108లో ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

నలభైదాటితే ఆరోగ్యంపై అనుమానం వస్తుంది మనకి...  కానీ ఈ బామ్మగారు 99 ఏళ్ల వయసులో పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. అంతకంటే ముందు ఆమె ప్రముఖ నాట్యకారిణి. 107ఏళ్లుపూర్తిచేసుకున్నా అద్భుతమైన చిత్రాలు కూడా వేయగలదు.

Published : 08 Nov 2021 00:37 IST

నలభైదాటితే ఆరోగ్యంపై అనుమానం వస్తుంది మనకి...  కానీ ఈ బామ్మగారు 99 ఏళ్ల వయసులో పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. అంతకంటే ముందు ఆమె ప్రముఖ నాట్యకారిణి. 107ఏళ్లు పూర్తిచేసుకున్నా అద్భుతమైన చిత్రాలు కూడా వేయగలదు. ఈ వయసులోనూ ఇన్నిపనులు ఉత్సాహంగా చేస్తున్న ఆమె ఆరోగ్యరహస్యమేంటో తెలుసుకుందాం..

యిలీనా క్రామర్‌ 1914, నవంబరు ఎనిమిదో తేదీన పుట్టారు. తండ్రి కార్ల విక్రయదారుడు. తల్లి గృహిణి. వీరికి అయిలీనా తర్వాత ఒక అబ్బాయి. చెడు అలవాట్లకు బానిసైన భర్త ఇచ్చే అరకొర డబ్బుతోనే ఇంటిని గడిపేదామె. అయిలీనాకు 13 ఏళ్లు వచ్చేసరికి తండ్రి ప్రవర్తనతో పొసగక అతడికి దూరంగా సిడ్నీలోని కూగీ పట్టణానికి వచ్చేశారు తల్లీబిడ్డలు. అక్కడే తనకిష్టమైన సంగీతం నేర్చుకోవడానికి మోడల్‌గా క్రామర్‌ పని చేశారు. దాంతోపాటు పాటల కచేరీల్లో పాల్గొంటూ వచ్చిన  ఆదాయాన్ని తల్లికిచ్చేవారు. 26ఏళ్లప్పుడు ఓ బ్యాలె ప్రదర్శన ఈమెకు నృత్యంపై ఆసక్తి కలిగించింది. గాయనిగా స్థిరపడాలనుకున్న ఆమె, నృత్యకారిణిగా కెరీర్‌ మార్చుకోవాలనుకున్నారు. అదే బ్యాలె బృందంలో చేరి శిక్షణ తీసుకున్నారు. మూడేళ్లకే వేదికపై నృత్యప్రదర్శనలు ప్రారంభించి ప్రపంచమంతా పర్యటించారు.

భారతదేశంపై ప్రేమ..

దేశవిదేశాల్లో డెమన్‌ మెషిన్‌, ద వీల్‌ ఆఫ్‌ లైఫ్‌, వాటర్‌ లిల్లీ, ఇండియన్‌ లవ్‌ స్టోరీ వంటి పలు నృత్యరూపకాలు ప్రదర్శించిన క్రామర్‌, ఇండియాలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. 1954 -57లో ఇండియాలోనే ఉన్నారీమె. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతం అంటూ తేడా లేకుండా సర్వమతసామరస్యం ఉన్న ఈ దేశసంప్రదాయం తన హృదయంలో నిలిచిందంటారీమె. ఇక్కడి చరిత్ర తెలుసుకున్న ఈమె, ఆ ప్రభావంతో ‘ఏ బుద్ధాస్‌ వైఫ్‌’ పేరుతో నృత్యరూపకాన్ని రూపొందించారు.   

74వ ఏట...

ఫ్రాన్స్‌కు చెందిన ఇజ్రాయెలీ అమెరికన్‌ బారుచ్‌ షాద్మీని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1987లో అనారోగ్యంతో షాద్మీ కన్నుమూయడంతో అమెరికా చేరుకుని, తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించారు. అయిదేళ్లపాటు వరుసగా వేదికపై పలు నృత్యరూపకాలను ప్రదర్శించారు. ఆ సమయంలో బిల్‌ అనే వ్యక్తిని ప్రేమించి 20 ఏళ్లపాటు ఆయనతో కలిసి జీవించారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమటిక్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఇండిపెండెంట్‌ థియేటర్‌ వంటి ప్రముఖ వేదికలపై ఈమె చేసిన  నృత్య ప్రదర్శనలు చరిత్రలో నిలిచాయి. రెండో భర్త బిల్‌ మరణించేనాటికి క్రామర్‌కు 99 ఏళ్లు. ఆ తర్వాత పుస్తకరచన ప్రారంభించి మూడు పుస్తకాలు రాశారు. తన 104వ ఏట ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రముఖ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని ఆర్చిబాల్డ్‌ ప్రైజ్‌ను అందుకున్నారు. ఈ బహుమతిని అందుకున్న అత్యంత పెద్దవయసున్న వ్యక్తిగానూ చరిత్రలో నిలిచారు.

పలురంగాల్లో

మోడల్‌గా, గాయనిగానే కాకుండా నృత్యం, చిత్రలేఖనం, పుస్తకరచనలోనూ ప్రతిభను ప్రదర్శించిన క్రామర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ‘ది ఉమెన్‌ ఆన్‌ ది హారిజాన్‌’ పేరుతో ఈమె తన జీవితాన్ని చలనచిత్రంగా మలిచారు. వృద్ధాప్యం, వయసు వంటి పదాలు తన జీవితమనే పదకోశంలో లేవంటారీమె. ‘నాకు వయసు పెరిగిందని ఎదుటివారు చెప్పినప్పుడుకాదు, నేనెప్పుడు ఫీల్‌ అవుతానో అప్పుడే నేను వృద్ధురాలిని. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. వైద్యుల సలహామేరకు విటమిన్లు తప్ప వేరే మందులు వినియోగించను. ఇప్పటికీ కారు, ఫ్రిజ్‌, సొంతంగా ఇల్లు లేదనే ఆలోచన లేదు. ప్రతి క్షణాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తా. ఇదే నా ఆరోగ్యరహస్యం’ అని అంటున్న క్రామర్‌ నృత్యం అంశాలపై ఓపుస్తకాన్ని రాశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్