అరటి పిండితో ఆరోగ్యం... ఉపాధి
close
Updated : 14/12/2021 05:44 IST

అరటి పిండితో ఆరోగ్యం... ఉపాధి!

అరటిపండ్లు ఈ రోజు తెస్తే... సాయంత్రానికే ముగ్గి పోతాయి. తినకపోతే ఇక పారేయాల్సిందే! మరి అరటిరైతుల మాటేంటి? డిమాండ్‌ లేని రోజుల్లో పంటని అయినకాడికి అమ్ముకోవడమో... లేదంటే మనలా పారేయడమో చేయాల్సిందేనా? ఈ ఆలోచనతోనే వృథాని అరికట్టి.. ఉపాధి పొందే మార్గాన్ని కనిపెట్టారు కర్ణాటక మహిళలు..

మిళనాట ప్రతి ఇంటి పెరట్లో ఓ మునగ చెట్టు ఉన్నట్టుగానే... కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో అరటి చెట్లని ఎక్కువగా పెంచుతారు. కానీ అరటి పండ్ల విషయంలో తినేది తక్కువ పారేసేది ఎక్కువ అని అక్కడి గృహిణులు గ్రహించారు. దీనికి పరిష్కారంగా వాళ్లు తయారు చేసిందే అరటిపిండి. ఇప్పుడీ పిండికి ఆన్‌లైన్‌లో కూడా గిరాకీ పెరగడంతో చాలామంది గృహిణులు దీన్నో ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. పోషకాలు పుష్కలంగా ఉండటం మైదాకు చక్కని ప్రత్యామ్నాయంగా మారడంతో.. చాలామంది ఈ పిండిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనదేశంలో ఏటా లక్షల టన్నుల అరటిని పండిస్తున్నారు. కానీ ఈ పంటని ఎక్కువ కాలం నిల్వ చేసే వీలులేక.. చాలామటుకు వృథా అయిపోతోంది. అందుకే రైతులు డిమాండ్‌ లేని రోజుల్లో వీటిని అయినకాడికి అమ్ముతుంటారు. ‘మేం తయారు చేస్తున్న అరటిపిండి అటు రైతులకీ.. ఇటు మహిళలకు చక్కని ఉపాధిగా మారింది’ అంటోంది గత ఏడాది జులై నుంచి ఈ పిండి తయారీని చేపట్టిన వసుంధర హెగ్డే. ‘బరువు తగ్గాలనుకొనేవారు చాలామంది ఆన్‌లైన్‌లో ఈ పిండిని కొనుగోలు చేస్తున్నారు. గడిచిన నెలలో వంద కేజీల పిండిని అమ్మాం. చిన్నమొత్తాల్లో ఈ పిండిని ప్రస్తుతం ఇంట్లోనే తయారుచేస్తున్నాం. అరటి కాయలు నల్లగా అవ్వకుండా ఉండేందుకు మజ్జిగలో కానీ, బియ్యం కడిగిన నీళ్లలో కానీ నానబెడతాం. తర్వాత చిప్స్‌లా తరిగి మూడురోజులు ఎండబెట్టి, మరపట్టిస్తే పిండి సిద్ధం’ అంటున్నారు మరో గ్రామీణ వ్యాపారవేత్త జయాంబిక. కర్ణాటక రైతులకు అండగా ఉండేందుకు ‘అధికె’ పత్రిక ఈ పిండి తయారీని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తోంది. దాంతో ఇప్పుడు వందల మంది మహిళలు దీన్నో ఉపాధి మార్గంగా చేపట్టారు. ముఖ్యంగా పీచు ఏమాత్రం లేని మైదాకు ఈ పిండి ప్రత్యామ్నాయంగా ఉండటంతో... గులాబ్‌ జామూన్లు, ఇడ్లీ, దోసె, పరాటా, నిప్పట్లు, హల్వా, మాల్ట్‌, నూడుల్స్‌, కేసరిబాత్‌ వంటి వాటిని సులభంగా చేస్తున్నారు.  కేరళలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ తాజాగా బనానా గ్రిట్‌ పేరుతో అరటి రవ్వని విడుదల చేసింది. దీంతో పలు వంటకాలు చేసుకోవచ్చని ఆస్తమా, బీపీ, షుగర్‌ వంటి వాటిని అదుపు చేస్తుందని కేరళ శాస్త్రవేత్తలు అంటున్నారు. చూశారా మన వాళ్ల ఓ చిన్న ఆలోచన ఎలాంటి సత్ఫలితాలను ఇస్తోందో!


Advertisement

మరిన్ని