Published : 08/11/2021 00:37 IST

నా ట్రైనింగ్‌వాళ్లకే ప్రత్యేకం!

‘నువ్వేం శిక్షణనివ్వగలవు?’.. జిమ్‌ ట్రైనింగ్‌ ఇస్తానన్నప్పుడు ఫర్జానాకి ఎదురైన ప్రశ్న ఇది. కానీ ఆమె నిరుత్సాహపడలేదు. సొంతంగా ప్రయత్నించింది. ఈసారి బ్లడ్‌ క్యాన్సర్‌ అడ్డుపడింది. అయినా ఆగలేదు. దాన్నీ అధిగమించింది. ఇదేమీ తన చిన్నప్పటి కలా కాదు.. కెరియర్‌ అంతకన్నా కాదు. జీవితంలో జరిగిన ఒక సంఘటన మహిళల కోసం ప్రత్యేక శిక్షకురాలయ్యేలా చేసింది.  తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ఎంతోమంది మహిళలకు అండగా ఉంటూ సుమారు ఐదు దేశాల వాళ్లకి శిక్షణనిచ్చేలా ఆమెను ప్రభావితం చేసిందేమిటి?

మా స్వస్థలం విశాఖే. నాన్న ఆటో మొబైల్‌ వ్యాపారి. అమ్మ రోషనార గృహిణి. బీఎస్సీ హోంసైన్స్‌ చదివా. 2005లో పెళ్లయ్యాక బెంగళూరు వెళ్లిపోయా. మావారు అబ్దుల్‌ హమీద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇంటికి దగ్గర్లో ‘రిఫా బోర్డింగ్‌ హోం’ అనే సంస్థ ఉంది. అది అనాథ బాలికల్ని చేరదీసి, విద్యాబుద్ధులతోపాటు నైపుణ్యాలు మొదలైనవి నేర్పించే సంస్థ. అందులో కోశాధికారిగా చేరా. నా బాధ్యతలతోపాటు ఆ పిల్లలకు అవసరమైన నైపుణ్యాల్ని నేనూ నేర్పిస్తుండేదాన్ని. ఓ రోజు హఠాత్తుగా అమ్మ చనిపోయిందని వార్త. విని తట్టుకోలేకపోయా. కుంగిపోయాను. తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కుటుంబమే లోకంగా బతికింది. చాలామంది ఆడవాళ్ల పరిస్థితి ఇంతే కదా అనిపించింది. సరైన వ్యాయామం ఉంటే.. చాలావరకూ అనారోగ్య సమస్యలుండవు. దీనిపై శిక్షణనిస్తే బాగుంటుందనిపించింది. కానీ నాకూ అవగాహన కావాలిగా! అందుకు తగ్గ శిక్షణ తీసుకోవాలనుకున్నా. అది 2014. జిమ్‌కు వెళ్లేదాన్ని. మహిళా ప్రత్యేకమైన వ్యాయామాలు, ఆకర్షణీయంగా కనిపించడంతోపాటు శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకున్నా. వాటితోపాటు ఆత్మరక్షణ నైపుణ్యాలపైనా పట్టు సాధించా. యూఎస్‌కు చెందిన ‘టోటల్‌ ఫిట్‌’ అనే సంస్థ నిర్వహించిన ‘ఫంక్షనల్‌ ట్రైనర్‌’ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యాను. న్యూట్రిషన్‌, పర్సనల్‌ ట్రైనర్‌, ప్రసవానికి ముందు, ఆ తరువాత చేయాల్సిన వ్యాయామాలు మొదలైన వాటిపై కోర్సులు చేశా. వీటన్నింటితో మహిళల ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన వచ్చింది. 2018లో బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చేశా. ఏదైనా జిమ్‌లో శిక్షకురాలిగా కొంతకాలం విధులు నిర్వర్తించాలనుకున్నా. ఎక్కడా అవకాశం రాలేదు. ‘నువ్వేం శిక్షణనిస్తావు’అనేవారు. ముందు నాకు తెలిసిన వాళ్లకి శిక్షణనివ్వాలని నిర్ణయించుకున్నా. బీచ్‌రోడ్‌లో రహదారి పక్కన ఖాళీ స్థలంలో శిక్షణ ప్రారంభించా. ఆ తర్వాత ఓ జిమ్‌లో శిక్షకురాలిగా అవకాశం రావడంతో చేరా. కాలం ఎప్పుడూ అనుకూలంగా ఉండదుగా! బెంగళూరులో ఉన్నప్పుడే ఓసారి వెన్నునొప్పి వచ్చింది. ఆసుపత్రికి వెళితే ‘వెన్నుభాగంలో కణతి ఉంది, తొలగించకపోతే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది’అన్నారు. శస్త్రచికిత్స చేయించుకున్నా అది పూర్తిగా తొలగిపోలేదు. మరో ఆపరేషన్‌ చేయాలన్నారు. దాన్నీ చేయించుకున్నా. తీరా చూస్తే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చిందన్నారు. కీమోథెరపీ తర్వాత పరిస్థితి మెరుగుపడింది. ఆ శస్త్రచికిత్సల సమయంలో మినహా శిక్షణనూ ఆపలేదు. మహిళలకు ప్రత్యేక జిమ్‌ ఉంటే బాగుంటుందన్నది నా ఆలోచన. అందుకే ‘ఫిట్‌ విత్‌ ఫ్యాబ్‌’ పేరుతో 2019లో జిమ్‌ ప్రారంభించా. పది మంది మాత్రమే వచ్చేవారు. వ్యాయామం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లడం అమ్మాయిలకు పెద్ద సమస్య. సొంత వాహనాలు లేనివాళ్లకి ఇంకా ఇబ్బంది. అందుకే రెండేళ్ల కిందట ఆన్‌లైన్‌ శిక్షణను ప్రారంభించా. కొవిడ్‌ తర్వాత చాలామంది ఈ పద్ధతే బాగుందనేవారు. యూఎస్‌, కెనడా, అబుదాబి, సౌదీ, దుబాయ్‌ దేశాలతోపాటు విశాఖ, బెంగళూరు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలవాళ్లూ నా దగ్గర ఆన్‌లైన్‌ శిక్షణ పొందుతున్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ని గుర్తించడంతో దాన్నుంచి కోలుకోవడమే కాకుండా నా లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతున్నా. మిగతావారికీ ఇదే సలహానిస్తుంటా. చిన్న నొప్పినీ తక్కువ చేయొద్దని చెబుతా. అమ్మ విషయంలో అప్పుడేం చేయలేకపోయా. మిగతావాళ్లూ అలా చేయొద్దని సూచిస్తుంటా.

- బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని