వేదన నుంచి.. వెలిగిన చైతన్యం!

చెట్టంత కొడుకు కానరాని లోకాలకు వెళితే ఆ కన్నపేగు ఎంత తల్లడిల్లుతుంది?పంచప్రాణాలు అనుకున్నవాడే కనుమరుగయ్యాడంటే ఆ గర్భశోకాన్ని ఆపడం ఎవరితరం? దురదృష్టవశాత్తు అదే జరిగినా కుమిలిపోతూ...

Published : 29 Nov 2021 01:27 IST

చెట్టంత కొడుకు కానరాని లోకాలకు వెళితే ఆ కన్నపేగు ఎంత తల్లడిల్లుతుంది?పంచప్రాణాలు అనుకున్నవాడే కనుమరుగయ్యాడంటే ఆ గర్భశోకాన్ని ఆపడం ఎవరితరం? దురదృష్టవశాత్తు అదే జరిగినా కుమిలిపోతూ కూర్చోలేదు ఆ కన్నతల్లి. పుట్టెడు బాధని దిగమింగుతూనే.. తనలాంటి కడుపు కోత మరెవరికీ కలగొద్దని చేతల్లోకి దిగారు. కొడుకు పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి, రోడ్డు ప్రమాదాల నివారణకు శ్రమిస్తున్నారు.  ఈ సేవల కోసం తన జీవితాన్ని, యావదాస్తినీ కరిగిస్తున్న చిగురుపాటి విమలతో వసుంధర మాట కలిపింది.


ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట కీలకం. బాధితులను ఎవరైనా ఆసుపత్రికి తీసుకొస్తే డబ్బు కట్టనిదే వైద్యం చేయమంటున్నారు. ఇది మానవతా దృక్పథం లేకపోవడమే. మంచి పద్ధతి కూడా కాదు. ఆ సమయంలో నిర్లక్ష్యం చేస్తే పోయిన ప్రాణం తిరిగిరాదు. నాకు జరిగిన దురదృష్టకర సంఘటన ఏ తల్లికీ ఎదురు కాకూడదనే నా ప్రయత్నం. దీనికోసం మా ఫౌండేషన్‌ తరఫున అవగాహన కల్పిస్తూనే ఉంటాం. నా శక్తి ఉన్నంత వరకు సేవలను కొనసాగిస్తూనే ఉంటా.


కృష్ణాజిల్లా కంకిపాడుకి చెందిన విమల విద్యాసంస్థ నిర్వాహకురాలు. 2006 వరకూ సంతోషంగా ఉన్న ఆమె కుటుంబంలోకి విషాదం తొంగి చూసింది. బైక్‌పై వెళ్తుండగా, రోడ్డుప్రమాదానికి గురైన విమల ఒక్కగానొక్క కొడుకు సుధీక్షణ్‌ దుర్మరణం పాలయ్యాడు. సర్వస్వం అనుకున్న తన కొడుకు చనిపోవడంతో కొద్దిరోజులవరకు జీర్ణించుకోలేకపోయారామె. బాధ నుంచి తేరుకున్నాక తనలాంటి బాధితుల కన్నీళ్లు తుడవడానికి కొడుకు పేరుతో ‘సుధీక్షణ్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేశారు. తన ఆస్తి మొత్తాన్ని దీని కింద చేపట్టే సేవా కార్యక్రమాలకే వెచ్చించాలనే నిర్ణయానికొచ్చారు. కుమార్తె, అల్లుడు ముందునుంచీ సహకరిస్తుండగా.. సన్నిహితులు, ఇతరులు విరాళాలు అందించి అండగా నిలుస్తున్నారు.

అలుపెరగకుండా...

ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల కారణంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రోజుకి సగటున 40 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని వేదన మిగులుస్తున్న ఈ ప్రమాదాలను తన శక్తిమేర తగ్గించాలని భావించారు విమల. ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాలు నివారించేలా ప్రజల్లో.. ముఖ్యంగా యువతలో చైతన్యం కలిగేలా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కొనిచ్చిన ద్విచక్రవాహనాలు వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురై చాలామంది కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తారో విద్యార్థులకు తెలియజేసేలా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివి 300పైగా కార్యక్రమాలు నిర్వహించారీమె. సాధారణంగా హెల్మెట్‌ వాడకంతో ప్రమాదాల్లో క్షతగాత్రులకు గాయాల తీవ్రత తగ్గుతుంది. కొన్నిసార్లు ప్రాణాలు నిలుస్తాయి. దీంతో శిరస్త్రాణం తప్పనిసరి వాడకంపై కూడా ప్రచారం చేస్తున్నారు. హోంగార్డులు, విద్యార్థులకు ఏటా ఉచితంగా హెల్మెట్‌లు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం అధికారులు, నటులు, పోలీసులు, రవాణా, ట్రాఫిక్‌ సిబ్బంది, వైద్యులు, కళాశాలల సహకారం తీసుకుంటున్నారు విమల. సినీ నటులు చెబితే ఎక్కువ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదంలో తమ పిల్లల్ని కోల్పోయిన నటులు కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌లతో కూడా వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయించారు. దీంతోపాటు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేలా ఏటా లక్ష వరకు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ‘బాధ్యులు ఎవరు?’ పేరుతో పుస్తకాన్ని ముద్రించి రోడ్డు ప్రమాదాల కారకులు ఎవరు? బాధితులెవరో? ఆలోచించేలా కాలేజీ విద్యార్థులకు ఆ పుస్తకాన్ని పంచారు. రోడ్డు ప్రమాదాలలో వైకల్యం పొందినవారికి కృత్రిమ అవయవాలు ఉచితంగా అందిస్తున్నారు.

ఇతర సేవలు..

* పేద విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాల పంపిణీ. చదువుకోవటానికి ఆర్థికసాయం, ఉపకారవేతనాలు అందిస్తున్నారు.

* రక్తదాన, నేత్రదాన వైద్య శిబిరాలు నిర్వహించి 12వేల మందికి వైద్య పరీక్షలు చేయించారు. ఉచితంగా మందులు అందించారు.

* కరోనా సమయంలో వేలాది మందికి   నిత్యావసర సరుకులు అందజేశారు..

* వికలాంగులకు వీల్‌ఛైర్స్‌ అందించి ఆసరాగా నిలుస్తున్నారు.

* మురాల అనిల్‌కుమార్‌, కానూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్