Updated : 20/12/2021 04:15 IST

టైం ముఖచిత్రమయ్యారు!

ఇప్పుడు ప్రపంచంలో ఎవరి నోట విన్నా కరోనా మాటే. మహమ్మారిగా మారి మానవాళిని కబళిస్తున్న కరోనాపై పోరాటంలో ఆ ఇద్దరి ప్రతిభా అసమాన్యం. ఒకరు టీకా రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తే.. మరొకరు దాని నిర్మాణంపై అధ్యయనం చేశారు. కోట్ల మంది ప్రాణాలు కాపాడటంలో అసమాన పాత్ర పోషించినందుకు గాను ప్రఖ్యాత టైమ్స్‌ మాగజైన్‌ వారిని కొనియాడింది. అద్భుత ఆవిష్కర్తలుగా పేర్కొంటూ కవర్‌పేజీపై చోటు కల్పించింది.

అమెరికాలోని నార్త్‌ కరోలినా కిజ్‌ మిక్‌యా స్వస్థలం. ఆఫ్రికా నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డ కుటుంబంలో పుట్టిన ఆమె చిన్ననాటి నుంచే చదువులో ముందుండే వారు. 30 ఏళ్ల ఉపాధ్యాయ జీవితంలో తాను చూసిన అత్యున్నత విద్యార్థి కిజ్‌మిక్‌యా అని ఉపాధ్యాయురాలు చెప్పారంటే తనెంత చురుకైన విద్యార్థో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా విద్యాభ్యాసం పూర్తి చేశారు. నార్త్‌ కరోలినా యూనివర్సిటీలో రోగ నిరోధకత, మైక్రోబయాలజీల్లో పీహెచ్‌డీ అందుకున్నారు. దీని కోసం ఆరు సంవత్సరాలు శ్రీలంకలో ఉండి.. డెంగ్యూ బాధితుల్లో రోగనిరోధకత, యాంటీబాడీల పని తీరు తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేశారు. కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ తయారు చేయాల్సి వచ్చినప్పుడు ప్రపంచంలో ఆశాజ్యోతులుగా నిలిచిన అతికొద్ది మంది వైరాలజిస్టుల్లో కిజ్‌మిక్‌యా ఒకరు. మోడెర్నా కంపెనీ భాగస్వామ్యంతో టెక్సాస్‌ యూనివర్సిటీ వైద్య నిపుణులతో ఏర్పాటైన బృందానికి ఆమె నాయకత్వం వహించారు. వైరస్‌ నిర్మాణాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసి 66 రోజుల్లో మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేశారు. అతి తక్కువ సమయంలో అన్ని పరీక్షలనూ ఎదుర్కొని వీరి ‘మోడెర్నా ఎమ్‌ఆర్‌ఎన్‌ఎ’ టీకా మార్కెట్‌లోకి వచ్చింది. ఈ శతాబ్దంలో వచ్చిన అతిపెద్ద విపత్తు నుంచి మానవాళిని కాపాడిన వ్యక్తుల్లో కిజ్‌మిక్‌యా ముందువరుసలో ఉంటారని అంతర్జాతీయ అంటువ్యాధుల నిపుణుడు ఫౌజీ ఆమె గురించి ప్రశంసిస్తూ రాశారు.


పేదరికాన్ని దాటి...

* కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యుమార్పిడిపై ఆమె చేసిన పరిశోధనలే నేడు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయి. ఆమే హంగరీకి చెందిన కేథలిన్‌ కర్లికో. పేదకుటుంబంలో జన్మించినా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా ఆమె వెరువలేదు. చిన్ననాటి నుంచి సైన్సుపై ప్రేమ పెంచుకొని ప్రపంచ ప్రఖ్యాత బయోకెమిస్ట్‌గా ఎదిగారు. ఈ క్రమంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. పీహెచ్‌డీ అనంతరం హంగేరీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో కెమిస్ట్రీ, బయోలాజికల్‌ రిసెర్చ్‌ సెంటర్లలో పరిశోధనలు మొదలు పెట్టారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవి ముందుకు సాగలేదు. దీంతో రెండేళ్ల కుమార్తె, భర్తతో కలిసి అమెరికా వలసవెళ్లారు. అక్కడ వైరస్‌ల నిర్మాణంపై అధ్యయనం చేసి నాన్‌ఇమ్యునోజెనిక్‌, న్యూక్లియోసైడ్‌ మాడిఫైడ్‌ ఆర్‌ఎన్‌ఏలకు  పేటెంట్లు సొంతం చేసుకున్నారు. ఈ పరిజ్ఞానం కరోనా టీకా రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడింది. బయోఫార్మాటికల్‌ న్యూ టెక్నాలజీ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమె.. ఆ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. పరిశోధనల్లో తన సేవలకు గాను అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు.Advertisement

మరిన్ని