పవర్‌ లిఫ్టింగ్‌ @ 46

ఈమె పేరు సనా ఆష్‌పాక్‌ ముల్లా. ఊరు ముంబయి. వయసు 46 ఏళ్లు.  తాజాగా దక్కించుకున్న టైటిల్‌...‘ది స్ట్రాంగెస్ట్‌ ఉమెన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’. ఈ వయసులో ఇదెలా సాధ్యం అనుకుంటే మాత్రం ఈమె స్ఫూర్తి కథనం చదవాల్సిందే.

Updated : 09 Nov 2021 02:15 IST

ఈమె పేరు సనా ఆష్‌పాక్‌ ముల్లా. ఊరు ముంబయి. వయసు 46 ఏళ్లు.  తాజాగా దక్కించుకున్న టైటిల్‌...‘ది స్ట్రాంగెస్ట్‌ ఉమెన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’. ఈ వయసులో ఇదెలా సాధ్యం అనుకుంటే మాత్రం ఈమె స్ఫూర్తి కథనం చదవాల్సిందే.

వీ ముంబయికి చెందిన సనా ఆష్‌పాక్‌ ముల్లాను ఇంట్లో అందరూ చిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌ అనే వారు. తరగతి గదిలోకన్నా మైదానంలోనే ఎక్కువగా గడిపేది. క్రీడలంటే ఆసక్తి ఎక్కువ. అందులోనూ.. వెయిట్‌లిఫ్టర్‌ కావాలని కలలు కనేది. ఇంట్లోవాళ్లు మాత్రం చదువు పూర్తిచేసి, పెళ్లి చేసుకో అనేవారు. ఏం చేస్తుంది పాపం... తన కోరికల్ని అణచిపెట్టుకుని చదువు, తర్వాత పెళ్లై అత్తవారింట్లో అడుగు పెట్టింది. మైదానాన్ని మరిచినా, ఇంట్లోనే ఫిట్‌నెస్‌ను మాత్రం కాపాడుకుంటూనే ఉండేది.

సొంతంగా..
పిల్లలెదిగి కెరీర్‌లో స్థిరపడిన తర్వాత తనకంటూ ఓ వ్యాపకం పెట్టుకోవాలనుకుంది సనా. యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ, ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌ను ఫాలో అవుతూ.. ఇంట్లోనే వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసేది. కొన్నాళ్లకు ఇలా కాదు... శిక్షకుడి పర్యవేక్షణలో చేస్తే మేలనుకొని జిమ్‌లో చేరింది. మగవారితో సమానంగా బరువులెత్తుతున్న తనకు ట్రైనర్‌ ఓ సలహాను ఇచ్చాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో గాయాలయ్యే అవకాశాలెక్కువగా ఉంటాయని, బదులుగా పవర్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకోమని చెప్పాడు. అలా మూడేళ్లక్రితం ఇందులోకి అడుగుపెట్టిందీమె.

విజేతగా..

నవీ ముంబయి స్పోర్ట్స్‌ అకాడమీకి చెందిన బిపిన్‌ కాంబ్లే పర్యవేక్షణలో అందుకున్న శిక్షణ తనను అతికొద్దికాలంలోనే అందరిలోనూ ప్రత్యేకంగా నిలిపిందని చెబుతుంది సనా. ‘పవర్‌ లిఫ్టింగ్‌లో బిపిన్‌ ఎన్నో మెలకువలు నేర్పే వారు. ఆయన ప్రోత్సాహంతో చేరిన ఏడాదిలోనే చిన్నచిన్న పోటీల్లో పాల్గొన్నా. అలా 2019లో ‘ఇండియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌’ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచా. ఏటా ముంబయిలో మహారాష్ట్ర పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ నిర్వహించే ‘ది స్ట్రాంగెస్ట్‌ ఉమెన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ పోటీల్లో పాల్గొనాలనే నా కల ఈ ఏడాది తీరింది. తాజా పోటీల్లో మహిళల 72 కేజీల వెయిట్‌ క్యాటగిరీలో విజేతనై, రాష్ట్రంలోనే ‘బలమైన మహిళ’గా నిలిచా. నాకు గర్వంగా ఉంది. ఈ వయసులో నువ్వేం చేయగలవని చాలా మంది విమర్శించే వారు. వారందరికీ నేనంటే ఏంటో చూపించానని సంతోషంగా ఉంది. నా కుటుంబం కూడా నా ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తోంది. లక్ష్యాన్ని చేరడానికి వయసు అడ్డు కాదు. మనసులో బలమైన నిర్ణయం ఉంటే చాలు, విజయమే మనల్ని వరిస్తుంది. సొంతంగా జిమ్‌ను ప్రారంభించి ఈ రంగంలో ఆసక్తి ఉన్న వారికి శిక్షణనందిస్తా’ అంటోన్న సనా కథ నిజంగానే స్ఫూర్తిదాయకం కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్