కెనడాలోనూ సత్తా చూపుతున్నారు...

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ టీమ్‌లో భారతీయ మహిళా శక్తి గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు కెనడా వంతు... ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో మంత్రి వర్గంలో రక్షణమంత్రిగా అనితా ఆనంద్‌, కమల్‌ ఖేరా వృద్ధుల మంత్రిగా పదవులందుకున్నారు.

Updated : 28 Oct 2021 05:56 IST

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ టీమ్‌లో భారతీయ మహిళా శక్తి గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు కెనడా వంతు... ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో మంత్రి వర్గంలో రక్షణమంత్రిగా అనితా ఆనంద్‌, కమల్‌ ఖేరా వృద్ధుల మంత్రిగా పదవులందుకున్నారు. వారెవరో చూడండి...


నాయకత్వ లక్షణాలే నడిపించాయి... - అనితా ఆనంద్‌!

1993లో ఆరునెలల పాటు రక్షణమంత్రిగా ఉన్న కిమ్‌ కాంప్‌బెల్‌ తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి మహిళ అనిత ఆనందేే. ఇంతటి కీలక శాఖను అప్పగించడానికి ఆమె సమర్థతే కారణం. కార్పొరేట్‌ లాయర్‌గా ప్రస్థానం ఆరంభించిన అనిత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. కరోనా సంక్షోభంలో ప్రజా సేవల, వ్యాక్సిన్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీకా పంపిణీలో సమర్థంగా వ్యవహరించారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ రంగంలోనూ సుదీర్ఘ అనుభవం ఉంది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎన్నికై, ప్రధాని జస్టిన్‌ టూడ్రో క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు. ఇటీవలి ఎన్నికల్లో ఆమె 46శాతం ఓట్లతో ఓక్‌విల్లే నుంచి విజయం సాధించారు. అనితకు నాయకత్వ లక్షణాలు ఎక్కువనీ ఎప్పటికైనా రాజకీయాల్లో రాణిస్తుందని చెప్పేవారట వాళ్లమ్మ. అనిత గతంలో కెనడియన్‌ మ్యూజియం ఆఫ్‌ హిందూ సివిలైజేషన్‌ ఛైర్‌పర్సన్‌గానూ పనిచేశారు.  

భారతీయ మూలాలు... అనిత అమ్మ సరోజా దౌలత్‌ రామ్‌ది పంజాబ్‌. నాన్న సుందర్‌ వివేక్‌ ఆనంద్‌ది తమిళనాడులోని వెల్లూరు. డాక్టర్లయిన వీరిద్దరిదీ ప్రేమ పెళ్లి. కొన్నాళ్లు ఇండియా, నైజీరియాల్లోనూ నివసించారు. 1965లో కెనడాలో స్థిరపడ్డారు. తనకి ఇద్దరు చెల్లెళ్లు. వారిలో గీత న్యాయవాది, సోనియా వైద్య పరిశోధకురాలు. అనిత క్వీన్స్‌ విశ్వవిద్యాలయం, వాధమ్‌ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్‌, డల్హౌసీ, టొరంటో విశ్వవిద్యాలయాల నుంచి న్యాయవిద్యలో, ఆర్ట్స్‌లో పట్టా అందుకున్నారు. టోరీస్‌లో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. మూడేళ్ల తర్వాత వెస్ట్రన్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. తర్వాత క్వీన్స్‌, టొరంటో విశ్వవిద్యాలయాల్లో వివిధ హోదాలో ఫ్యాకల్టీగా పనిచేశారు. వీరి బంధువులు... దిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల్లో ఉన్నారు. అనిత తాతగారు స్వాతంత్రోద్యమ యోధుడు. అనిత భర్త జాన్‌ నోల్టన్‌. వీరికి నలుగురు పిల్లలు. ఎయిరిండియా ఫ్లైట్‌-182పై బాంబు దాడికి సంబంధించిన దర్యాప్తు కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కోసం పరిశోధన చేశారామె.


సేవతోనే సాధించారు... కమల్‌ ఖేరా...

వృద్ధుల శాఖ మంత్రిగా నియమితురాలైన కమల్‌ప్రీత్‌ ఖేరా వయసు 32. పంజాబ్‌కు చెందిన ఆమె... ఇరవై ఏళ్ల క్రితం చదువు నిమిత్తం కెనడాకు వెళ్లారు. అక్కడే యార్క్‌ యూనివర్సిటీ నుంచి నర్సింగ్‌ (ఆనర్స్‌)లో బ్యాచిలర్స్‌ పట్టా పుచ్చుకున్నారు. తల్లి గురుశరణ్‌ కౌర్‌, తండ్రి హర్మీందర్‌ సింగ్‌. అన్నయ్య గుర్మీందర్‌ సింగ్‌... మొదట దిల్లీలో ఉన్నప్పటికీ తర్వాత విదేశంలోనే స్థిరపడ్డారు. కమల్‌ టొరంటోలోని సెయింట్‌ జోసెఫ్‌ హెల్త్‌ సెంటర్‌లోని అంకాలజీ యూనిట్‌లో నర్సుగా పనిచేశారు. కొవిడ్‌ మహమ్మారి రెండో దశలో విజృంభిస్తున్నప్పుడు వ్యాక్సినేషన్‌లో కీలకంగా పని చేశారు. 2015 నుంచి మూడుసార్లు ఎంపీగా ఎంపికవ్వడమే కాకుండా, పార్లమెంటరీ సెక్రటరీగానూ పనిచేశారు. టీనేజర్‌గా ఉన్నప్పుటి నుంచీ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. లోకల్‌ టీవీ టాక్‌షో ‘యూత్‌ విజన్‌’తో ఆ ప్రాంత ప్రజలకు సుపరిచితురాలు కూడా.  సౌత్‌ ఆసియన్‌ కెనడియన్స్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు చైర్‌పర్సర్‌గానూ వ్యవహరించారు. ఇవే ఆమెను... వెస్ట్‌ బ్రాంప్టన్‌కు లిబరల్‌ పార్టీ అభ్యర్థిగా గెలిపించాయి. భర్త మణి ఖేరా. మార్టగేజ్‌ ఏజెంట్‌. వారికో బాబు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్