Published : 22/11/2021 00:28 IST

కథానాయకుడు.. మంగాదేవి

హరిశ్చంద్ర నాటక ప్రదర్శన జరుగుతోంది. పూర్తయ్యాక వేదికపైకి వచ్చిన వ్యక్తిని చూసి అంతా ఖంగుతిన్నారు. అప్పటివరకు అద్భుతమైన కంఠంతో హరిశ్చంద్ర వేషం కట్టి పద్యాలు పాడింది ఓ మహిళ అని తెలిసి ఆశ్చర్యపోయారు. మంగాదేవికి ఎక్కడికి వెళ్లినా ఇదే అనుభవం. పౌరాణిక నాటకాల్లో మగపాత్రలను వేస్తూ గుర్తింపు తెచ్చుకుందీమె!

విజయనగరం జిల్లా బాలగుడబకు చెందిన కె.మంగాదేవికి పాటలంటే ఇష్టం. ఏడో తరగతిలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశభక్తి గేయాలు పాడుతుంటే గొంతు బాగుందని స్థానిక నాటక సమాజం వారు ప్రోత్సహించారు. సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర చేయమన్నారు. నాన్న చిన్నమనాయుడు హరిశ్చంద్ర పాత్ర అయితేనే చేయిస్తానన్నారు. అలా మొదటిసారి హరిశ్చంద్ర పాత్ర వేసి ప్రశంసలందుకుంది. ఓ గురువు వద్ద వారణాసి ఘట్టం నేర్చుకుంది. ప్రముఖుల ప్రదర్శనలు ఎక్కడ జరిగినా నాన్నతో కలిసి వెళ్లేది. తర్వాత తనూ ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. నిరంతర సాధన కారణంగా గొంతు మారిపోయింది. వేషంలో అచ్చం పురుషుడిలా కనిపించడం, గొంతూ సరిపోతుండటంతో అవే పాత్రలొచ్చాయి. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. రంగస్థల కళాకారుడు పద్మశ్రీ వై.గోపాలరావుతో తను కలిసి ప్రదర్శన ఇవ్వాలనేది తండ్రి కోరిక. ఓసారి నెల్లూరులో ప్రదర్శన ఆగిపోయింది. దానికి గోపాలరావు వచ్చారు. కనీసం పద్యాలైనా పాడమని కోరారు. మంగాదేవి పద్యం విని అవకాశమిచ్చారు. అలా తండ్రి కోరిక నెరవేర్చింది.

గోపాలరావు ఇతర సమాజాలను పరిచయం చేయడంతో నెలలో 28 రోజులు ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగింది. ఈమె హరిశ్చంద్రుడు, బాపట్లకు చెందిన ఎం.విజయరాజు చంద్రమతిగా ఈ జోడీకి మంచి పేరు. ఇప్పటివరకు 3 వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. ఒక ఊరిలో చూసి, అప్పటికప్పుడు వేరే వాటిల్లోనూ ఏర్పాటు చేసిన సందర్భాలెన్నో. వై.గోపాలరావు దర్శకత్వంలో 2010లో నాటక రంగం వారితో సత్యహరిశ్చంద్ర సినిమా చిత్రీకరించారు. అయితే అది విడుదలవలేదు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈమె వీడియోలకు లక్షల్లో వీక్షకులున్నారు. హీరో మోహన్‌బాబు ఓ వీడియో చూసి ఫోన్‌ చేసి మరీ పద్యాలు పాడించుకున్నారు. కరోనా సమయంలో కళాకారుల కోసం ఏర్పాటైన అఖిల భారత కళాకారుల సంఘానికి ఈమె గౌరవాధ్యక్షురాలు. భర్త సూర్యనారాయణ ఆటో డ్రైవర్‌. కూతురు స్వాతి. వీరి సహకారంతోనే రాణిస్తున్నాని మంగాదేవి చెబుతోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని