పేస్ట్రీ కల..కోట్ల వ్యాపారమైంది!

స్టార్‌ హోటల్‌లో చెఫ్‌ అవ్వడం కయినాజ్‌ కల. కష్టపడి సాధించింది కూడా! కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఓ ప్రమాదం దానికి అడ్డుగా నిలిచింది. తండ్రి వ్యాపార సలహానిచ్చాడు. తన ఇష్టాన్నే వ్యాపార మార్గంగా ఎంచుకోమని చెప్పి చెల్లెలు ఆమెకు ప్రోత్సాహంగా నిలిచింది

Updated : 11 Dec 2021 04:59 IST

స్టార్‌ హోటల్‌లో చెఫ్‌ అవ్వడం కయినాజ్‌ కల. కష్టపడి సాధించింది కూడా! కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఓ ప్రమాదం దానికి అడ్డుగా నిలిచింది. తండ్రి వ్యాపార సలహానిచ్చాడు. తన ఇష్టాన్నే వ్యాపార మార్గంగా ఎంచుకోమని చెప్పి చెల్లెలు ఆమెకు ప్రోత్సాహంగా నిలిచింది. అలా ఓ కేఫ్‌ రూపంలో ప్రారంభమైన థియోబ్రోమా.. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ కోట్ల వ్యాపారమైంది. ఆ కథేంటో చదివేద్దామా!

‘చెఫ్‌ కాదు.. పేస్ట్రీ చెఫ్‌ నా కల. మా చిన్నతనంలో అమ్మ బేకరీ నడిపేది. మా ఉదయాలన్నీ తీపి వాసనతోనే ప్రారంభమయ్యేవి. ఆ ఆసక్తితోనే హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశా. కానీ చెఫ్‌ అవ్వాలన్న కల బలపడింది మాత్రం ఫ్రాన్స్‌ వెళ్లాకే! స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా వెళ్లినపుడు అక్కడి పేస్ట్రీలపై మనసు పారేసుకున్నా. అప్పుడే స్టార్‌ హోటల్స్‌ చెఫ్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా’ అంటూ తన కల గురించి నెమరు వేసుకుంటుంది కయినాజ్‌ మెస్మన్‌.
ఈమెది ముంబయి. దిల్లీలోని ఒబెరాయ్‌ సెంటర్‌ ఆఫ్‌ లర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి కోర్సును పూర్తిచేసి ఉదయ్‌పుర్‌లోని ఒబెరాయ్‌ హోటల్‌లో పేస్ట్రీ చెఫ్‌గా చేరింది. ఎంతో పోటీ, శ్రమ తర్వాత ఈ స్థానం సాధించగలిగింది. కల నెరవేరిన ఆనందంలో ఉత్సాహంగా పనిచేసేది. బేకింగ్‌లో ప్రయోగాలు చేసేది. ఎంతోమంది ప్రముఖుల మన్ననలను అందుకుంది. అంతా సజావుగా సాగితే జీవితం కాదు కదా! ‘అది 2003.. కిచెన్‌లో ఒకటే హడావుడి. చూసుకోకుండా జారిపడ్డా. వీపుకి ఏదో బలంగా తగిలింది. భరించలేని నొప్పి. మందులు, కొద్దిరోజుల విశ్రాంతితో కోలుకుంటాననుకున్నా. కానీ నిలడటమే కష్టమైంది. ఓరోజు ఏకంగా కూలబడిపోయా. తరచూ బరువులు మోయడం, దీనికితోడు దెబ్బ.. వెన్నెముకపై ప్రభావం పడిందన్నారు. గంటలపాటు నిల్చొని చేస్తే నడకకే ఇబ్బంది అన్నారు. బదులుగా వేరే వృత్తి ఎంచుకోమన్నారు. నా కలలన్నీ కూలిపోయాయి. అప్పటికి నా వయసు 23 ఏళ్లే’. అంటూ ఆరోజుల్ని గుర్తు చేసుకుంటుంది కయినాజ్‌.

ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే తను ముభావంగా అయిపోవడం చూడలేకపోయారు ఇంట్లోవాళ్లు. దీంతో తండ్రి ఏదైనా వ్యాపారం చేసుకోమన్నాడు. పెట్టుబడి ఆయనే చూసుకుంటానన్నాడు. ‘విన్నా కానీ.. నాకేం పాలుపోలేదు. అప్పుడు నా చెల్లెలు టీనా ‘పోనీ నీకు నచ్చిన పేస్ట్రీ బిజినెస్‌నే చేద్దామా!’ అంది. విని ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. ఆనందంగా సరేనన్నా. తిరిగి లేచేసరికి నాన్న, టీనా.. పెట్టుబడి లెక్కల నుంచి మార్కెటింగ్‌ సహా అంతా ప్లాన్‌ చేశారు. టీనా చార్టర్డ్‌ అకౌంటెంట్‌. అలా ఓ హాస్పిటల్‌ గదిలో ‘థియోబ్రోమా’ పురుడు పోసుకుంది’ అని నవ్వేస్తుంది కయినాజ్‌.

2004 ముంబయిలో ఓ చిన్న కాఫీ కమ్‌ పేస్ట్రీ షాపుగా థియోబ్రోమా ప్రారంభమైంది. ఎన్నో ఒడిదొడుకులు, నష్టాలను చూశారు. అయినా ఈ అక్కాచెల్లెళ్లు ఎక్కడా వెనకడుగు వేయలేదు. తప్పుల నుంచే నేర్చుకుంటూ వ్యాపారాన్ని చక్కదిద్దుకున్నారు. ఫలితమే ముంబయి సహా అనేక ప్రధాన నగరాల్లో దాదాపు 100 అవుట్‌లెట్లు. ‘గ్రీకు భాషలో థియోబ్రోమా అంటే దేవుళ్లకి అందించే ఆహారమని అర్థం. ఈ పేరు సూచించిందీ టీనానే. కిచెన్‌లో ఉండే అవకాశమొస్తోందని మాత్రమే ఆలోచించా. పేరు నుంచి అకౌంట్స్‌, మార్కెటింగ్‌ అన్నీ తనే చూసుకుంది. కొత్తల్లో ఎన్నో తప్పటడుగులు వేశాం. మాకు నచ్చిన వాటితో మెనూ తయారు చేశాం. తర్వాత కస్టమర్ల అభిరుచులను బట్టి మార్పులు చేసుకుంటూ వచ్చాం. నష్టాలు ఎదురైనా నాన్న మమ్మల్ని ప్రోత్సహించారు. పెళ్లయ్యాక నా భర్త తోడున్నారు. మొదట్నుంచీ మా లక్ష్యం థియోబ్రోమాని పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దడం కాదు. మంచి రుచుల్ని అందించడమే. అందుకే పోటీ ఎదురైనా కంగారు పడలేదు. ఈ ఏడాది మా వ్యాపారం రూ. 121 కోట్లు. టీనాకి లండన్‌లో ఫైనాన్స్‌ సంస్థ ఉంది. తినుబండారాలు, కేఫ్‌ ఇంటీరియర్‌ మొదలైనవి నేను చూసుకుంటా. అకౌంట్స్‌ తను చూసుకుంటుంది. ఆలోచనేదైనా ఇద్దరం సరే అనుకున్నాకే అమలు చేస్తాం’ అనే కయినాజ్‌ కల ఏదైనా ఫలితాన్ని ముందే ఊహించుకొని ప్రారంభించొద్దంటుంది. అప్పుడే విజయం సాధ్యమంటుంది. ఈ సీఈఓ ‘బేకింగ్‌ ఎ డ్రీమ్‌’ పేరుతో పుస్తకాన్నీ రచించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్