Published : 02/12/2021 01:25 IST

పట్టాలేని లాయరమ్మ!

ప్రేమించి మోసపోయిన అమ్మాయిలను నేనున్నానంటూ చేరదీసి న్యాయం జరిగేలా చూస్తుంది. కనిపెంచిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టక వదిలేసిన బిడ్డలపై మాటల కొరడా ఝుళిపిస్తుంది. తాగొచ్చి భార్యల్ని హింసించే భర్తలను హెచ్చరిస్తుంది. బాల్యవివాహాలను అడ్డుకుంటుంది. చట్టప్రకారం వాటికి పడే శిక్షల్ని ఏకరువు పెడుతుంది. కొలిపాక నాగమణి ఇలాంటి ఎన్నో కేసులను పరిష్కరించింది. ఇంతకీ ఈ లాయరమ్మ చదివింది ఏడో తరగతే! ఆమె ప్రయాణం తన మాటల్లోనే..

మాది ఖమ్మం జిల్లా గువ్వలగూడెం. నేను, నా భర్త కృష్ణ వ్యవసాయ కూలీలం. ఆయనకు టీబీ సోకింది. అప్పటికి మాకు పాప పుట్టి 21 రోజులే. ఆయన పరిస్థితి చూసి, నా భవిష్యత్‌ ఏంటని భయమేసింది. నా పరిస్థితిని చూసి జాలేసి ఒకావిడ తన తోటలో కూరగాయలు అమ్ముకోనిచ్చింది. అలా కుటుంబాన్ని సాకుతూ వచ్చా. పట్టణం, ఆసుపత్రి వంటివి కూడా తెలియవు. ఆయన జబ్బు అన్నీ తెలుసుకునేలా చేసింది. 2002లో డ్వాక్రా సంఘంలో చేరా. లోను తీసుకుని సిమెంటు ఇటుకలు, రింగులు తయారు చేయడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. రెండేళ్లలో సహాయక సంఘం అధ్యక్షురాలినయ్యా. దీనిలో సభ్యులకు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చేవారు. అలా లా శిక్షణ తీసుకున్నా.

దీనిలో చట్టాలకు సంబంధించి ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. 2004లో నేలకొండపల్లి మండలంలో జెండర్‌ కమిటీలో పారా వాలంటీర్‌నయ్యా. ప్రారంభంలో మండలంలోని ఊర్లన్నీ తిరిగి అవగాహన కల్పించేవాళ్లం. ప్రతి సమస్యా కోర్టు వరకూ వెళ్లకముందే పరిష్కరించడం మా విధి. చిన్నవయసులో ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయిలు, చిన్న చిన్న తగాదాలకే విడిపోయే అన్నదమ్ములు, తాగొచ్చి భార్యలను హింసించే భర్తలు, కనిపెంచిన తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టలేక వీధిపాలు చేసే కొడుకులు.. ఇలాంటి కేసులన్నో మాదగ్గర పరిష్కరిస్తాం. ఇరువర్గాల వాదన విని ముందు కౌన్సెలింగ్‌ ఇస్తాం. తప్పు ఉన్నవాళ్లు ఎదుర్కొనే చట్టపరమైన శిక్షలు మొదలైనవన్నీ చెబుతాం. చాలావరకూ అక్కడే పరిష్కారమయ్యేలా చూస్తాం. కుదర్లేదు అనుకున్న వాటిని జడ్జి సమక్షంలోకి తీసుకెళతాం. 2017 తర్వాత కనీసం 10వ తరగతి ఉన్నవాళ్లనే తీసుకుంటామన్నారు. నేను చదివింది ఏడే. కానీ అప్పటి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నన్ను సిఫారసు చేయడంతో మళ్లీ శిక్షణ తర్వాత న్యాయసేవాధికార సంస్థలో అవకాశమిచ్చారు. పలు సందర్భాల్లో ఉత్తమ వాలంటీర్‌ అవార్డులందుకున్నా. 2019లో జాతీయస్థాయిలో అవార్డును దిల్లీలో తీసుకున్నా.

చాలామంది నాదో ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటారు. కానీ.. మాకంటూ ప్రత్యేక జీతాలూ ఉండవు. మొదట్లో ఏదైనా కేసు పరిష్కారమైతే రూ.10 ఇచ్చేవారు. తర్వాత అదీ లేదు. కుటుంబం నిలబడిన సంతోషంలో కొందరు తృణమో, పణమో బలవంతంగా చేతుల్లో పెడుతుంటారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించినపుడు మాత్రం చెల్లిస్తుంటారు. ఒక్కోసారి చాలా పేదవాళ్లు వస్తుంటారు. వాళ్లదగ్గర ఆటోకీ డబ్బులుండవు. నేనే ఎదురిస్తుంటాను. కొందరి కథలు విని ఏడ్చేస్తుంటా. వాళ్లకి ఎలాగైనా న్యాయం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తా. ఒక అమ్మాయి ప్రేమించినవాడి చేతిలో మోసపోయింది. అమ్మాయి తరఫు వాళ్లంతా బాగా చదువుకుని, ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లే. అయినా ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. అయిదు నెలల గర్భిణి. ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చివరి పరిష్కారంగా మా దగ్గరికొచ్చింది. అబ్బాయి వాళ్లింటికి వెళితే తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయిందా కుటుంబం. ఆ అమ్మాయి తరఫున ఇతర మహిళలతో కలిసి న్యాయపోరాటం చేశా. కొన్నిరోజులు మా ఇంట్లోనే ఆశ్రయమిచ్చా. చివరికి ఆ అబ్బాయిని పోలీస్‌ స్టేషన్‌కి రప్పించాం. కౌన్సెలింగ్‌ ఇచ్చాక పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లలతో హాయిగా ఉన్నారు. ఆస్తినంతా రాయించుకుని అమ్మనే ఇంట్లోంచి పంపేశాడొకతను. దిక్కుతోచని ఆమె మా దగ్గరికొచ్చింది. కొడుకుతో మాట్లాడి పూచీకత్తు రాయించుకుని మళ్లీ ఇంటికి చేర్చాం. విడాకులు తీసుకుంటామంటూ వచ్చే జంటలు.. ఇన్నేళ్లలో ఇలాంటివి వేల కేసులు. ఒక్కోసారి బెదిరింపులు, ఎదురు కేసులు పెట్టేవారు. ఎప్పుడూ భయపడలేదు. సమస్య పరిష్కారమయ్యాక వయసుతో సంబంధం లేకుండా కాళ్ల మీద పడుతుంటారు. కొందరు బంధువుల్లా వరుస పెట్టి పిలుస్తారు. వాళ్ల కళ్లలో ఆనందాన్ని చూసినప్పుడు కలిగే సంతృప్తి ముందు ఇవి పెద్దగా అనిపించవు. అందుకే జీతభత్యాలు లేకపోయినా చేస్తున్నా. సత్తువ ఉన్నంతవరకూ కొనసాగిస్తా.

- సీహెచ్‌ సూర్యకుమారి, బల్లేపల్లి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని