దేశం చుట్టిన తల్లీకొడుకులు

కేరళ నుంచి కశ్మీరు వరకు రోడ్డు మార్గం ద్వారా వేల కిలోమీటర్ల దూరాన్ని పదేళ్ల కొడుకుతో కలిసి చుట్టేసిందావిడ. 51 రోజుల్లో 28 రాష్ట్రాల్లో పర్యటించిన 40 ఏళ్ల డాక్టర్‌ మిత్రా సతీశ్‌ యాత్రానుభవాలు ఇవీ...కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మిత్రా సతీష్‌.

Updated : 18 Nov 2021 06:28 IST

కేరళ నుంచి కశ్మీరు వరకు రోడ్డు మార్గం ద్వారా వేల కిలోమీటర్ల దూరాన్ని పదేళ్ల కొడుకుతో కలిసి చుట్టేసిందావిడ. 51 రోజుల్లో 28 రాష్ట్రాల్లో పర్యటించిన 40 ఏళ్ల డాక్టర్‌ మిత్రా సతీశ్‌ యాత్రానుభవాలు ఇవీ...

కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మిత్రా సతీష్‌. తన ముద్దుల కొడుకు నారాయణ్‌. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలంటారు కదా. అలాంటి గ్రామాల గురించి తెలుసుకోవాలని, అందుకోసం దేశవ్యాప్తంగా పర్యటించాలనేది డాక్టర్‌ మిత్రా కోరిక. ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకుంది. అందరూ కలిసి బృందంగా యాత్ర చేద్దామనుకున్నారు. కొవిడ్‌ కారణంగా వారి ఆలోచన ముందుకెళ్లలేదు. కానీ తను మాత్రం ఆగాలనుకోలేదు ఆవిడ. రైలు, విమానంలో కాకుండా రోడ్డుమార్గంలో తిరిగి రావాలనుకుంది. పిల్లాడిని కూడా తీసుకెళ్తే పుస్తకాలు, బళ్లో పాఠాల కన్నా ఎక్కువ జీవిత పాఠాలు నేర్చుకుంటాడన్నది తన నమ్మకం.

* అనుభవంతో... ముందుగా ఒకటీరెండు చోట్లకు వెళ్లి వస్తే ఆ అనుభవాలు సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగపడతాయనుకుంది. అలా తన కొడుకు నారాయణ్‌తో కలిసి నీలగిరులకు వెళ్లింది. అక్కడి తోడా తెగ ప్రజలని కలిసి, వారి సంస్కృతి సంప్రదాయాలను పరిశీలించింది. ఆ సమయంలో నారాయణ్‌ ఎలా ఉంటాడో అని మొదట్లో కాస్త ఆందోళన పడింది. కానీ అతను తన పనులు తాను చేసుకోవడం, తన గురించి తానే శ్రద్ధ తీసుకోవడం గమనించింది డా.మిత్రా. ఇంకేముంది రెట్టించిన ఉత్సాహంతో కూర్గ్‌, బేలుర్‌, బేల్వాడీ, మేలుకోట ప్రాంతాలను పర్యటించారిద్దరూ. ఈ యాత్రానుభవాలు మిత్రాలో దేశమంతా ప్రయాణించాలనే ఆసక్తిని మరింత పెంచాయి.  ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక గ్రామాన్నైనా సందర్శించి అక్కడి సంప్రదాయాలు, స్థానిక కళానైపుణ్యాలపై అవగాహన పొందాలనేది తన లక్ష్యం. ‘కొచ్చి నుంచి కశ్మీరు వరకు వెళ్లాలని నిశ్చయించుకున్నా. ఆ మార్గంలో ప్రాంతాలు, వాతావరణం వంటి వివరాలను పూర్తిగా సేకరించా. ఏయేచోట్ల ఆగాలి, ఎప్పుడు తిరిగి ప్రయాణాన్ని మొదలుపెట్టాలనే అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేశా. కారు మెయింటెనెన్స్‌, రిపేర్లొస్తే గుర్తించడం, స్వయంగా మరమ్మతులు చేసుకోవడం వంటి విషయాలపై శిక్షణ తరగతులకు హాజరయ్యా. కొచ్చి నుంచి మార్చి 17న ‘ఒరు దేశీ డ్రైవ్‌’ పేరుతో మా ప్రయాణం మొదలైంది. తమిళనాడు, ఉత్తరాఖండ్‌, దెహ్రాదున్‌, జైపుర్‌, ఉజ్జయిని, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా సహా మొత్తం 28 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి కశ్మీరుకు చేరుకున్నాం. మొత్తం 17వేల కిలోమీటర్లు తిరిగాం. కొన్నిచోట్ల స్నేహితులు, తెలిసిన వాళ్ల ఇంట్లో బస చేశాం. అలాగే కొన్ని గ్రామాల్లో స్థానికుల ఇళ్లల్లోనే ఉంటూ, స్థానిక కళలు, సంప్రదాయాలను తెలుసుకునే దాన్ని. ఈ ప్రయాణానికి రూ.1.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో తీయని పూతరేకుల రుచిని ఆస్వాదించా.  హైదరాబాద్‌లోని చేర్యాల పెయింటింగ్స్‌, విజయవాడ కొండపల్లి బొమ్మలు, వైజాగ్‌ బొర్రా గుహలు మరవలేను. అతి ఎత్తైన ప్రాంతాలు జోజీ లా, లదక్‌కు వెళ్లగలిగాం. ఈ అనుభవాలన్నీ జీవితమంటే ఏంటో తెలిసేలా చేశాయి.’ అని ఎంతో ఉద్విగ్నంగా చెప్పింది డాక్టర్‌ మిత్ర.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్