ఆమెకు ఆసరా... హమారా బచ్‌పన్‌

అమ్మాయిలు చదువులకు దూరమవుతుండటం.. కష్టాలను ఎదుర్కొంటుండటం చూసింది ధరిత్రీ పట్నాయక్‌. ఇలాంటి వారికి చేయూతను ఇవ్వాలనుకుంది. అలా ఆమె ప్రారంభించిన ‘హమారా బచ్‌పన్‌ ట్రస్టు’ ఈ రోజు వేలమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

Updated : 11 Dec 2021 05:51 IST

పేదరికం కారణంగా ఎంతోమంది అమ్మాయిలు చదువులకు దూరమవుతుండటం.. కష్టాలను ఎదుర్కొంటుండటం చూసింది ధరిత్రీ పట్నాయక్‌. ఇలాంటి వారికి చేయూతను ఇవ్వాలనుకుంది. అలా ఆమె ప్రారంభించిన ‘హమారా బచ్‌పన్‌ ట్రస్టు’ ఈ రోజు వేలమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
ఒడిశాలోని బంకీబహల్‌ గ్రామానికి చెందిన 15 ఏళ్ల మధుమితకి ఉన్నతవిద్యను అభ్యసించి, కెరియర్‌ నిర్మించుకోవడం లక్ష్యం. పదోతరగతి చదువుతున్న ఆమెకు గత ఏడాది చదువే ముగించే స్థితి వచ్చింది. ఇంట్లోవాళ్లు చదువు మాన్పించి ఆమెకు పెళ్లి చేస్తామన్నారు. అయితే మధుమిత అందుకు ఒప్పుకోలేదు. తన ఆశయాన్ని అమ్మానాన్నతో అర్థమయ్యేలా చెప్పింది. తిరిగి స్కూలుకు వెళ్లడం ప్రారంభించింది కూడా. మధుమితే కాదు, కొవిడ్‌ కారణంగా ఎందరో అమ్మాయిలు విద్యకు దూరమయ్యే పరిస్థితి. ఇలాంటి వారందరికీ ధైర్యాన్ని అందిస్తోంది ‘హమారా బచ్‌పన్‌ ట్రస్టు (హెచ్‌బీటీ)’. బాలికలకు భవిష్యత్తుపై భరోసా అందించేలా ఈ ట్రస్టు కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో తమ సమస్యను, ఆశయాన్ని చర్చించగలిగే ధైర్యాన్ని ఆడపిల్లలకు అందిస్తోంది.
మహిళా సాధికారత దిశగానూ ఈ ట్రస్ట్‌ కృషి చేస్తోంది. మహిళలకు పలురకాల జీవన నైపుణ్యాల్లో శిక్షణనిస్తోంది. దీంతో చాలామంది మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నారు. సుందర్‌గఢ్‌ జిల్లాలో దాదాపు 3,024 మంది మహిళలకు ఈ ట్రస్టు చేయూతగా నిలిచింది. ఆయా జిల్లాల యంత్రాంగం సహకారాన్ని అందుకుంటూ.. చదువుకు దూరమైన యుక్తవయసు అమ్మాయిలకు శిక్షణను ఇస్తోంది. గతేడాది అక్టోబరు నుంచి ఆరువేల మందికి పైగా వీరి వద్ద శిక్షణ పొందారు. వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్‌, ఆరోగ్యం, నెలసరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్ష్యాలు ఏర్పరుచుకోవడం, న్యాయకత్వ నైపుణ్యాలు, సమయపాలన, ఒత్తిడి వంటి వాటిపైనా తర్ఫీదునిస్తోంది.

పురోభివృద్ధి దిశగా...  
ఆర్థిక హక్కులు, పనిచేసే చోట లైంగిక హింస, చట్టపరమైన అంశాలపైనా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ‘కర్మాగారాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మహిళలు పనిచేసే చోట చాలా సమస్యలెదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించుకునే దిశగా పలు అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాపులు నిర్వహిస్తాం. అలాగే శిక్షణనందించి కొందరిని విజులెన్స్‌ కమిటీగా ఏర్పాటు చేసి, అయిదుగురు మహిళలు, ముగ్గురు బాలికలను లీడర్స్‌గా నియమిస్తాం. వీరంతా తమ ప్రాంతాల్లో లింగవివక్ష, లైంగిక హింస వంటి అంశాలను గుర్తించి, అక్కడి మహిళలు వాటినెలా ఎదురించాలో శిక్షణనిస్తారు. పేదకుటుంబాల మహిళలకు స్వయం ఉపాధిలో భాగంగా టైలరింగ్‌, కూరగాయలు, పుట్టగొడుగుల పెంపకం వంటివి నేర్పిస్తాం. 3000 మందికి పైగా మహిళలు ఇప్పుడు వ్యాపారులయ్యారు. ఎనిమిది గ్రామాల్లో ప్రతి దానిలో ఒక మహిళా బృందాన్ని నియమించాం. వీరంతా మహిళలకు పొదుపు, ఆర్థిక విధానాలపై శిక్షణనిస్తారు. తాగునీటి శుభ్రత, నెలసరిలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తారు. ఇవన్నీ మహిళా సాధికారతను సాధించేలా చేస్తున్నాయి. మరిన్ని పథకాల ద్వారా మహిళలను పురోభివృద్ధి దిశగా అడుగులేయించాలనేదే మా లక్ష్యం’ అని చెబుతోన్న భువనేశ్వర్‌కు చెందిన ధాత్రి పట్నాయక్‌ పిల్లలు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా గత ఏడాది సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌ నిర్వహించింది. దీనిలో ఫిక్కీ, ఎఫ్‌ఎల్‌ఓ కూడా భాగస్వామ్యమయ్యాయి. ఇందులో భాగంగా లక్షమందికిపైగా సంతకాలను సేకరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్