పిప్లాంత్రీ... ప్రకృతికీ, పాపాయికీ రక్షణ!

ఆ ఊర్లో అమ్మాయి పుడితే ఓ పండగ. తన పేరిట వందకుపైగా మొక్కలను నాటుతారు. ఆమెకు భవిష్యత్‌ నిధి ఏర్పాటు చేస్తారు. 18 ఏళ్లు నిండనిదే ఆ పాపకు పెళ్లి చేయమని అమ్మానాన్నల నుంచీ

Updated : 14 Nov 2021 04:24 IST

ఆ ఊర్లో అమ్మాయి పుడితే ఓ పండగ. తన పేరిట వందకుపైగా మొక్కలను నాటుతారు. ఆమెకు భవిష్యత్‌ నిధి ఏర్పాటు చేస్తారు. 18 ఏళ్లు నిండనిదే ఆ పాపకు పెళ్లి చేయమని అమ్మానాన్నల నుంచీ రాతపూర్వక హామీ తీసుకుంటారు. ఇదంతా మన దేశంలోని ఓ పల్లెటూరి విశేషాలు!

ఎడారికీ, రాచరికానికీ పేరుగాంచిన రాజస్థాన్‌లో ఈ ఎకో-ఫెమినిజమ్‌ మొదలైంది. అక్కడి రాజ్‌సమంద్‌ జిల్లాలో పిప్లాంత్రీ అనే గ్రామముంది. దీనిలో 8000కు పైగా కుటుంబాలుంటాయి. ఇక్కడ ఏ ఇంట్లో అమ్మాయి పుట్టినా తన పేరిట 111 మొక్కలను నాటుతారు. వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడంతోపాటు ఆ అమ్మాయికి 18 ఏళ్లు నిండనిదే పెళ్లి చేయమని తల్లిదండ్రుల చేత ప్రమాణ పత్రం రాయించుకుంటారు. ఊరంతా కలిసి రూ.21,000 రూపాయలు, అమ్మానాన్నలతో రూ.10,000 ఆమె పేరిట అకౌంట్‌లో వేయిస్తారు. వీటిని ఆ అమ్మాయి యుక్తవయసుకు వచ్చేవరకూ ఎవరూ తీసే వీలు లేకుండా చూస్తారు.

ఈ విధానం దశాబ్దం కిందట మొదలైంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్యామ్‌ సుందర్‌ పలివాల్‌ 2006లో తన కూతురు కిరణ్‌ను కోల్పోయారు. ఆమెకు గుర్తుగా ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఆయన గతంలో గ్రామ కౌన్సిల్‌ అధికారిగా చేశారు. మొదట తన కూతురి పేరిట చేసినదాన్ని ఊర్లో ఎవరింట్లో ఆడపిల్ల పుట్టినా కొనసాగించడం మొదలుపెట్టారు. తర్వాత ఊళ్లోవాళ్లూ చేతులు కలిపారు. అలా ఇప్పటివరకూ రెండున్నర లక్షలకుపైగా చెట్లను నాటారు. వీటితోపాటు సహజ పెస్టిసైడ్‌లుగా అలోవెరా మొక్కల్ని నాటారు. దీనికి మార్కెట్‌లో విలువ ఎక్కువని గ్రహించి పట్టణం నుంచి నిపుణులను రప్పించి మరీ ఇక్కడి మహిళలకు శిక్షణనిప్పించారు. దీంతో వారు ఉపాధి పొందగలుగుతున్నారు. శ్యామ్‌ సుందర్‌ వర్షపునీటి నిల్వను ప్రోత్సహించడంతోపాటు దగ్గర్లోని కొండల్లో చెక్‌డ్యామ్‌లను నిర్మించేలా ప్రోత్సహించడంతో ఆ ఎడారి ప్రాంతంలో ఇప్పుడు నీటి ఎద్దడీ లేదు. అంతేకాదు.. ఆ ఊర్లో ఒక్క నేరమూ జరగదట. పైగా అమ్మాయిలను కాపాడటం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావిస్తారట. ప్రకృతికీ, అమ్మాయికీ ఒకేసారి రక్షణ.. మంచి ఆలోచనే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్