Updated : 10/12/2021 05:36 IST

వయసు 75.. చుట్టిందేమో 66 దేశాలు!

ఒంటరిగా  ప్రయాణించడమంటే ఇప్పటికీ కంగారుపడే ఆడవాళ్లే ఎక్కువ. పాతికేళ్ల క్రితం.. అదీ విదేశాలకు అంటే.. పరిస్థితెలా ఉండుంటుందో ఊహించుకోండి. కానీ సుధా మహాలింగం పాతికేళ్లుగా ఒంటరిగానే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అదీ ఏ గైడ్‌ సాయమూ లేకుండా!

సుధకి చిన్నతనం నుంచీ భిన్న ప్రదేశాలను చుట్టెయ్యాలనే కోరిక. మ్యాగజీన్లు, పత్రికల్లో వచ్చే టూరిజం ఫొటోలు ఆమెను ఆకర్షించేవి. పెళ్లయ్యాక అవకాశమొచ్చింది. భర్తది సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగం. వృత్తిరీత్యా ఎన్నో ప్రదేశాలు తిరగాల్సి వచ్చింది. పెళ్లైన కొన్నేళ్లలోనే దేశంలోని 14 నగరాలు సహా పలు దేశాల్లోనూ నివసించారు. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, వింతలు ఆవిడను మరింత ఆకర్షించాయి. దీంతో ప్రపంచమంతా చుట్టెయ్యాలనే కోరిక బలపడింది. భర్తకేమో పర్యటనలపై అంతగా ఆసక్తిలేదు. ఏదైనా పనిమీద వెళ్లినా ఆయన తన పనిచూసుకుంటే ఈవిడ ఒక్కరే చుట్టుపక్కల ప్రాంతాలను చూడటం, సాహస క్రీడలను ప్రయత్నించడం చేసేవారు.

ఈవిడది చెన్నై. స్థిరపడిందేమో బెంగళూరు. భర్త పర్యటనల సమయంలో మాత్రం సెలవుపెట్టి కూడా వెళ్లేది. పిల్లల్ని బంధువుల సమక్షంలో వదిలేవారు. పర్యటనలకు భర్త, పిల్లలతో వెళ్లినా.. వాళ్లు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఓసారి అనుకోకుండా ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. ఇంకోసారి కాన్ఫరెన్స్‌లో భాగంగా.. ఇలా ఒక్కరే వెళ్లడం అలవాటైంది. మొదట్లో కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్థానిక గైడ్‌ సాయం తీసుకునేవారు. వాళ్లు కొన్ని ప్రదేశాలను మాత్రమే చూపిస్తుండటం, స్థానికాంశాలను ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉండకపోవడంతో తనేే ప్లాన్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకూ ఒంటరిగా 66 దేశాలు పర్యటించారు. ‘నేను మోయగలిగినంత సామాను మాత్రమే తీసుకెళతా. కొన్ని దుస్తులు, కెమెరా, ల్యాప్‌టాప్‌ మాత్రమే ఉంటాయి. స్థానికులతో మాట్లాడుతూ, వారు తినే ఆహారానికే ప్రాధాన్యమిస్తాను. అప్పుడే అక్కడికెళ్లిన భావన కలుగుతుంది’ అనే 70 ఏళ్ల సుధ శాకాహారి. ఏ సంస్కృతినైనా అర్థం చేసుకోవాలంటే భోజనమూ అందులో భాగమే కదా! అందుకే శాకాహారమైతే ఏ తీరులో వండినా తింటానంటారావిడ. తను వెళ్లిన ప్రదేశాల గురించి తన బ్లాగు ‘ఫుట్‌లూజ్‌ ఇండియన్‌’లో 400కుపైగా ట్రావెల్‌లాగ్స్‌ రాశారు. వెయ్యికిపైగా ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఎగ్జిబిషన్లలోనూ ప్రదర్శనకు ఉంచారు. తన అనుభవాల్ని పుస్తకాల రూపంలోనూ తీసుకొచ్చారు. ఈమెకు జంతువులు, అడవులు ముఖ్యంగా మానవ సంచారం తక్కువగా ఉండే ప్రదేశాలంటే ఎక్కువ ఇష్టమట. ట్రెకింగ్‌, రోడ్‌ ర్యాలీలను ఎక్కువ ఆస్వాదిస్తాననే ఈమె 18 దేశాల్లో రోడ్‌ ర్యాలీలను చేశారు. అమెజాన్‌ వంటి దట్టమైన అడవులున్న ప్రదేశాల్లో స్కైడైవింగ్‌ వంటివీ ప్రయత్నించారు. గతంలో ప్రొఫెసర్‌, జర్నలిస్ట్‌గానే కాకుండా ప్రభుత్వ విభాగంలోనూ పలు హోదాల్లో పనిచేశారీవిడ. ప్రధాని ఆధ్వర్యంలోని నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డులో సభ్యురాలిగానూ ఉన్నారు. ఉద్యోగాన్ని పక్కనపెట్టి ప్రపంచ పర్యటనలపై దృష్టిపెట్టిన ఈమె వీటిల్లో భాగంగా ఎన్నో ఇబ్బందుల్నీ ఎదుర్కొన్నారు. అయితే అవేమీ తనకు అడ్డంకి కావంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని