Updated : 17/12/2021 05:20 IST

గ్రామీణ వ్యాపారవేత్తలని తయారుచేస్తున్నా!

ఐటీ సంస్థలో పని చేసిన అనుభవాన్ని గ్రామీణ ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు బెంగళూరుకు చెందిన సుధా శ్రీనివాసన్‌. ‘ది నడ్జ్‌ ఫౌండేషన్‌’ స్థాపించి గ్రామీణ వ్యాపారవేత్తలని తయారు చేస్తున్నారామె... 

టీ రంగంలో 17 ఏళ్ల అనుభవం సుధా శ్రీనివాసన్‌ది. 12ఏళ్లు ఇంటెల్‌ సంస్థలో విధులు నిర్వహించారామె. గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, పోషకాహారలేమి... నిరుద్యోగం వంటి సమస్యలు చూశాక పరిష్కారం కోసం వెతికారామె. వారికి విరాళాలు అందించడం, చేయూతగా నిలవడం వంటి వాటితో ఆపేయకుండా నైపుణ్యాలు పెంచాలనుకున్నారు. అలా 2016లో బెంగళూరులో అతుల్‌ సాతిజాతో కలిసి ‘ది నడ్జ్‌ ఫౌండేషన్‌ (సీఎస్‌ఐ)’ను ప్రారంభించారు. ‘గ్రామాల్లో సృజనాత్మకత, ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల నగదును మంజూరుయ్యేలా చూశాం. ఇలా రుణం మంజూరైన వారికి పలు కార్పొరేట్‌, ప్రభుత్వ సంస్థల నుంచి మెంటర్స్‌ను ఏర్పాటు చేస్తాం. వీరంతా ఉచితంగానే తమ ఆలోచనలను అందించి గ్రామీణ అభ్యర్థులు నెట్‌వర్క్‌ను బిల్డ్‌ చేసుకోవడానికి సహకరిస్తారు. అలా మేం ప్రాథమిక దశలో 75 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయగలిగాం. సాంకేతికత సహకారాన్ని వాడుకుంటూ... వాణిజ్య రంగంలో వీరికెదురయ్యే సమస్యలను పరిష్కరిస్తున్నాం. మావద్దకు వచ్చే స్టార్టప్స్‌లో సామాజిక ప్రయోజనం అందించే వాటిని ఎంపిక చేసి ఆర్థిక చేయూతనిస్తాం. ఇందుకోసం మొత్తం 12 ఆర్గనైజేషన్స్‌ పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం రూ.55 కోట్లు నిధులు అందించడానికి మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ‘ఎఫ్‌ఐ’22 అనే ప్రాజెక్టుకు గాను సీఎస్‌ఐ రూ.22 కోట్లు బడ్జెట్‌ అందించింది. మా ప్రాజెక్టులన్నీ... గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం, భూహక్కులు, లింగవివక్ష, నైపుణ్యాల అభివృద్ధి, స్థానిక పాలన వంటి సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తున్నవే. గ్రామాల్లో ప్రతి గడపనూ పలకరిస్తాం. వారిలోని నైపుణ్యాలను గుర్తించి దానికి తగినట్లుగా శిక్షణ, అవగాహన ఇప్పించి ఆ రంగంలో వారిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మా లక్ష్యం ఒక్కటే. పేదరికం అనే పదం ఉండకూడదు. సాంకేతికత, విద్యతోపాటు పోషకాహారలోపంపై అవగాహన, పౌష్టికాహారం తీసుకునేలా చేయడం, వారి హక్కుల గురించి చెప్పడం వంటివి కూడా మా ప్రాజెక్టులో భాగమే. ఒక్కొక్క ఆర్గనైజేషన్‌ ఒక్కో అంశంలో ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కర్నాటక సహా మహారాష్ట్ర, రాజస్థాన్‌, తెలంగాణ, జార్ఖండ్‌ తదితర ప్రాంతాల్లోనూ కృషి చేస్తున్నాం. తెలంగాణలో ‘మూవింగ్‌ ఉమెన్‌’ స్టార్టప్‌ ద్వారా మహిళలకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు నడపడంలో శిక్షణ, మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. వెనుకబడిన ప్రాంతాల్లో స్త్రీలు గర్భం దాల్చినప్పటి నుంచీ ప్రసవం అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుల సంరక్షణ, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ వంటి పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం’ అని చెబుతున్న సుధా శ్రీనివాసన్‌ లక్ష్యం రానున్న నాలుగేళ్లలో కోటిమందిని పేదరికానికి దూరం చేయడమే.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని