Updated : 15/11/2021 12:33 IST

ఇంట్లో చదివించి ఐఐటీకి పంపించా!

కళలపై ఆసక్తి ... భరతనాట్యంలో మేటిగా నిలబెడితే!  చదువు... కొత్తదారుల్లో నడిపించింది.  అందరికీ ఆదఇంట్లో చదివించి ఐఐటీకి పంపించా!ర్శంగా నడవాలన్న తపన....తనను సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా చేసింది. అలా తన పిల్లల్ని హోం స్కూలింగ్‌ విధానంతో చిన్న వయసులోనే ఐఐటీకి పంపించారామె. మానవ సేవే మాధవ సేవ అంటూ... లోపాముద్ర, విశ్వనాథ ట్రస్ట్‌ల ద్వారా వేల మందికి అండగా నిలుస్తున్నారు హైదరాబాద్‌కి చెందిన కొంపెల్ల మాధవీ లత.  

జీవితం ఎప్పుడూ ఒకలాగే ఉండదు. కాలంతో వచ్చే మార్పుల్ని అంగీకరించాలి. అవకాశాల్ని ఒడిసి పట్టుకుంటూనే, వైఫల్యాలను పాఠాలుగా మార్చుకుని గెలుపు రాత రాసుకోవాలి. ఇందుకు నా జీవితమే ఓ ఉదాహరణ. మాది మధ్యతరగతి సంప్రదాయ కుటుంబం. నాకు మాత్రం చిన్నప్పటి నుంచీ ఆధునిక భావాలు ఉండేవి. రెండున్నరేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టా. తొలిసారి రవీంద్రభారతిలో ప్రదర్శన ఇచ్చేప్పటికి నాకు నాలుగున్నరేళ్లు. ఎనిమిదేళ్లకు లెజెండరీ డ్యాన్సర్‌ స్వప్న సుందరి ఆధ్వర్యంలో రత్లాంలో ప్రదర్శన ఇచ్చా.  చదువులోనూ చురుగ్గానే ఉండేదాన్ని. నిజాం కాలేజీలో డిగ్రీ చదివేప్పుడు సివిల్స్‌ రాయాలనేది కోరిక. రిజర్వేషన్‌ ఉంటుందని తెలిసి ఎన్‌సీసీలో చేరా. అప్పుడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపిక కావడం ఎప్పటికీ మరిచిపోలేను. అయితే పెళ్లికి ముందే నాట్య ప్రదర్శనలు ఆపేశా.

చదువు భారం కాకూడదని... మా వారు విశ్వనాథం ఐఐటీ గ్రాడ్యుయేట్‌. మాకు ముగ్గురు పిల్లలు. చిన్నారులు ఒత్తిడికి గురవకుండా చదివించాలన్నది నా ఆలోచన. అందుకోసమే మా పెద్దమ్మాయి లోపాముద్రతో హోం స్కూలింగ్‌ మొదలుపెట్టాం. టీచర్‌గా పనిచేసిన నా అనుభవం, మావారి ఐఐటీ పరిజ్ఞానం కలిపి పిల్లలకు కథల రూపంలో పాఠాలు చెప్పేవాళ్లం. తొమ్మిదేళ్లు వచ్చేవరకూ కేవలం భారతం, భాగవతం, పురాణాలతో పాటు జీవశాస్త్రాలు, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ వంటి వాటిని ప్రాక్టికల్‌గా నేర్పించాం. తొమ్మిదో ఏట తొలిసారి పుస్తకం పట్టుకున్న మా పెద్దమ్మాయి 12వ ఏట పది  పూర్తిచేసింది. 15 ఏళ్లకే ఐఐటీలో సీటు సాధించింది. ఇటీవలే బాబు కూడా ఐఐటీలో చేరాడు.

రోడ్డు ప్రమాదాలు చూసి... అవసరం ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం మొదటి నుంచీ నాకూ, మా వారికీ అలవాటు. దాన్నే ఆర్గనైజ్డ్‌గా చేయాలనుకున్నాం. రాత్రిపూట రోడ్లపై డివైడర్‌లు కనిపించక ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతున్నారు. ఆ విషయం తెలిసి హైదరాబాద్‌ రహదారులపై 1500 వరకు నియాన్‌ బోర్డులను ఏర్పాటు చేశాం. అందుకోసమే లోపాముద్ర ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశాం. మా మామగారు తన తండ్రి విశ్వనాథ్‌ పేరుమీద ట్రస్ట్‌ని ప్రారంభించారు. దీని ద్వారా 3000లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాం. 2500 వరకు అంగన్‌వాడీ పాఠశాలల్లో మంచినీటి సదుపాయం,  లైబ్రరీలు ఏర్పాటు చేశాం. తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లిలో గర్భిణులకు తొమ్మిదినెలలకు సరిపడా మందులు, పోషకాహార కిట్లు అందించాం. కర్నూలు వరదల సమయంలోనూ 1200 కిలోమీటర్లు తిరిగి అక్కడి వారికి కావాల్సిన సామగ్రిని అందించాం. ఇలా రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో మా సేవలు సాగుతున్నాయి.

వారికి ఆరోగ్యబీమా!... కేవలం సాయం అంటే ఇదే చేయాలని లేదు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా మేమున్నాం అని చెప్పడమే మా లక్ష్యం. పదుల సంఖ్యలో అరటి వ్యాపారులకు ఆరోగ్య బీమా చేయించా. వందల మంది చిన్నారులకు ఐదేళ్లు వచ్చేవరకూ వారి పోషణ నిమిత్తం ప్రతినెలా నాలుగువేల రూపాయల్ని అందిస్తున్నాం. అనాథ, నిరుపేద పిల్లల కోసం రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టాం. అప్పుడే విరించి ఆస్పత్రి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. గతంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఉచితంగా ఓ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశా. కానీ నిర్వహణ భారమై మూసేయాల్సి వచ్చింది. వీలైతే మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన. ఇక,  కొవిడ్‌ సమయంలోనూ రోజూ ఉస్మానియా ఆస్పత్రి వద్ద నాలుగు వందల మందికి ఆహార పొట్లాలు అందించాం. మన సంస్కృతి సంప్రదాయాలను కొత్త తరానికి మనసుకు హత్తుకునేలా అందించాలన్నదే నా ఆకాంక్ష. అందుకే ఆ తరహా ప్రసంగాలు ఎక్కువగా ఇస్తుంటా.  మాతృత్వం అంటే ఓ హోదానో, వృత్తో కాదు. పెద్దగా ప్రమోషన్లు లేని ప్రేమతో కూడిన ఉద్యోగం. దాన్ని మహిళలు మాత్రమే చేయగలరు. నేను ఓ తల్లిగా దాన్ని నిర్వర్తించా. అలానే సేవాకార్యక్రమాల నిర్వహణ, ఇంకోవైపు ఆసుపత్రి డైరెక్టర్‌గా నా బాధ్యతల్ని పూర్తి చేయగలుగుతున్నానంటే... ఏదో చేయాలన్న తపనే కారణం. నేనే కాదు...అనుకున్నవన్నీ ప్రతి స్త్రీ చేయగలదు. అందుకు చేయాల్సింది తనపై తాను నమ్మకం ఉంచుకోవడమే.

ఈ తరానికి నేర్పాలనే... ఇప్పటి పిల్లలకి వ్యక్తిత్వ వికాసం అవసరం. ఎందుకంటే భావోద్వేగాల నియంత్రణతోపాటు ఆత్మవిమర్శనూ వారు అలవాటు చేసుకోవాలి. నేను తప్పు చేస్తే మా పిల్లలు వాటిని ధైర్యంగా నాతో చెప్తారు. వాళ్లు తప్పు చేసినా నేను చెబుతాను. అయితే అది విమర్శనాత్మకంగా ఉండకుండా చూసుకోవటం బాల్యం నుంచే నేర్పించా. తల్లిదండ్రులు ఆచరించేవే పిల్లలు నేర్చుకుంటారు. చిన్నతనంలోనే పెద్దవాళ్లతో ఎలా మసలుకోవాలో నేర్పించేందుకు ముందు మనం వాటిని పాటించాలి. ‘ఒకసారి మా పెద్దమ్మాయి వాళ్ల నాన్నతో ఏదో విషయమై వాదిస్తోంది. చివరికి తన వాదన నిజమని నిరూపించలేక విసురుగా అరిచి వచ్చేసింది. అప్పుడు తొలిసారి తనలో అంత కోపం చూశాను.  రెండోసారి కడుపుతో ఉన్న రోజులవి. మోకాళ్లపై కూర్చుని... తన ఎత్తుకి నేను దిగి ఎందుకంత కోపం. నీ వాదన నిజమే కావచ్చు కానీ దానిని నిజమని ఒప్పించాల్సిన బాధ్యత నీదే కదా. ఇప్పుడు నాన్నకి సారీ చెప్పినంత మాత్రాన నీ వాదన అబద్ధం అని అర్థం కాదు. సరిగ్గా వాదించగలిగే వరకు ఆగమని చెప్పాలి కానీ పెద్దవాళ్లను విసుక్కోకూడదని చెప్పాను. అప్పుడు వాళ్ల నాన్నకు సారీ చెప్పింది ఆ తర్వాత ఎప్పుడూ ఇంట్లో కోప్పడటం నేను చూడలేదు’. ఇంకో సందర్భంలో... నేను వాళ్ల నాన్న మీద అరుస్తుంటే అప్పుడు తను ‘అమ్మా... మాకు చెప్పటమేనా మీరు ఆచరించరా’ అని అమాయకంగా అడిగింది. ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. తనముందే వాళ్ల నాన్నకు సారీ చెప్పా. చిన్నారులు మనల్ని చూసే నేర్చుకుంటారు. ముందు మీరు ఆచరించండి వాటినే పిల్లలు పాటిస్తారు.

