Updated : 22/12/2021 04:53 IST

వ్యాపార విజయం ‘పట్టు’బడింది!

చిన్న వయసులోనే పెళ్లి... ఆ వెంటనే కుటుంబ సమస్యలు... భర్త కొత్త మార్గంలో వెళతానంటే తోడు నిలిచింది. కొంత నిలదొక్కుకున్నాక సొంత వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడది మూడు కోట్ల వార్షిక టర్నోవర్‌ను సాధించడంతోపాటు ఎంతోమందికి ఉపాధినీ ఇస్తోంది. పట్టు పరిశ్రమను స్థాపించి, ఒడుదొడుకులను దాటుకొని సాగుతోన్న గంజి అరుణ విజయగాథ ఆమె మాటల్లోనే...

మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌. 2003లో డిగ్రీ రెండో ఏట పెళ్లైంది. మావారు శ్రీహరి. నలుగురబ్బాయిల్లో ఆయనే చిన్న. పెళ్లయిన కొద్దిరోజులకే మా మామయ్య చనిపోయారు. దీంతో అందరూ వేరు కాపురాలు పెట్టారు. మా మామగారికి 40కిపైగా పట్టు మగ్గాలుండేవి. వాటికి పెద్ద మొత్తంలో పట్టుదారం అవసరమయ్యేది. దాన్ని బెంగళూరు నుంచి తెచ్చే వారు. మిగిలింది అమ్మేవారు. ఒక్కోసారి గిరాకీ తగ్గి నష్టపోయే వాళ్లు. మావారికి నేతపై ఆసక్తి లేదు. పట్టుదారం సొంతంగా తయారుచేస్తే బాగుంటుందనుకున్నారు. అప్పటికి జనగామలో మినహా తెలంగాణలో ఎక్కడా పట్టుదారాలు తీసే పరిశ్రమల్లేవు. ఆయన మూడు నెలలు బెంగళూరు, జనగామల్లో అధ్యయనం చేసి వచ్చారు. కానీ మా చేతిలో డబ్బు లేదు. రూ.3 లక్షలకు పైగా అప్పు చేసి ఇంట్లోనే చిన్నగా ప్రారంభించాం.

ముడిసరకును బెంగళూరు నుంచి తెచ్చి రోజుకు 2-3 కేజీల పట్టుదారం తీసేవాళ్లం. దగ్గర్లో ఉండటం, దీంతోపాటు నాణ్యమైన దాన్ని సరసమైన ధరకే ఇస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లంతా మా దగ్గరికే వచ్చేవాళ్లు. అలా వ్యాపారం క్రమంగా పెంచుకుంటూ వెళ్లాం. 2009లో ఓ సంస్థను లీజ్‌ తీసుకున్నాం. మగ్గాల వాళ్ల నుంచి చీరలు కొని మార్కెట్‌లో అమ్మేవాళ్లం. ఇన్నేళ్ల అనుభవంతో నాకూ సొంతంగా వ్యాపారం చేయాలనిపించింది. అయిదేళ్ల క్రితం ఎకరంన్నర పొలం కొని బిల్డింగ్‌ నిర్మించి ‘కృష్ణ రీలింగ్‌ అండ్‌ ట్విస్టింగ్‌ యూనిట్‌’ సంస్థను ప్రారంభించా. రోజుకు 100 కేజీల వరకూ పట్టుదారం వస్తోంది. 80 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఎక్కువమంది ఆడవాళ్లే. ఇతర రాష్ట్రాల వాళ్లకి క్వార్టర్స్‌, రోజూ వచ్చి వెళ్లేవారికి ఉచిత ట్రాన్స్‌పోర్ట్‌ కల్పిస్తున్నా. కొత్తవాళ్లకు సగం జీతంతో శిక్షణనిచ్చి పనిలోకి తీసుకుంటాం. నాలుగేళ్లుగా పట్టుపురుగుల నుంచి నేరుగా దారం తీస్తున్నాం. పరిశ్రమను మరింత విస్తరించనున్నా.

ఇప్పుడు మా టర్నోవర్‌ ఏడాదికి రూ.మూడు కోట్లు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు చూశా. అప్పుతోనే వ్యాపారం మొదలైంది. పైగా కొత్త దారి. ఇక్కత్‌ ఆరు నెలలే నడిచేది. పెళ్లిళ్లు, దసరా సమయాల్లోనే కొనుగోళ్లు. కొన్నిసార్లు నమ్మి దారమిస్తే.. కొందరు డబ్బులు ఇచ్చేవారు కాదు. కరోనా సమయంలో మగ్గాలు నడిచిందీ తక్కువే. అప్పుడు దారమంతా పక్కకు పెట్టాల్సి వచ్చింది. కొందరు ఏకంగా వృత్తినే వదిలేశారు. ఇలానూ నష్టపోయాం. అయినా నిరూపించుకోవాలి, ఎలాగైనా నిలదొక్కుకోవాలన్న పంతంతో ముందుకు వెళ్లాం. బ్యాంకు లోనుతో వ్యాపారాన్ని నడిపించాం. కానీ నాణ్యత విషయంలో రాజీపడలేదు. దీంతో బ్యాంకులు సబ్సిడీ ఇచ్చేవి. ఇప్పుడు తెప్పిస్తోన్న మెషినరీకీ సెరికల్చర్‌ శాఖ రాయితీ ఇచ్చింది. పోచంపల్లి, చౌటుప్పల్‌ చేనేత సహకార సంఘాలు, వీవర్లు.. ఎల్లంకి, భువనగిరి, నల్లగొండ ప్రాంతాల వాళ్లతోపాటు చీరాల, గద్వాల నుంచీ ఆర్డర్లు వస్తుంటాయి. మాకిద్దరు పిల్లలు. అమ్మాయి సీనియర్‌ ఇంటర్‌, బాబు ఎనిమిదో తరగతి. ప్రాణం పెడుతున్న పని కాబట్టి ఇల్లూ, పరిశ్రమా రెంటినీ సమర్థించుకోవడం ఇబ్బందిగా అనిపించదు. దేన్నైనా ఎంచుకున్నప్పుడు మొదట్లో కష్టాలొస్తాయి. తట్టుకుని, తప్పుల్ని మళ్లీ చేయకుండా, నేర్చుకుంటూ ఓర్పుగా సాగాలి. అప్పుడే విజయం సాధించగలం. మా పిల్లలకూ అదే చెబుతుంటాను.

- రాజేశ్‌ మురుముర్ల, ఈనాడు పాత్రికేయ పాఠశాల


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని