కష్టంలో తోడున్నారని.. ఆస్తి ఇచ్చేసింది!

ఎవరైనా సాయం చేస్తే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంకొన్నిసార్లు తిరిగి సాయమందించడమో, నగదు ఇవ్వడమో చేస్తుంటాం. కానీ ఒకామె ఏకంగా తన ఆస్తినే రాసిచ్చేసింది. ఒడిశాలో జరిగిందిది. పూర్తిగా తెలుసుకోవాలనుందా.. చదివేయండి. మినతి పట్నాయక్‌ది ఒడిశాలో కటక్‌. భర్త, కూతురు ఇదే తన లోకం. గత ఏడాది భర్త కృష్ణకుమార్‌కి క్యాన్సర్‌ అని తేలింది...

Published : 20 Nov 2021 00:20 IST

ఎవరైనా సాయం చేస్తే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంకొన్నిసార్లు తిరిగి సాయమందించడమో, నగదు ఇవ్వడమో చేస్తుంటాం. కానీ ఒకామె ఏకంగా తన ఆస్తినే రాసిచ్చేసింది. ఒడిశాలో జరిగిందిది. పూర్తిగా తెలుసుకోవాలనుందా.. చదివేయండి.

మినతి పట్నాయక్‌ది ఒడిశాలో కటక్‌. భర్త, కూతురు ఇదే తన లోకం. గత ఏడాది భర్త కృష్ణకుమార్‌కి క్యాన్సర్‌ అని తేలింది. చికిత్స అందిస్తుండగానే చనిపోయాడు. ఆ బాధ నుంచి కొద్దికొద్దిగా తేరుకుంటోందనగా కూతురు కోమల్‌ కుమారి గుండెపోటుతో మరణించింది. ఆమె వయసు 31 ఏళ్లే. ఆరు నెలల వ్యవధిలో భర్త, కూతురిని పోగొట్టుకోవడంతో మినతి తట్టుకోలేకపోయింది. ఆమె కూడా చనిపోవాలనుకుంది. తిండి తినడమూ మానేసింది. అప్పటిదాకా ఏదో ఒక అవసరంతో ఇంటికొచ్చే బంధువులూ ఆమెనలా వదిలేశారు. కానీ ఆ కుటుంబానికి సేవలందించిన బుధా అనే రిక్షా అతను ఆమెనలా చూస్తూ ఉండలేకపోయాడు. అతను, అతని కుటుంబం వండిపెట్టి దగ్గరుండి తినిపించడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం సహా బాగోగులన్నీ చూసుకున్నారు. ఆమె ఆ బాధ నుంచి బయట పడేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. అందుకు కృతజ్ఞతగా ఆమె రూ. కోటి విలువైన తన ఆస్తిని వాళ్ల పేరిట వీలునామా రాసింది.

‘మా అమ్మాయి స్కూల్లో చదివేప్పటినుంచి బుధా మా కోసం పనిచేస్తున్నాడు. తనంటే మావారికీ నమ్మకమెక్కువ. అందుకే స్థానికంగా ఎక్కడికెళ్లాలన్నా తన రిక్షానే ఉపయోగించేవాళ్లం. నా భర్త, కూతురు ఒకరి తర్వాత ఒకరు నన్ను విడిచి వెళ్లారు. అప్పటిదాకా మా నుంచి ఎన్నో లాభాలు పొందిన బంధువులూ కనీసం పలకరించడమూ మానేశారు. జీవితంపై ఆశ కోల్పోయిన నాకు బుధా కుటుంబమే తోడుగా నిలిచింది. 25 ఏళ్లుగా మాకు సేవలందిస్తున్న వాళ్లకి ఈరకంగా కృతజ్ఞత చెప్పాలనుకున్నా. కనీసం ఉండటానికి ఇల్లు లేనివాళ్లకి నా వల్ల ఓ నీడ దొరికితే అంతకన్నా ఏం కావాలి అనిపించింది. అందుకే ఈ నిర్ణయం’ అంటోంది 63 ఏళ్ల మినతి పట్నాయక్‌. ఈ విషయాన్ని ఎవరో నెట్‌లో పెట్టగా.. ఆమె నిర్ణయాన్ని అభినందిస్తూ కామెంట్లు వెల్లువగా వచ్చిపడుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్