నా జీవితంలో ఆ 40 రోజులు విలువైనవి...

భర్త సైనికుడు. నెలలపాటు చూడ్డమే వీలుకాదు. అతని తరఫున కుటుంబాన్ని కంటి పాపలా కాచుకుంటూ వచ్చింది. ఉగ్రదాడిలో ఆయన గాయాలపాలయ్యాడు. కోలుకొని ఇంటికొస్తాడనుకుంది. కానీ దేశరక్షణలో తన బాధ్యతనీ ఆమెకే అప్పజెప్పాడు.

Updated : 23 Nov 2021 05:45 IST

భర్త సైనికుడు. నెలలపాటు చూడ్డమే వీలుకాదు. అతని తరఫున కుటుంబాన్ని కంటి పాపలా కాచుకుంటూ వచ్చింది. ఉగ్రదాడిలో ఆయన గాయాలపాలయ్యాడు. కోలుకొని ఇంటికొస్తాడనుకుంది. కానీ దేశరక్షణలో తన బాధ్యతనీ ఆమెకే అప్పజెప్పాడు. ఓ పక్క ఉబికి వచ్చే కన్నీళ్లు... మరోవైపు భర్త కోరిక! రెండోదానివైపే మొగ్గుచూపింది. భర్త తుది కోరికగా అందించిన ఆ లక్ష్యాన్ని కఠోరదీక్షతో చేరుకుంది. ఆమే.. జ్యోతి దీపక్‌ నైన్వాల్‌. తాజాగా శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్‌ బాధ్యతలు అందుకోబోతోన్న ఆమెను వసుంధర పలకరించింది.

నాన్న వేదప్రకాష్‌ ఖందమ్‌ దేహ్రాదూన్‌లో కేంద్ర ప్రభుత్వోద్యోగి. అమ్మ గుడ్డీ ఖందమ్‌. ఇద్దరు అన్నయ్యలు. చుట్టుపక్కలంతా మిలిటరీ వాతావరణమే. అందుకే ఆ యూనిఫాం అంటే ఇష్టం. అయితే సైన్యంలో చేరాలన్న కోరికేమీ లేదు. అమ్మలా మంచి గృహిణిని అవ్వాలనుకునే దాన్ని. 2010లో డిగ్రీ అవగానే దీపక్‌ నైన్వాల్‌తో పెళ్లైంది. ఇంటికి పెద్దకోడలిని. దీపక్‌ చాలా ప్రేమగా చూసుకునే వాడు. కోరుకున్న జీవితం. కానీ తనకు ఫీల్డ్‌వర్క్‌ కావడంతో వివిధ ప్రాంతాల్లో ఉండాల్సొచ్చేది. ఆయనతోపాటు వెళ్లే వీల్లేక నేను అత్తగారింట్లోనే ఉండేదాన్ని. ఏడాదికే పాప లావణ్య, ఆపై రెండేళ్లకు బాబు రేయాన్ష్‌ మా జీవితాల్లోకి వచ్చారు.
2017 సెప్టెంబరు.. అదే చివరిసారి దీపక్‌ ఇంటికి రావడం. 2018 ఏప్రిల్‌లో ఫోన్‌.. కశ్మీరు ఎన్‌కౌంటర్‌లో ఆయన గాయపడ్డారని! తూటా వెన్నెముకకు తగలడంతో దీపక్‌ కాళ్లలో కదలిక లేదు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దిల్లీ నుంచి మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలోనైనా తన పక్కనే ఉండాలనుకున్నా. కానీ బయటి వారికి అక్కడ అనుమతుండదు. ఎన్నో వేడుకోళ్ల తర్వాత ఒప్పుకున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు బీపీ చెక్‌ చేయడం, మందులివ్వడం సహా ప్రతి చిన్న అవసరాన్నీ దగ్గరుండి చూసుకునే దాన్ని. బాగా మాట్లాడేవాడు. నేనూ నా కవితలు వినిపించేదాన్ని. పిల్లల భవిష్యత్‌ గురించి చర్చించుకునే వాళ్లం. త్వరలో కోలుకుంటాడనుకున్నా. ఓరోజు అకస్మాత్తుగా ‘నాకేమైనా అయితే నువ్వు నా బదులు సైన్యంలో చేరాలి’ అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. నీకేం కాదని భరోసానిచ్చా. అయినా ఆ బాధ్యత నావల్ల కాదన్నాను. ఆయన వినలేదు. నాలో స్ఫూర్తిని నింపడానికి తన అనుభవాలన్నీ చెప్పేవాడు. పరిస్థితి విషమించింది. దీపక్‌ మాకు దూరమయ్యాడు. బహుశా చనిపోతానని తనకు ముందే అర్థమైందేమో! అందుకే ఆ కోరిక కోరాడేమో అనిపిస్తుంది. తనతో కలిసి ఉన్న ఆ 40 రోజుల్లోనే విలువైన జీవితాన్ని అనుభవించా.

మూడుసార్లు ఓడినా.. భరించలేని బాధ, వేదనలను అనుభవిస్తున్నా. ఓరోజు ఒకామె సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు పరీక్ష గురించి చెప్పింది. దీపక్‌ చివరి మాటలు గుర్తొచ్చాయి. ఇద్దరు పిల్లలు, ఆర్మీకి వెళ్లడమెలా అని సందేహించా. అప్పుడు అమ్మ ‘నీ పిల్లలకు ఎదుటివారిని కాదు.. నిన్ను నువ్వే ఉదాహరణగా చూపించు. వాళ్లు నిన్ను చూసి గర్వపడేలా అవ్వు’ అని నాలో స్ఫూర్తిని నింపింది. ప్రవేశపరీక్ష రాశా. వరుసగా మూడు సార్లు ఫెయిల్‌ అయ్యా. మొదట నిరాశకు గురైనా.. పట్టుదల పెరిగింది. దీపక్‌ కల నెరవేర్చడమే లక్ష్యమనుకున్నా. పిల్లలిద్దరినీ అమ్మ వద్ద ఉంచా. ఏ పని చేస్తున్నా సన్నద్ధతపైనే దృష్టి. వార్తలన్నీ ఎక్కడున్నా వినిపించేలా స్పీకర్లు ఏర్పాటు చేసుకున్నా. శారీరక సామర్థ్యం పెంచుకోవడానికి రోజూ రన్నింగ్‌కు వెళ్లేదాన్ని. నాలుగోసారి 2020, ఆగస్టులో సాధించా. ఈ ఏడాది జనవరిలో చెన్నై ఓటీఏలో శిక్షణలో చేరా. అప్పటికి నాకు 33 ఏళ్లు. తోటివాళ్లంతా పాతికేళ్లలోపువారే. అయినా ఛాలెంజ్‌గా తీసుకుని, నన్ను నేను మలచుకున్నా. ఆంగ్లం ధారాళంగా మాట్లాడుతున్నా. పిల్లలను బాగా మిస్‌ అయ్యా. లెఫ్టెనెంట్‌ జ్యోతిగా నా పిల్లలకిప్పుడు నేనే స్ఫూర్తి. పాప మిలిటరీ డాక్టరు, బాబు నాలా ఆఫీసర్‌ అవుతారట. డిసెంబరు 11న అరుణాచల్‌ప్రదేశ్‌లో విధుల్లో చేరనున్నా. తన కోరిక నెరవేర్చినందుకు స్వర్గంలో ఉన్న దీపక్‌ నన్నిలా చూసి తప్పక సంతోషిస్తాడు కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్