తల్లే తొలి గురువు... నా పిల్లలకు పదేళ్లు వచ్చే లోపే 20 రకాల ఆటలు, సంగీతం, నృత్యం వంటి వాటిని పరిచయం చేశాను. కానీ బలవంతంగా వాళ్లకు నేర్పించటం మాత్రం ఇష్టం లేదు. నచ్చింది వాళ్లే ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చాను. కానీ పెద్దగా వాళ్లకు అవి నచ్చలేదు. ఎలాగైనా మా పెద్దమ్మాయికి సంగీతం నేర్పించాలనుకున్నాను. ముందు గురువుగారిని ఇంటికి పిలిచి రోజూ రెండు గంటలపాటు నేను సంగీతం నేర్చుకోవటం ప్రారంభించాను. అలా అయినా తను నేర్చుకుంటుందని ఆశ. తొలినాళ్లలో నన్ను బాగా డిస్టబ్ర్‌ చేసేందుకు ప్రయత్నించేది. నేను ఏ మాత్రం చలించకుండా పాడుతూనే ఉండేదాన్ని. ఆ ఏకాగ్రతని తను చెరపలేకపోయింది. క్రమంగా తనూ పాడటం అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఏకధాటిగా ఆరు గంటలపాటు సంగీత సాధన చేయగలదు.

సంస్కృతీ నేర్పిస్తుంది... విదేశాల నుంచి వచ్చి ఎంతో మంది మన సంస్కృతిని అభిమానిస్తున్నారు. శివారాధన, హరే రామ హరే కృష్ణ అంటున్నారు. ఇటీవల స్త్రీ పురుషుల మధ్య పోటీ తత్వం పెరిగింది. కానీ అర్ధనారీశ్వర తత్వంలోనే స్త్రీ పురుషుల సమానత్వం ఉంది అయితే అది పోటీ పడటానికి కాదు.. కలిసి జీవించటానికి మంచి సమాజాన్ని నిర్మించటానికే అని నేటితరం గుర్తించాలి. ఒక కంచంలో అన్నీ రావు. నచ్చినవి తిని తృప్తి పడతాం. జీవితం అలాంటిదే. మంచి చెడులు వస్తాయి. సంతోషం పంచే విషయాలను తీసుకుని ముందుకు వెళ్లాలి.

స్త్రీ శక్తి తెలుసుకోవాలి... ధ్యానంలో శవంలా కూర్చున్న శివుని పక్కన పార్వతి కూర్చోగానే ఆ శక్తికి పరమేశ్వరుడికి సైతం శరీరం కంపించిందని సౌందర్యలహరి పుస్తకంలో ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. అంతటి మహత్తు స్త్రీకి ఉంది. అలా అని ప్రతి చోట మేమే గొప్ప అని చెప్పాల్సిన పనిలేదు. పోటీపడాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్త్రీ పురుషుల మధ్య పోటీతత్వం చూస్తున్నాం. అది సమాజానికి మంచిది కాదు. అవసరమైనప్పుడు స్త్రీలోని శక్తి దానంతట అదే బయటకు వస్తుంది ప్రదర్శించాల్సిన అవసరం లేదు.

- రమ్య నవీన్‌, ఈటీవీ, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని