‘సామీ.. సామీ..’ కోసం ఏడాది ఎదురుచూశా!

మాది కరీంనగర్‌ జిల్లా కనపర్తి. ఆరో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత జమ్మికుంటలో స్థిరపడ్డాం. డిగ్రీ చేశా. నాన్న మల్లయ్య రైతు. అమ్మ శ్యామల గృహిణి. అక్క పద్మావతి చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. నాన్నకు తెలిసిన ఓ కళాకారుడు అక్క పాట విని బాగుందని మెచ్చుకున్నాడు. మెలకువలతోపాటు వేదికల మీద పాడటం నేర్పించాడు. అక్క పాటలు పాడేందుకు వెళుతుంటే నేనూ వెంట వెళ్లేదాన్ని. క్రమంగా నాకూ ఇష్టం ఏర్పడి.. విమలక్క, గద్దర్‌ పాటలు వింటూ సాధన చేసేదాన్ని. వేదికలపై పాడే అవకాశం రాక నిరుత్సాహపడ్డా. అమ్మానాన్నలే నాలో ధైర్యం నింపారు.

Updated : 07 Nov 2021 04:52 IST

పుష్ప సినిమాలో... ‘సామీ.. సామీ..’ పాటని విడుదలైన మూడు రోజుల్లోనే రెండు కోట్ల మందికిపైగా చూశారు. ఇంతగా వైరల్‌ అయిన ఈ పాట పాడిందెవరబ్బా అని నెటిజన్లు గూగుల్లో వెతకడం ప్రారంభించారు. సంచలనం సృష్టించిన ఈ పాటను ఆలపించింది.. జానపద గాయని మామిండ్ల మౌనికా యాదవ్‌. సినీరంగంలో తొలి పాటతోనే అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ యువ గాయని ‘వసుంధర’తో తన ప్రయాణాన్ని పంచుకుంది...

మాది కరీంనగర్‌ జిల్లా కనపర్తి. ఆరో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత జమ్మికుంటలో స్థిరపడ్డాం. డిగ్రీ చేశా. నాన్న మల్లయ్య రైతు. అమ్మ శ్యామల గృహిణి. అక్క పద్మావతి చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. నాన్నకు తెలిసిన ఓ కళాకారుడు అక్క పాట విని బాగుందని మెచ్చుకున్నాడు. మెలకువలతోపాటు వేదికల మీద పాడటం నేర్పించాడు. అక్క పాటలు పాడేందుకు వెళుతుంటే నేనూ వెంట వెళ్లేదాన్ని. క్రమంగా నాకూ ఇష్టం ఏర్పడి.. విమలక్క, గద్దర్‌ పాటలు వింటూ సాధన చేసేదాన్ని. వేదికలపై పాడే అవకాశం రాక నిరుత్సాహపడ్డా. అమ్మానాన్నలే నాలో ధైర్యం నింపారు.

2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. మా ఊరు కనపర్తి నుంచే ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది. అది ఊరూరా సాగే పాదయాత్ర. ఆ వేదిక నా గళానికి అవకాశం కల్పించింది. తొలిసారి పెద్దల ముందు ‘గోదారి గోదారీ ఓహో పారేటి గోదారీ.. సుట్టూ నీళ్లున్నా సుక్కా దక్కని ఏడారి ఈ భూమీ.. మాదీ తెలంగాణ భూమీ..’ గీతం పాడా. అప్పట్నుంచి ఏ ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నా, దీన్నే అడిగి మరీ పాడించే వాళ్లు. అలా రాష్ట్రమంతా తిరిగా. మేమలా వెళుతోంటే చుట్టుపక్కల వాళ్లు అమ్మను సూటిపోటి మాటలనే వారు. వాటన్నింటినీ పంటి బిగువున భరించింది అమ్మ. తను కోరుకున్నట్టే.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’లో ఉద్యోగం దక్కింది. కొందరు కళాకారులు నా పాటలు మెచ్చి, యూట్యూబ్‌లో పెట్టారు. అలా నా గొంతు ప్రపంచానికి
పరిచయమైంది. ‘కట్ట మీద కూసున్నాడే..’, ‘రాములో రాములా..’ పాటలనైతే 10 కోట్లమంది చూశారు. ఎనిమిది నెలల క్రితం యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించా. 70కి పైగా జానపద గీతాలు పాడా. మాతృదినోత్సవం, రాఖీ పండగ వంటి సందర్భాల్లో పాడిన వాటికీ లెక్కలేనన్ని ప్రశంసలొచ్చాయి.

‘పుష్ప’లో అలా అవకాశం
గత నవంబర్‌లో పుష్ప డైరెక్టర్‌ సుకుమార్‌ మేనేజర్‌ ‘సార్‌ మీతో పాట పాడించాలి అనుకుంటున్నారు. చెన్నై రాగలరా?’ అని ఫోన్‌ చేశారు. మొదట నమ్మలేదు. తిరిగి కాల్‌ చేశాక నమ్మకమొచ్చింది. వెంటనే నాన్నతో కలిసి చెన్నై వెళ్లా. రికార్డింగ్‌ స్టూడియోలో దేవీశ్రీ ప్రసాద్‌ను చూడగానే నోట మాట రాలేదు. ‘బావా.. ఓసారి రావా..’ అనే నా పాట విని పిలిచామన్నారు. దాన్నే మళ్లీ పాడించి వాయిస్‌ టెస్ట్‌ చేసి, పంపించారు. వాళ్లకు నచ్చుతుందో లేదోనని ఆరోజు రాత్రంతా ఆందోళన పడ్డా. మరుసటి రోజు సినిమా గురించి చెప్పి.. లిరిక్స్‌లోని ప్రతి వాక్యాన్ని దేవీ చదివి, అర్థాన్ని వివరించారు. ప్రాక్టీస్‌ చేసి మూడు రోజుల్లో పాడటం పూర్తిచేశా. పాట విడుదలయ్యే వారం ముందు కబురందించారు. ఈ పాట ఉంటుందో లేదోనని ఏడాదిగా నేను పడ్డ ఆందోళన అప్పుడు మాయమైంది.

అమ్మానాన్నల కష్టమే అంతా..
అమ్మానాన్నలకు అక్కా నేనే లోకం. మాకోసం వాళ్లు పడ్డ కష్టాలను కళ్లారా చూశా. ప్రోగ్రాములకు వెళ్లడానికి అమ్మ తన చెవిదిద్దులను తాకట్టు పెట్టి మరీ డబ్బు సర్దుబాటు చేసేది. నాన్న తన పనులు పక్కనపెట్టి మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లే వారు. ఉపాధ్యాయులూ ప్రోత్సహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నా. ‘సామీ.. సామీ..’ విడుదలయ్యాక అభినందిస్తూ ఎన్ని ఫోన్లు, మెసేజులో చెప్పలేను. సరదాగా నేర్చుకున్న పాటలే ఇప్పుడు అన్నం పెడుతున్నాయి. అమ్మానాన్నలనూ ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నాం. ‘ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు’ అని నమ్ముతా. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి. శ్రోతలను అలరించడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించేలా కృషి చేస్తా.

- తేరాల రంజిత్‌ కుమార్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్