చదువుకోకపోయినా...ఏటా కోటి వ్యాపారం

భర్త అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు.. ఒక్కొక్కటిగా చుట్టుముట్టినా కుంగిపోలేదామె! ప్రయత్నిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడగలనన్న నమ్మకం ఆమెది. అందుకే ఇత్తడి వస్తువుల తయారీ నేర్చుకుంది. మార్కెటింగ్‌పై అవగాహన తెచ్చుకుంది. ఆధునిక పోకడలకు తగ్గట్టుగా మార్పులు చేస్తూ.

Updated : 20 Oct 2021 05:55 IST

భర్త అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు.. ఒక్కొక్కటిగా చుట్టుముట్టినా కుంగిపోలేదామె! ప్రయత్నిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడగలనన్న నమ్మకం ఆమెది. అందుకే ఇత్తడి వస్తువుల తయారీ నేర్చుకుంది. మార్కెటింగ్‌పై అవగాహన తెచ్చుకుంది. ఆధునిక పోకడలకు తగ్గట్టుగా మార్పులు చేస్తూ.. రంగంలో తనదైన ముద్ర వేసింది. ఏటా రూ.కోటికిపైగా సంపాదించే స్థాయికి ఎదిగింది. ఇదంతా ఏమీ చదువుకోకపోయినా ఒక మహిళ సాగించిన విజయప్రస్థానం. ఆమే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అద్దాల సూర్యకళ!
‘కష్టపడేతత్వం ఉంటే ఎడారిలోనూ పూలు పూయించొచ్చు’ అని చెప్పడానికి సూర్యకళ చక్కటి ఉదాహరణ. ఆ శ్రమించేతత్వమే ఆమెను కూలీ స్థాయి నుంచి యజమానిగా మార్చింది. ఈమెకు బుడితి గ్రామానికి చెందిన అద్దాల రామకృష్ణతో 1993లో పెళ్లయ్యింది. భర్తది ఐదోతరగతి చదువే. ఇత్తడి వ్యాపారుల దగ్గర కంచు, ఇత్తడి వస్తువులు తయారు చేసేవాడు. రోజంతా కష్టపడినా వందరూపాయలే చేతికొచ్చేవి. ఏడాదిలో ఆరునెలలే (జనవరి నుంచి జూన్‌ వరకు) పని.దీనికితోడు ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఇల్లు గడవడమే కష్టమైంది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. అప్పుడే వారి బంధువు వెలిచర్ల సూర్యం ఆదరించి నీడనిచ్చారు. దాంతో భర్తకి చేదోడు వాదోడుగా తానూ వస్తువుల తయారీ నేర్చుకుంది సూర్యకళ.

నాబార్డు చేయూత...  బుడితి గ్రామం కంచు, ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి. ఈ కళ అంతరించిపోకుండా ఆధునిక మెలకువలు అందించాలనుకున్నారు నాబార్డ్‌ అధికారులు. ఇక్కడి కార్మికులకు పాతపట్నం బ్రెడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. అప్పటికి పెళ్లికూతురు సారె వస్తువులైన బిందెలు, పళ్లాలు, చెంబులు వంటి ఎక్కువ బరువుండేవి మాత్రమే ఇక్కడివాళ్లు తయారు చేయగలిగేవారు. సూర్యకళకు వీటి తయారీలో అనుభవం లేకపోయినా జిజ్ఞాసతో నేర్చుకుంది. ముఖ్యంగా తక్కువ బరువుండే ఆధునిక పాత్రలకు నగిషీలద్దడంలో తర్ఫీదు పొందింది. ఆపై రుణం తీసుకుని తయారీ మొదలుపెట్టింది. వీటికున్న డిమాండ్‌ గుర్తించి మార్కెటింగ్‌లో కొత్త పోకడలను ఒంటపట్టించుకుంది.

నగరాల్లో ప్రదర్శన... సంప్రదాయ వస్తువులతో పాటు తక్కువ బరువుండే పూల సజ్జలు, దేవస్థానం వస్తువులు, దేవతామూర్తులు, పూలకుండీలు, ఉర్లి, బంధనం వంటి వివిధ రకాల వస్తువులతో నాబార్డు అధికారుల సాయంతో ముంబయిలోని శివాజీ మహల్‌లో ప్రదర్శన ఏర్పాటు చేసింది. తెలుగు తప్ప మరో భాష రాదు. దాంతో మొదట భయపడింది. అప్పటి నాబార్డు ఏజీఎం నాగేశ్వరరావు ధైర్యం చెప్పి, హిందీ అనువాదకుడ్ని సాయంగా ఇచ్చారు. అది విజయవంతం కావడంతో... కోల్‌కతా, దిల్లీ, గోవా, చెన్నై, రాంచీ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి చోట్లా స్టాల్స్‌ ఏర్పాటు చేసింది సూర్యకళ. ఒక్కో ప్రాంతంలో 15 రోజులపాటు స్టాల్స్‌ నిర్వహించాల్సి వచ్చేది. తీసుకెళ్లిన సరకు వారంలోనే అమ్ముడయ్యేది. డిమాండ్‌ ఉన్నవాటిని తిరిగి తెప్పించుకుని విక్రయించేది. తద్వారా లాభాలే కాదు మంచి గుర్తింపూ అందుకుంది.

లేపాక్షికి వస్తువులు...ఈమె తయారు చేసే వస్తువులకు మంచి గుర్తింపు రావడంతో లేపాక్షి సంస్థ ఈవిడకు ఖాతాదారుగా మారింది. ‘లేపాక్షి అధికారుల సూచనల మేరకు దిల్లీలోని రాజ్‌భవన్‌లోని పూల మొక్కలకు ప్రత్యేకంగా ఇత్తడి డబ్బాలు తయారుచేసి పంపించా. ఆధునిక అలంకరణల్లో భాగమైన ఫ్లవర్‌ వాజ్‌లు, అష్టలక్ష్మీ బిందెలు వంటి మా ఉత్పత్తులకు బోలెడు డిమాండ్‌’ అని సంతోషంగా చెబుతోంది. కస్టమైజ్డ్‌ రకాల కోసమూ ఆర్డర్లు వస్తుంటాయి. ఆన్‌లైన్‌ ఆర్డర్ల్లు తీసుకుని కొరియర్ల ద్వారా ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ పంపిస్తోంది. ఈ కృషి, నైపుణ్యాలకి గుర్తింపుగానే లేపాక్షి సంస్థ ఈమెను ఉత్తమ తయారీదారు పురస్కారంతో సత్కరించింది. అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి, మంత్రి గీతారెడ్డి వంటివారూ.. సూర్యకళ ప్రతిభను మెచ్చుకున్నవారే. అద్దె చెల్లించలేని స్థితి నుంచి సొంత ఇల్లు, కారు వంటివి కొనుక్కోవడమే కాదు.. కూతురిని ఉన్నత చదువులు చదివించింది. ప్రతి నెలా రూ.11 లక్షలకు పైగా వ్యాపారం చేస్తోంది. కూలీగా పనిచేసిన ఈమె.. పట్టుదల, శ్రమ, కాలానుగుణంగా మారే తత్వంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమేకాదు.. ఎంతో మందికి ఉపాధినందిస్తోంది.           

- ఆనందరావు, సారవకోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్