Published : 24/12/2021 00:57 IST

విశ్వవేదికపై భారతీయ సౌందర్యం!

విశ్వ సుందరి కిరీటం మన అమ్మాయి హర్నాజ్‌ సంధు సాధించినప్పుడు దేశమంతా గర్వంతో ఉప్పొంగి పోయింది. ఆమెలాగే మరో ఇద్దరూ తమ ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి, దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఐశ్వర్య జయచంద్రన్‌ మిసెస్‌ ఇండియా కిరీటం గెలుచుకొని ప్రపంచ పొటీలకు సిద్ధమవుతోంది. రాధికా రానే మిసెస్‌ ఆసియా యూఎస్‌ఏ పోటీల్లో రన్నరప్‌గా గెలిచింది.


కలల్ని ఛేదించండి: ఐశ్వర్య జయచంద్రన్‌

శ్వర్యది కేరళ. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు సరదాగా మోడలింగ్‌ ప్రారంభించింది. అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ కన్యాకుమారి టైటిల్‌ను గెల్చుకుంది. అది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కానీ ఇంట్లో మోడలింగ్‌ చేయడాన్ని ఇష్టపడలేదు. తర్వాత ఆర్‌జేగా కెరియర్‌ ప్రారంభించింది. ఇక్కడా అదే పరిస్థితి. ఇదో ఉద్యోగమే కాదని వాళ్ల భావన. కానీ అది ఆమెకు ఆసక్తి ఉన్న రంగమని వివరించడంతో నెమ్మదిగా ఒప్పుకొన్నారు. పెళ్లయ్యాక ఆమె కుటుంబం అబుదాబిలో స్థిరపడింది. భర్త ప్రోత్సాహంతో శిక్షణ తీసుకుని మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఈ ఏడాది వరుసగా మిసెస్‌ కేరళ గ్లోబల్‌, మిసెస్‌ సౌత్‌ ఇండియా డాజ్లింగ్‌ స్మైల్‌తోపాటు మిసెస్‌ ఇండియా కిరీటాన్నీ గెల్చుకుంది. ‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలల్ని ఛేదించడానికి వెనకాడొద్దు. మహిళలు దేశాల్నీ ముందుండి నడిపిస్తున్నారు. వీటితో పోల్చుకుంటే మనకెదురయ్యేవన్నీ చిన్న సమస్యలే. ఈ పోటీలను సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే మార్గంగా భావిస్తా’ అంటోన్న ఐశ్వర్య మిసెస్‌ యూనివర్స్‌ పోటీలకు సిద్ధమవుతోంది.


ఆత్మవిశ్వాసమే అందం: రాధికా రానే

మెది పుణె. పెరిగింది ముంబయిలో. ఇంజినీరింగ్‌, ఎంబీఏ చదివింది. పెళ్లయ్యాక యూఎస్‌లో స్థిరపడింది. ‘ఎస్‌జీఎస్‌ టెలికామ్‌’కి వైస్‌ ప్రెసిడెంట్‌. అమెరికాలో ఏటా మిసెస్‌ ఆసియా యూఎస్‌ఏ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. దీనిలో 48 దేశాల వాళ్లు పాల్గొంటారు. సేవ, ఆర్ట్స్‌, డ్యాన్స్‌... ఇలా వివిధ పోటీలుంటాయి. దీనికి ఈమె మన దేశం తరఫున పోటీ చేసి, రన్నరప్‌గా నిలిచింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, కెరియర్‌లోనూ రాణిస్తున్న మహిళలకు నా విజయం అంకితమిచ్చా. అందమంటే రూపురేఖలు కాదు. ఆత్మవిశ్వాసమే అసలైన అందం. ప్రతి అమ్మాయీ తనకు తాను ప్రత్యేకమని నమ్మాలి. అనుకున్నది సాధించడానికి ధైర్యంగా సాగాలి’ అంటోన్న రాధిక మోడల్‌ కూడా. ఈమె భర్త అమర్‌ ఫేస్‌బుక్‌లో సీనియర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌. వీళ్లకో బాబు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని