Updated : 16/12/2021 05:08 IST

తనలానే అందరూ గెలవాలని!

ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండటం ఆమె తత్వం. చిన్న అనారోగ్యమూ ఎరగని ఆమెకు క్యాన్సర్‌ అని తేలింది. ఇంట్లోవాళ్లందరూ భయపడినా.. తను మాత్రం దానికి తలవొంచద్దనుకుంది. ఆంచల్‌ శర్మ.. ఆ తీరుతో దాన్ని ఓడించడమే కాకుండా ఇప్పుడు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.

ఆంచల్‌ది దిల్లీ. అది 2017.. తమ్ముడి పెళ్లి సంబరాల్లో మునిగిపోయిందామె. ఒక్కసారిగా చేయి నొప్పి. పెళ్లి పనులు కారణమనుకుంది. చేయి వాపుతోపాటు భరించలేని నొప్పితో స్పృహ కోల్పోయేది. సందడి ముగిశాక హాస్పిటల్‌కి వెళదామనుకుంది. కానీ కళ్లు తిరిగి కిందపడటం ఎక్కువైంది. దీంతో వెళ్లక తప్పలేదు. పెళ్లి ఆనందంలో ఉన్నామెకు రొమ్ము క్యాన్సర్‌ అన్న కబురందింది. ఒక్కసారిగా షాక్‌. కుటుంబం కంగారుపడితే.. విన్న వాళ్లంతా ఇక చనిపోయినట్లే అన్నట్టుగా మాట్లాడారు. ఆంచల్‌ మాత్రం ధైర్యంగా ఎదుర్కోవాలనుకుంది. అన్ని జబ్బుల్లానే దీన్నీ తీసుకోవాలనుకుంది. నవ్వుతూ ఆసుపత్రిలో అడుగుపెట్టేది. కీమోథెరపీ సమయంలోనూ జోకులు వేస్తూ అందర్నీ నవ్విస్తూ ఉండేది. తోటి క్యాన్సర్‌ రోగులతో సరదాగా మాట్లాడేది, వాళ్ల భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసేది. అందం, దుస్తుల విషయంలోనూ దృష్టిపెట్టేది. సర్జరీలు, ఆపై ఇన్ఫెక్షన్లు.. ఎన్నోసార్లు చావు అంచుల వరకూ వెళ్లొచ్చినా ఆమెది ఇదే తీరు. డాక్టర్లు కూడా ఆమె ధైర్యానికీ, తేలికగా తీసుకునే తత్వానికీ ఆశ్చర్యపోయేవారు. చివరకు తన సానుకూల దృక్పథంతో క్యాన్సర్‌ బారి నుంచి బయటపడింది.

తర్వాతేంటి? ఇదే ప్రశ్న వేసుకుంది ఆంచల్‌. తన అనుభవంతో కొందరికైనా సాయం చేయాలనుకుంది. తను చికిత్స తీసుకుంటున్నప్పుడు తోటివాళ్ల నుంచి అందుకున్న అభినందనలు ప్రోత్సాహంలా పనిచేశాయి. వీటితోపాటు క్యాన్సర్‌ వచ్చిన వాళ్లకి రూపురేఖల్లో వచ్చే మార్పులు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి వాళ్లకు తోడ్పడేలా స్టైలిష్‌ డ్రెస్‌లు, క్రీమ్‌లు ఇతర ప్రొడక్ట్స్‌ తయారు చేసేది. వీటన్నింటితో ‘క్యాన్‌హీల్‌’ ప్రారంభించింది. క్యాన్సర్‌ బాధితుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్గానిక్‌ వస్తువులతో చేసిన బ్యూటీ ఆహార ఉత్పత్తులను అందిస్తోంది. ఇదే పేరుతో ఒక కమ్యూనిటీనీ నిర్వహిస్తోంది. దీనిలో బాధితులు తమ సమస్యలను తోటివారు, నిపుణులతో చర్చించొచ్చు.

‘భయంతో ఓటమిని అంగీకరించడం, ధైర్యంగా పోరాడటం.. ఈ రెండింట్లో నేను రెండోది ఎంచుకున్నా. అందుకే క్యాన్సర్‌ను గెలవగలిగా. నా అనుభవంతో ఇంకొంతమందిని వెలుగు దిశగా నడిపించాలన్నది ఆశ. అందుకే క్యాన్‌హీల్‌ ప్రారంభించా. దీన్ని లాభం కోసమో, వ్యాపారం కోసమో మొదటుపెట్టలేదు. కాబట్టి, తక్కువ ధరలకే అందిస్తున్నా. వీటితోపాటు వీలున్నప్పుడల్లా దిల్లీ ఆసుపత్రుల్లో బాధితులతో మాట్లాడి ధైర్యం నింపుతుంటా. నిపుణుల వివరాలను వారికి అందిస్తుంటా’ అంటోంది 37 ఏళ్ల ఆంచల్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని