టైల్స్‌తో.. కోట్లు!

ఎదుగూబొదుగూ లేని ఉద్యోగం... దేనికీ సరిపోని జీతం. అలాంటప్పుడు పరిస్థితులని తిట్టుకుంటూ కూర్చోలేదు జంపన శ్రీదేవి..  మహిళలు ఎక్కువగా అడుగుపెట్టని టైల్స్‌ తయారీ రంగంలో అడుగుపెట్టి  కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నారు. అడుగడుగునా స్ఫూర్తిని నింపే ఆమె కథ మనమూ తెలుసుకుందామా... హిందీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరారు శ్రీదేవి. ఎంత కష్టపడ్డా ఎటూ చాలని జీతం. ఆ జీవితం ఆమెకి నచ్చలేదు....

Updated : 20 Nov 2021 06:47 IST

వినూత్నరంగంలో విజయం

ఎదుగూబొదుగూ లేని ఉద్యోగం... దేనికీ సరిపోని జీతం. అలాంటప్పుడు పరిస్థితులని తిట్టుకుంటూ కూర్చోలేదు జంపన శ్రీదేవి..  మహిళలు ఎక్కువగా అడుగుపెట్టని టైల్స్‌ తయారీ రంగంలో అడుగుపెట్టి  కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నారు. అడుగడుగునా స్ఫూర్తిని నింపే ఆమె కథ మనమూ తెలుసుకుందామా...

హిందీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరారు శ్రీదేవి. ఎంత కష్టపడ్డా ఎటూ చాలని జీతం. ఆ జీవితం ఆమెకి నచ్చలేదు. అందుకే భర్త ప్రసాదరాజు మిత్రుడు టైల్స్‌ కంపెనీ నడుపుతున్నారని తెలిసి వాటి తయారీ గురించి తెలుసుకున్నారు. ఆ పనిపై కాస్త పట్టు వచ్చాక స్వశక్తిని నమ్ముకోవడమే మేలనుకుని ఉపాధ్యాయ వృత్తిని వదిలేశారు. ప్రస్తుతం 50మందికి ఉపాధి కల్పిస్తూ టైల్స్‌ తయారీలో లాభాల పంట పండిస్తునారు శ్రీదేవి. ‘మా సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు. ముప్ఫైఏళ్ల క్రితం ఉపాధి కోసమని గాజువాక వచ్చాం. కానీ సరైన ఉపాధి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడే నాకీ టైల్స్‌ తయారీ గురించి తెలిసింది. చేస్తున్న టీచర్‌ ఉద్యోగం మానేసి ఈ పని మొదలుపెట్టాను.  కొత్తలో సరైన అనుభవం లేక చాలా నష్టాలు వచ్చాయి. అలా అయిదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఆ కష్టాలే నాకు మంచి వ్యాపార పాఠాలు నేర్పాయి. మార్కెట్‌పై పట్టు తెచ్చుకునేలా చేశాయి. మా ఉత్పత్తులని అమ్మడం తేలికైంది. నాణ్యత, మన్నిక మెచ్చి చాలామంది ఆర్డర్లు ఇస్తున్నారు. కానీ తక్కిన వాటిల్లో మాదిరిగానే ఈరంగంలోనూ కొత్తదనానికే పెద్దపీట. సాదాసీదా టైల్స్‌కు మార్కెట్‌లో ఆదరణ లేదు. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లను తయారుచేస్తుంటా’ అనే శ్రీదేవి వాటి తయారీకి కావల్సిన ముడి పదార్థాలు తీసుకురావడం దగ్గర్నుంచి వాటి మిక్సింగ్‌, రంగులు అద్దడంతో పాటు వివిధ ఆకారాల్లో టైల్స్‌ తయారీ వరకు ఆమే దగ్గరుండి చేయిస్తారు. ఆమె కష్టానికి తగిన ఫలితం రావడంతో పెదగంట్యాడలో 2005లో జయసూర్య టైల్స్‌ పేరుతో సొంతంగా ఒక యూనిట్‌ను స్థాపించారు. ఆ తర్వాత యలమంచిలి సమీపంలోని అచ్యుతాపురంలో మరో యూనిట్‌ను నెలకొల్పారు. మొత్తం 50 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఇక్కడ తయారైన టైల్స్‌ తెలుగు రాష్ట్రాలతోపాటు సింగపూర్‌, ఒడిశా, కోరాపుట్‌, అచ్యుతాపురం సెజ్‌, ఫార్మా పరిశ్రమలకూ ఎగుమతి అవుతున్నాయి. రూ.3కోట్లకు పైగా వార్షికాదాయాన్ని సాధిస్తున్నారీమె. ‘రహదారుల విస్తరణలో భాగంగా డివైడర్లకు అవసరమైన సిమెంట్‌ బ్లాకులను వివిధ మోడళ్లలో అందిస్తున్నాం. సీసీడ్రైన్లు, పాత్‌వేలు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, రిటైనింగ్‌ వాల్స్‌కి ఉపయోగపడేలా ఇటుకలు, క్రాసింగ్‌-జిగ్‌జాగ్‌ టైల్స్‌, కలర్‌ బ్లాకులు ఇలా వివిధ రకాల మోడళ్లను తయారుచేస్తున్నాం’ అనే శ్రీదేవి సేవారంగంలోనూ తనదైన ముద్ర వేశారు. అవయవదాన సంఘంలో సభ్యురాలు. పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ పార్కులు, శ్మశానవాటికల్లో స్వయంగా శ్రమదానం చేయడం మొక్కలు నాటడం వంటివి చేస్తున్నారు. పాఠశాలలు, అనాథ శరణాలయాల్లో విద్యార్థులకు పుస్తకాలు, నిత్యావసరాలు, దుస్తులు అందించడం ద్వారా తన ఉదారతను చాటుకున్నారు. ఈమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో న్యూదిల్లీలో భారత జ్యోతి అవార్డును అందించింది. ‘ఇలాంటి రంగాల్లో ఆడవాళ్లకు ఉద్యోగావకాశమివ్వరు. కానీ వాళ్లకి అవకాశమిస్తే చిత్తశుద్ధితో చేస్తారు. మా సంస్థలో సూపర్‌వైజర్‌ సహా ఎక్కువ మంది వర్కర్లు మహిళలే. కరోనా సమయంలో ఇబ్బంది పడ్డ వాటిల్లో మా వ్యాపారమూ ఒకటి. కానీ వీళ్లు మేమున్నామంటూ తోడు నిలిచారు. అందుకే నిలదొక్కుకోగలిగాం. మహిళలకు అవకాశమిస్తే ఉన్నతస్థితికి తీసుకొస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? దీంతోపాటు కుటుంబ తోడ్పాటూ కావాలి. నా విజయంలో మావారిదీ ప్రధాన పాత్రే. అన్నివేళలా నాకు తోడుగా నిలిచారు. మాకిద్దరు పిల్లలు బాబు ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయికి పెళ్లైంది’.

- సూరిశెట్టి జగదీశ్‌, గాజువాక

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్