తన కష్టం మరొకరికి రాకూడదని...!

ఇరవైఏళ్లు వచ్చినా అతను పసికందుకిందే లెక్క. అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిందే మరి. అందుకోసం ఆ అమ్మ ప్రభుత్వ ఉద్యోగాన్నే పణంగా పెట్టారు. అంతేకాదు తనలాంటి మరెందరో తల్లులకు ఊరటనివ్వడం కోసం ఓ సంస్థని స్థాపించారావిడ. భర్త, పిల్లలను కూడా సేవలో నిమగ్నం చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన నల్లగట్టు ప్రమీల...

Updated : 29 Oct 2021 06:07 IST

ఇరవైఏళ్లు వచ్చినా అతను పసికందుకిందే లెక్క. అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిందే మరి. అందుకోసం ఆ అమ్మ ప్రభుత్వ ఉద్యోగాన్నే పణంగా పెట్టారు. అంతేకాదు తనలాంటి మరెందరో తల్లులకు ఊరటనివ్వడం కోసం ఓ సంస్థని స్థాపించారావిడ. భర్త, పిల్లలను కూడా సేవలో నిమగ్నం చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన నల్లగట్టు ప్రమీల...

మొదట పాప... రెండోసారి బాబు పుట్టారు ప్రమీలకి. ప్రభుత్వ ఏఎన్‌ఎమ్‌గా పనిచేసే ఆమె పిల్లలని చూసుకుని మురిసిపోయింది. భర్త నాగేశ్వర్రావు ఆర్టీసీ కండక్టర్‌. అంతా బాగుందనుకుంటున్న సమయంలో బాబు ప్రవీణ్‌లో మూడేళ్లు నిండినా చురుకుదనం లేకపోవడం గమనించారు. ఆ పిల్లాడిలో మానసిక ఎదుగుదల ఉండదన్న వైద్యుల మాటలు వారి గుండెల్ని బద్దలు చేశాయి. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చక్రాల కుర్చీకే పరిమితమైన కొడుకుని ఇంట్లోనే వదిలి వెళ్లలేక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు ప్రమీల. ఇది ఇరవైయ్యేళ్ల నాటి మాట. అప్పట్నుంచి ఆ కొడుకుని పసిపిల్లాడిలా సాకుతున్నారు. తన కష్టం ఇంకొకరు పడొద్దన్న సంకల్పంతో 2001లో పెద్దతండాలో మెఫీ మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శారీరక, మానసిక దివ్యాంగులైన 55 మంది అభాగ్యులకు ఆశాదీపంగా మారారు. వారికి అన్నీ తానై సేవలు అందిస్తున్నారు ప్రమీల. స్నానం చేయించడం, భోజనం తినిపించడం, చిన్న చిన్న వ్యాయామాలు వంటివన్నీ ఆమే స్వయంగా చేయిస్తారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎంహెచ్‌ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణ, తన శుశ్రూషల ద్వారా ఇక్కడ దాదాపు 20 మందిని సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. బాగైన వారు వెళ్తుంటే మరికొందరు వచ్చి చేరుతుంటారు.

ఇంటిల్లిపాదీ...

కేంద్రానికి వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ తల్లి స్ఫూర్తితో కుటుంబ సభ్యులంతా సేవాపథంలోకి అడుగుపెట్టారు. కూతురు ప్రియాంక, ప్రవీణ్‌ తర్వాత పుట్టిన అన్వేశ్‌కీ దివ్యాంగుల సేవలో శిక్షణ ఇప్పించారు ప్రమీల. వారూ ఇక్కడ ఆశ్రయం పొందిన అభాగ్యుల సంరక్షణలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. భర్త నాగేశ్వరరావూ వీలు దొరికినప్పుడల్లా వీరి సపర్యల్లోనే గడుపుతారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా భర్త జీతంలో సగానికిపైగా మెఫీ కేంద్రానికే కేటాయిస్తున్నారు ప్రమీల. వీరి సేవాభావం చూసి కొందరు దాతలు విరాళాలిస్తున్నారు. మరికొందరు పుట్టిన రోజు, పండుగ రోజుల్లో భోజనాలు అందిస్తూ ఉంటారు.

‘ఇప్పటికీ అద్దె భవనంలోనే మెఫీని కొనసాగిస్తున్నాం. ఖర్చులు బాగా పెరిగాయి. విద్యుత్‌ బిల్లులూ చెల్లించలేని పరిస్థితి. ప్రభుత్వం చేయూతనిస్తే మరింత మందికి సేవలందిస్తా. నా చివరి శ్వాస వరకు అభాగ్యుల సేవలోనే తరిస్తా’ అంటున్నారు ప్రమీల.

- లింగయ్య ఉప్పుల, ఖమ్మం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్