పోరుబాటలో పరాశక్తులు

పొలం నుంచి ఆనందంగా ఇంటికి వెళుతోంది నిషూ. త్వరలో అమ్మానాన్న దిల్లీనుంచి వచ్చేస్తారు. తను చదువు కొనసాగించొచ్చన్నది ఆ 23 ఏళ్ల అమ్మాయి ఆనందం.

Updated : 21 Nov 2021 05:17 IST

పొలం నుంచి ఆనందంగా ఇంటికి వెళుతోంది నిషూ. త్వరలో అమ్మానాన్న దిల్లీనుంచి వచ్చేస్తారు. తను చదువు కొనసాగించొచ్చన్నది ఆ 23 ఏళ్ల అమ్మాయి ఆనందం.

తనకు ఎదురైన పిల్లలు, వృద్ధులకు బాగా చదువుకోమనీ, వేళకు మందులేసుకోమని చెప్పి వీడ్కోలు తీసుకోంటోంది 37 ఏళ్లనిమ్రత్‌ కౌర్‌. తన రెండెకరాల పొలం ఇక తనకు దూరమవ్వదనే భరోసా ఆమెది!

సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించగానే ఇలా వెల్లివిరుస్తున్న చిరునవ్వులెన్నో! ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమానికి లక్షల మంది మహిళలు వెన్నుదన్నుగా నిలిచారు.. స్ఫూర్తి ప్రదాతలయ్యారు. వాళ్లలో కొందరు..


నాయకురాలై నడిపింది హరిందర్‌ కౌర్‌ బిందు

సామాజిక కార్యకర్త. స్వస్థలం ఫరిద్‌కోట్‌ జిల్లాలోని రామ్‌గఢ్‌ భగిటియానా గ్రామం. తండ్రి టెర్రరిస్టుల దాడిలో చనిపోయాడు. ఆయనా సామాజికవేత్తే. ఆయన ప్రభావం బిందు మీద ఎక్కువ. అందుకే ఇంటర్‌ తర్వాతి నుంచి యూనియన్లలో సభ్యురాలైంది. బీకేయూ ఏక్తా (ఉగ్రహాన్‌) మహిళా విభాగానికి ప్రెసిడెంట్‌. మహిళలూ తోడైతేనే నిరసనోద్యమం బలీయమవుతుందని నమ్మింది. పంజాబ్‌ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో సమావేశాలు నిర్వహించి సాగు చట్టాలపై అవగాహన కల్పించింది. 43 ఏళ్ల ఒంటరి తల్లి బిందు.. తన కొడుకుని అమ్మకు అప్పగించి పోరుబాట పట్టింది. ఈ ఏడాది మహిళా దినోత్సవం నాడు నిర్వహించిన కార్యక్రమంలో 50 వేల మందికిపైగా తన వెంట నడవడం ఆమె నాయకత్వ సామర్థ్యానికి ప్రతీక.


గుండె జబ్బూ ఆపలేదు: జస్విర్‌ కౌర్‌

సంగ్రూర్‌లోని చౌందా గ్రామానికి చెందిన సాధారణ గృహిణి. భర్త, కొడుకులు ఏళ్ల క్రితమే చనిపోయారు. అయినా ఓ రైతుగా సాటివారికి అండగా నిలబడాలనుకుంది.  పోరాటంలో పాల్గొడానికి వెళ్తోన్న కార్యకర్తలతో కలిసి ఈ జనవరిలో సింఘూ సరిహద్దులకు చేరింది. 74 ఏళ్ల వయసులో వేల కిలోమీటర్లు నడిచింది. ఎముకలు కొరికే చలి, వేడి కారణంగా ఎంతోమంది రైతులు ప్రాణాలు వదలడం చూసింది. తనకీ గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని నేరుగా శిబిరానికే వచ్చింది. తిరిగి రమ్మని తన మనవడు ప్రాథేయపడినా ససేమిరా అంది. అనేక మంది ప్రాణాలు పణంగా పెట్టి పోరాడు తున్నప్పుడు తనకు మాత్రం విశ్రాంతి ఎందుకని ప్రశ్నిస్తుంది!


ఏకైక మహిళా ప్రతినిధి: కవితా కురుగంటి

ప్రభుత్వంతో రైతు బృందాలు సాగించిన చర్చల్లో ఏకైక మహిళా ప్రతినిధి. రైతుల హక్కులపై మూడు దశాబ్దాలుగా కృషి చేస్తోంది. ‘ఆశా కిసాన్‌ స్వరాజ్‌’ తరఫున ‘ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ)లో భాగస్వామ్యం వహిస్తోంది. ‘మాకు సామర్థ్యం, బలం ఉంది మమ్మల్ని నిర్లక్ష్యం చేయలేరు’ అంటూ మహిళారైతుల తరఫున కవిత గళమెత్తింది. రోజూ ఒక చిన్న గిన్నెలో ఆరోజు వండిన వంటకాలన్నింటినీ ఉంచి భూదేవికి సమర్పించేది ఈమె నాయనమ్మ. మనకు ఎన్నో ఇస్తున్న నేల, ప్రకృతి రుణం తీర్చుకోవాలనే భావన అలా ఆవిడ ద్వారా చిన్నతనంలోనే కవిత మనసులో నాటుకుంది. అదే తనను సామాజిక కార్యకర్తగా మార్చిందంటుంది.


వాళ్లు సైతం..

ఏడాదికిపైగా సాగిన ఈ పోరులో తెర మీద కనిపించేది కొందరే అయినా.. వెనుక నుంచి అండదండలు అందించిన మహిళలెందరో! పోరుబాటలో ముందడుగు వేసిన ఇంటిపెద్దకు మద్దతుగా ఎంతోమంది కూతుళ్లు, భార్యలు కుటుంబ బాధ్యతలు చేపట్టారు. చదువులు, ఉద్యోగాలనూ పక్కనపెట్టేశారు. హలం చేతపట్టి పొలం బాట పట్టారు. చలినీ, వర్షాల్నీ, పోలీసుల లాఠీఛార్జిలనూ ఎదుర్కొంటూ దిల్లీ శిబిరాల్లో నెలల తరబడి పాల్గొన్న మహిళలు వేల సంఖ్యలో ఉన్నారు. వారక్కడా తీరికలేని పనుల్లో తలమునకలయ్యారు. వంట, పరిసరాల శుభ్రత నుంచి వృద్ధుల ఆరోగ్యం వరకూ అన్నింటినీ తలకెత్తుకున్నారు. తల్లులతోపాటు వచ్చిన చిన్నపిల్లల కోసం బడులు, గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. వారికి బోధన, కథలు చెప్పడం వంటివన్నీ వీళ్లే చూసుకున్నారు. నిరసన ప్రదర్శనలు, చర్చల్లో పాల్గొంటూనే ఈ అదనపు బాధ్యతలనూ స్వీకరించారు.
అక్కడి దాకా రాలేని వాళ్లు స్థానికంగా జరిగిన ధర్నాలు, ఉద్యమాల్లో విసుగూ విరామం లేకుండా పాలుపంచుకున్నారు. మొత్తమ్మీద పోరు ఫలించింది. ఉద్యమంలో మహిళా శక్తీ ప్రతిఫలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్