Updated : 19/11/2021 05:05 IST

దుఃఖం దిగమింగి.. ఆసరా అయ్యింది

పెద్ద చదువులు చదవాలి.. మంచి ఉద్యోగం సంపాదించి తన కాళ్లపై తాను నిలబడాలి.. 20 ఏళ్ల వయసులో షాహీన్‌ లక్ష్యమిది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ సాగే తనకు యాసిడ్‌ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో ఏళ్లు భరించలేనంత వేదన, బాధ అనుభవించింది. భవిష్యత్‌ ఏంటో తెలియని పరిస్థితి. అప్పుడే తనలానే ఎంతోమంది బలవుతున్నారని తెలుసుకుని వాళ్లకి సాయమందిస్తోంది.

షాహీన్‌ది దిల్లీకి చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబం. చదువుపై ఆమె ఆసక్తిని చూసి అమ్మానాన్నా ప్రోత్సహించేవారు. మధ్య తరగతి కుటుంబం.. దీంతో ఖర్చులకు ఇబ్బంది పెట్టకూడదని భావించేది. పంజాబ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ అవకాశమొచ్చింది. ఫీజు, హాస్టల్‌ ఖర్చులకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసేది. అక్కడి అధికారి ప్రవర్తన షాహీన్‌కి ఇబ్బందిగా ఉండేది. పోయేకొద్దీ వేధింపులుగా మారాయి. ఉద్యోగం మానేసింది. కానీ మార్క్‌షీట్‌ ఒకటి ఉండిపోవడంతో తీసుకోవడానికి ఓ రోజు వెళ్లింది. అందరూ వెళ్లిపోయినా ఆమెను వెళ్లనివ్వలేదు. షాహీన్‌ భయపడింది. కానీ ఏదో ఫోన్‌ కాల్‌ మాట్లాడాక వెళ్లి పొమ్మన్నాడు. అంత సులువుగా వెళ్లనివ్వడం వెనుక ఆంతర్యమేంటో అర్థమవడానికి ఎన్నో నిమిషాలు పట్టలేదామెకు. ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి తనపై యాసిడ్‌ చల్లి పారిపోయాడు.

2009.. పట్టపగలు.. చుట్టూ జనం, కాలిపోతున్న ఒళ్లు.. ఒక్కరూ సాయానికి రాలేదు. యాసిడ్‌ పోసిన వ్యక్తి తన కళ్ల ముందే తప్పించుకుని వెళ్లిపోయాడు. తర్వాత ఎవరో ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగైదు ఆస్పత్రులకు తిప్పినా ‘పోలీస్‌ కేసు.. చేర్చుకోం’ అన్నారు. చివరకు ఓ ఆసుపత్రిలో చేర్చుకున్నా.. త్వరిత సాయమందక ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. శారీరక బాధకి.. మానసిక బాధ తోడైంది. తన ముఖాన్ని తానే చూసుకోలేకపోయింది. బయటికి వెళ్లడానికే భయపడింది. దీనికితోడు చికిత్సకూ, కేసులకూ బోలెడు ఖర్చు. కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది. కొందరు సాయమందించారు. తనకు ఓ రోజు ఓ సందేహమొచ్చింది. దోషులు దర్జాగా తిరుగుతోంటే.. తనెందుకు తప్పు చేసిన దాన్లా ఇంట్లో దాక్కుంటున్నా అనుకుంది. మెల్లగా బయటికి వెళ్లడం మొదలుపెట్టింది. ముఖాన్ని దాచుకోవడం మానేసింది. ఆ సమయంలోనే తనలా ఎంతోమంది బాధితులు ఉన్నారని తెలుసుకుని, వాళ్లకి సాయం చేయాలనుకుంది. ఎన్నో ఎన్‌జీఓలు చికిత్స మొదలైన అంశాల్లో సాయమందిస్తున్నాయని తెలుసుకుని వాటితో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. నష్టపరిహారం, న్యాయసలహా, వైద్యసాయం మొదలైన వాటిన్నింట్లో సూచనలు, తోడ్పాటును అందిస్తోంది. తర్వాత ‘బ్రేవ్‌ సోల్స్‌ ఫౌండేషన్‌’ పేరిట స్వయంగా ఎన్‌జీవోను స్థాపించింది.

‘యాసిడ్‌ దాడి మానసికంగా, శారీరకంగా ఎలా కుంగదీస్తుందో నాకు అనుభవమే. అందుకే బాధితులకు సాయమందించాలనుకున్నా. వాళ్లకి సకాలంలో థెరపీ, కౌన్సెలింగ్‌తోపాటు న్యాయపరంగా ఎలా కొనసాగాలో సలహాలిస్తా’ నంటోంది 34 ఏళ్ల షాహీన్‌. ‘అప్‌నా ఘర్‌’ పేరిట రీహాబిలిటేషన్‌ సెంటర్‌నూ ప్రారంభించింది. ఇప్పటివరకూ 300 మంది యాసిడ్‌ బాధితులకు సాయమందించిన ఈమె ఎన్నో క్యాంపెయిన్‌లనూ నిర్వహిస్తోంది. సమానత్వం, తిరస్కరణను అంగీకరించడం మొదలైన అంశాలపై పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు జరగకుండానే కాదు.. అసలు యాసిడ్‌ అమ్మకాలే నిలిపివేయమని పోరాటం చేస్తోంది. అందరికీ న్యాయం కల్పించడానికి ప్రయత్నిస్తోన్న తనకి ఇంకా న్యాయం దక్కలేదు. ఆమె కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని