యాసిడ్‌ బాధితులకు తోడు
close
Updated : 24/10/2021 06:35 IST

యాసిడ్‌ బాధితులకు తోడు

తనపై యాసిడ్‌ పోసిన వ్యక్తిని కటకటాలవెనక్కి పంపించాలనేది ఆమె లక్ష్యం. నాలుగేళ్ల ఈ పోరాటంలో తనకెదురవుతోన్న ఇబ్బందులే తనలాంటివారు కూడా ఎదుర్కొంటున్నారని తెలుసుకుంది. వారికి చేయూతనందించడానికి ఓ ఎన్జీవోతో కలిసి పని చేస్తోంది. 25 ఏళ్ల సంచయితా యాదవ్‌ స్ఫూర్తి కథనమిది.

ఏడేళ్లక్రితం వరకు సంచయిత అందరిలాగే ఉత్సాహంగా ఉండే విద్యార్థిని. ఈమెది కోల్‌కతా. మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఓ ప్రైవేటు సంస్థలో చిరు ఉద్యోగి. తల్లి గృహిణి. 2014, సెప్టెంబరులో ఓ రోజు తల్లితో కలిసి బజారుకెళ్లినప్పుడు తెలిసిన స్నేహితుడు ఎదురొచ్చాడు. ఏం జరిగిందో తెలిసేలోపు ఆమె ముఖంపై యాసిడ్‌ పోసి పారిపోయాడు. బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయింది సంచయిత. ఆసుపత్రి నుంచి నాలుగు నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. తన చికిత్స నిమిత్తం అప్పులు చేశారామె తల్లిదండ్రులు. నిత్యం చురుకుగా ఉండే కూతురి పరిస్థితి చూసి బెంగతో తండ్రి తర్వాత ఏడాదికే కన్ను మూశాడు.
* రెండేళ్లు... కేసు పెట్టడానికి సంచయిత ప్రయత్నించి విఫలమైంది. యాసిడ్‌తో ముఖం కాలిపోవడంతో నలుగురిలోకి వెళ్ల లేకపోయేది. నోరు ఓవైపు కాలి, కన్ను కూడా పూర్తిగా పోయింది. దుపట్టా కప్పుకొని బయటకు వెళ్లేది. ఓ రోజు బజారులో తనపై యాసిడ్‌ పోసిన వ్యక్తిని చూసి ఆశ్చర్య పోయింది. నేరం చేసి వాడు ధైర్యంగా తిరుగుతుంటే తాను మాత్రం దుపట్టా కప్పుకుంటున్నందుకు సిగ్గుపడింది. ఎలాగైనా అతన్ని కటకటాల వెనక్కి పంపించాలనుకుంది. యాసిడ్‌ బాధితుల కోసం పనిచేసే ఓ ఎన్జీవో సాయంతో దమ్‌దమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు ఫైల్‌ చేయగలిగింది. కోల్‌కతా న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు రావడానికి రెండేళ్లు పట్టింది.

* పట్టుదలగా... పోలీసు స్టేషన్‌ నుంచి కోర్టుకెళ్లే వరకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యా అంటుంది సంచయిత. ‘ఎన్జీవో సాయాన్ని తీసుకున్న తర్వాత పోలీసులు ఈ కేసును ఫైల్‌ చేసి నిందితుడిని వెతకడం మొదలుపెట్టారు. స్వేచ్ఛగా తిరిగే అతడిని పట్టుకోవడానికి రెండేళ్లు పట్టింది. చివరికి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ జరుగుతోంది. శిక్షపడేలా చేయాలనేది నా లక్ష్యం. మారిన నా ముఖం, తగ్గిన కంటి చూపు, చికిత్సకయ్యే ఖర్చులతో చాలా మానసిక ఇబ్బందులు పడ్డా. అవమానాలు ఎదుర్కొన్నా. వీటన్నింటిని జయించడానికి నాతో నేను పోరాడా. నాలాంటి బాధితులను కలుసుకునే అవకాశం ఓసారి దక్కింది. వారి బాధలను విన్నా, వారికి చట్టపరంగా చేయూత నందించాలని అనిపించింది. ‘హ్యూమన్‌ రైట్స్‌ లా నెట్‌వర్క్‌’లో చేరా. యాసిడ్‌ బాధితులకు చికిత్స నుంచి, న్యాయ సమస్యలను ఎదుర్కొనేలా చేయూతనందిస్తున్నా. రెండేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. నేను అందిస్తున్న సేవలను చూసిన శ్రువ నన్ను ప్రేమించి గతేడాది వివాహం చేసుకున్నారు. కష్టం ఎదురైనప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తే అనుకున్నది సాధించగలమని నా నమ్మకం’ అని చెబుతోంది సంచయితా శ్రువ.


Advertisement

మరిన్ని