Published : 02/11/2021 00:31 IST

ఎల్లలు దాటిన మోసాలపై జట్టుగా.. పోరాటం!

తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లిచేసుంది. విదేశాలకు వెళ్లి స్థిరపడదామంటే సరేనంది. తల్లిదండ్రులూ కూతురి కోసం తమ దగ్గరున్నదంతా అతని చేతిలో పెట్టారు. అతనేమో అక్కడ స్థిరపడగానే ఈమె గురించి పట్టించుకోవడం మానేశాడు. సత్వీందర్‌ కౌర్‌.. తనలా ఎంతోమంది ఇలా భర్తల చేతుల్లో మోసపోయారని తెలిసి పోరాటం మొదలుపెట్టింది. ఎన్‌జీఓను స్థాపించి, న్యాయం జరిగేలా చూస్తోంది.

సత్వీందర్‌కు 2009లో పెళ్లైంది. పెద్దలు కుదిర్చిన సంబంధం. భర్త టీచర్‌. 2010లో అతను విదేశాలకు వెళ్లి స్థిరపడదామనుకుంటున్నట్లు సత్వీందర్‌కు చెప్పాడు. సంపాదన ప్రారంభమయ్యాక ఆమెనీ తీసుకెళతానన్నాడు. తమ భవిష్యత్‌ కోసమే కదా అని సరేనంది. కానీ అతని తల్లిదండ్రులు ఆర్థికసాయం చేయలేమన్నారు. దీంతో ఈమె అమ్మానాన్నలే తమ దగ్గరున్న వాటిని ఇచ్చారు. ఈమె దాచుకున్నవాటినీ ఇచ్చింది. వాటితో అతను జార్జియాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక సంపాదన అంతగా లేదని చెప్పేవాడు. దీంతో తీసుకెళ్లడం కుదరట్లేదనేవాడు. ఆమె నమ్మింది. ఉక్రెయిన్‌ వెళితే సంపాదన బాగుంటుందంటే రుణం తీసుకుని మరీ మూడు లక్షల రూపాయలను అందించింది. వాటితో ఉక్రెయిన్‌ వెళ్లి మెడికల్‌ యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించాడతను. మంచి జీతం. కానీ తనను తీసుకెళ్లే ప్రస్తావన వచ్చేసరికి మాట దాటేసేవాడు. అలా అయిదేళ్లు గడిచాయి.

2015లో అతను తిరిగి భారత్‌ వచ్చాడు. తనను అతనితో తీసుకెళతాడని చాలా సంతోషించింది. కానీ అతను వచ్చింది విడాకుల కోసమని తెలియలేదు. అత్తామామలు విడాకులివ్వమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. తను ససేమిరా అనడంతో ఇంటి నుంచి బయటకు పంపేశారు. భర్తతో కలిసి అద్దెకు ఇల్లు తీసుకుంది. ఓరోజు బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లిపోయాడు. అర్జెంటుగా రమ్మని పిలుపొచ్చిందని చెబితే నమ్మింది. కొద్దిరోజులకే ఫోన్‌ నంబరు, చిరునామా మార్చడంతో మోసపోయానని గ్రహించింది. పోలీసులను ఆశ్రయించింది. కోర్టుల చుట్టూ తిరిగింది. ఈ క్రమంలో తనలా మోసపోయిన ఎంతోమంది బాధితులను కలిసింది.

దాదాపుగా పంజాబ్‌, హరియాణల్లోనే ఇలా మోసపోయినవారు 32 వేలకుపైగా ఉన్నారని తెలుసుకుంది. చాలామందికి ఏం చేయాలో తెలియక అలా ఎదురుచూస్తూనే ఉంటున్నారని అర్థమైంది. 2016లో ‘అబ్‌ నహీ’ పేరిట ఓ ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఓ)ను ప్రారంభించింది. తను కలిసినవారితోపాటు కొన్ని ఎన్‌జీఓలు, సామాజిక మాధ్యమాల ద్వారా అలాంటివారిని కలిసింది. ఒక జట్టుగా ఏర్పడి న్యాయ పోరాటం ప్రారంభించింది. తరువాత కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరించింది. అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖా స్పందించి అలాంటివారి పాస్‌పోర్టులు క్యాన్సిల్‌ అయ్యేలా చేసింది.

మొత్తానికి సత్వీందర్‌ తన భర్త పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించడమే కాకుండా నెలనెలా మెయింటెన్స్‌ పొందగలిగింది. దీనికి రెండేళ్లు సమయం పట్టింది. అప్పట్నుంచీ మోసపోయినవారికి సాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కేస్‌ రిజిస్ట్రేషన్‌ దగ్గర్నుంచి, అనుసరించాల్సిన విధానాలు అన్నింటిలో సాయమందిస్తుంది. విదేశాలపేరుతో మగవాళ్లూ మోసపోతున్నారని తెలుసుకుంది. వారికీ సాయపడుతోంది. తన ఎన్‌జీఓ ద్వారా 700 మంది మహిళలు, 40 మంది మగవాళ్లు సాయం పొందారు. కౌన్సెలింగ్‌ ఇప్పించి 20 జంటలను కలిపింది కూడా.
‘చాలామందికి మోసం జరిగిందని తెలుసుకోవడానికే ఏళ్లు పడుతుంది. తర్వాత ఏం చేయాలో తెలీని పరిస్థితి. మోసపోయినవారే బాధననుభవిస్తున్నారు. చేసినవారు మాత్రం హాయిగా ఉంటున్నారు. అందుకోసమే ఈ సంస్థను స్థాపించానంటోంది’ సత్వీందర్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని