పట్టుపట్టారు... నాజూకయ్యారు
close
Updated : 03/12/2021 06:27 IST

పట్టుపట్టారు... నాజూకయ్యారు!

యుక్తవయసులో సన్నజాజి తీగల్లా మెరిసిపోతూ... అందంతో, నటనతో లక్షల మంది అభిమానాన్ని కొల్లగొట్టేశారు వీరిద్దరూ. వయసు పైబడింది... రకరకాల కారణాలతో బరువూ పెరిగి పోయారు. వాళ్లనలా చూడ్డానికి అలవాటు పడిపోయాం. ఇంతలో బరువు తగ్గామంటూ నెట్‌లో ఫొటోలు పెట్టి... అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రశంసలతో పాటు... ఆపరేషన్లు చేయించుకున్నారని కామెంట్లు పోటెత్తుతోంటే వాటిని కొట్టిపారేస్తూ... తమ రహస్యాలను బయటపెట్టారు. స్థూలకాయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న స్మృతి ఇరానీ, ఖుష్బూ సుందర్‌ ఏం చెబుతున్నారో చూడండి...

* ఫిట్‌నెస్‌ గోల్‌ ఎట్‌ 50... ఉత్తరాదికి చెందిన ఖుష్బూ తన అందం, నటనతో దక్షిణాదిన లక్షలాదిమంది అభిమానానికి పాత్రురాలయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటించారు. రాజకీయ రంగంలోకీ అడుగుపెట్టారు. బుల్లితెరపై ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఖుష్బూ అంటే ఆమె పేరున కట్టిన ఆలయం, తన పేరిట చేసే ఇడ్లీ గుర్తుకొస్తాయి. అలా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఈమె ముందు నుంచీ బొద్దుగానే ఉండేవారు. 40 ఏళ్లు దాటేసరికి అధిక బరువుకు చేరుకున్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి, సన్నబడ్డాను అంటూ ట్విటర్‌లో ఫొటోలు పొందుపరిచారు. తిరిగొచ్చిన తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘దీనికి ‘ఫిట్‌నెస్‌ గోల్స్‌ ఎట్‌ 50’ అని పేరు పెట్టుకున్నా. లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిందీ ఆలోచన. కష్టపడనిదే ఫలితం లేదని ముందే అనుకున్నా. రోజూ క్రమం తప్పక వర్కవుట్లు చేసేదాన్ని. ఒక్క రోజు కూడా జిమ్‌కు గైర్హాజరు కాలేదు. నిర్ణీత సమయాన్ని తప్పకుండా పాటించా. యోగాలో చక్రాసనాలు వంటివి చాలా బాగా ఉపయోగపడ్డాయి. లాక్‌డౌన్‌లో గిన్నెలు కడగడం సహా ప్రతి పనినీ స్వయంగా చేశా. ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించా. పోషకవిలువలు తగ్గకుండా, శరీరంలో నీటి శాతం పడిపోకుండా జాగ్రత్తపడ్డా. అలా.. తొమ్మిది వారాల్లో 15 కేజీల బరువు తగ్గగలిగా. ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నా’ అని చెబుతున్నారు ఖుష్బూ.

* నిత్యం వ్యాయామమే... బుల్లితెరపై పేరొందిన స్మృతిఇరానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. 45 ఏళ్లకే బరువు బాగా పెరిగిపోయిన ఈమె, ఇటీవల నాజూకు మల్లెతీగలా దర్శనమిచ్చారు. అప్పుడేం చెప్పలేదు కానీ... దీని కోసం తానేం చేసిందీ తాజాగా బయటపెట్టారు. ‘అధిక బరువును వదిలించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నా. వ్యాయామం, ఆహారంలో మార్పులు, యోగా... ఇవే నా రహస్యాలు. నిత్యం జిమ్‌లో చేసిన ప్రణాళికాబద్ధమైన వర్కవుట్లు తిరిగి సన్నగా అవ్వడానికి కారణమయ్యాయి. మొదట్లో బాగా కష్టమనిపించినా, తర్వాత అలవాటై సులువుగా చేసేదాన్ని. ఆహారంలోనూ మార్పులు చేసుకున్నా. పరిమాణాన్నేమీ తగ్గించలేదు. కాకపోతే పోషక విలువలకు ప్రాధాన్యమిచ్చా. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలను తప్పక ఉండేలా చూసుకున్నా. గింజ ధాన్యాలు, గ్లుటెన్‌, చక్కెర రహిత పదార్థాలు, పాల ఉత్పత్తులు తీసుకునేదాన్ని. చక్కెరకు బదులుగా తాజా పండ్ల నుంచి చేసే సిరప్స్‌ వాడా. ఒక్కరోజు కూడా వ్యాయామాన్ని మానలేదు. ఈ నియమాలతో పాటు, యోగా కూడా చాలా సహాయకారిగా నిలిచింది. ఇవన్నీ శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఆరోగ్యంగా మార్చేశాయి. అధిక బరువునీ దూరం చేశాయి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నా’ అంటున్నారు స్మృతి ఇరానీ.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని