను ప్రయత్నించింది. అదికూడా తేలిగ్గా ఉన్నవి కాకుండా కష్టమైన ఫ్లిప్స్‌ను ప్రయత్నించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్లిప్స్‌ను ఫ్రంట్‌, బ్యాక్‌ రెండు పద్ధతుల్లోనూ చేస్తోంది. ‘దేన్నైనా చేయడానికి తపన ఉంటే చాలు. దుస్తులు అడ్డంకి కాదని నిరూపించాలనుకున్నా. చీర ఒక ఇబ్బంది అనుకునే అమ్మాయిల మనస్తత్వాన్ని మార్చాలన్న ఉద్దేశమూ మరో కారణం’ అనిఅంటోందీ 22 ఏళ్ల పరుల్‌.


లాక్‌డౌన్‌ సద్వినియోగం : లక్ష్మీ సి పిళ్లై

అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలో రైటర్‌, ఆర్గానిక్‌ ఫార్మర్‌. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంది లక్ష్మి. తనకి వాహనాలపై ఆసక్తి ఎక్కువ. ‘కార్‌ కదువా’ పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించి, వాటిపై రివ్యూలివ్వడం మొదలుపెట్టింది. మొత్తం సాగేది మలయాళంలోనే. కానీ భాషతో సంబంధం లేకుండా ఆమెను ఫాలో అవుతున్నారు. కారణం.. వాహనం రంగు ఏదైతే...ఆ వర్ణం చీరల్నే కడుతుంది. ‘దొరికిన సమయాన్ని  భిన్నంగా ఉపయోగించాలనుకున్నా. ఆటోమొబైల్స్‌ మగవాళ్లవనే భావన ఉంటుంది. పైగా స్త్రీల డ్రైవింగ్‌పై జోకులు, కామెంట్లు వేస్తుంటారు. ఇది తప్పని నిరూపించాలనుకున్నా. నాకు డ్రైవింగ్‌లో 20 ఏళ్ల అనుభవముంది. అందుకని ఆటోమొబైల్‌ రివ్యూని ఎంచుకున్నా. మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టే చీరలను ఎంచుకున్నా. అదే నాకు ప్రత్యేకత తెచ్చిపెట్టింది’ అంటోంది లక్ష్మి.


మోడర్న్‌ ఝాన్సీ: మోనాలిసా భద్రా

ఈమె తన సాహసాలకు ఆరు గజాలు కాదు.. తొమ్మిది గజాల చీరను ఎంచుకుంది. మోనాలిసాది ఒడిశాలోని జహల్‌. గృహిణి. ప్రకృతి అన్నా, మూగజీవులన్నా తనకెంతో ఇష్టం. ఓరోజు కోతులకు ఆహారాన్ని తినిపిస్తున్న వీడియోను ఆమె భర్త యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయగా మంచి స్పందన వచ్చింది. అది మొదలు ప్రకృతి, జంతువులపై తన ప్రేమను వీడియోలుగా తీసిపెట్టేది. పల్లెటూరి గృహిణులూ ఎవరికీ తీసిపోరని నిరూపించాలనుకుంది. చీరలోనే బుల్లెట్‌, కారు, ట్రాక్టర్‌, లారీతోపాటు ఓల్వో బస్‌నూ నడిపి...ఆ వీడియోలను పోస్ట్‌ చేసింది. ఈ ఏడాది గుర్రాన్నీ స్వారీ చేసింది. ఈమెను పాతిక లక్షలమందికి పైగా యూట్యూబ్‌లో అనుసరిస్తున్నారు. నెలకు రూ.లక్షకు పైగా ఆదాయాన్నీ అందుకుంటోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని