Updated : 29/12/2021 05:31 IST

ఆ వంటలకు 242 కోట్లమంది వీక్షకులు

యూట్యూబ్‌లో ఆమె వంటల ఛానల్‌ సబ్‌స్క్రైబర్స్‌ 1.22 కోట్లు. ఆవిడ వీడియోలను వీక్షించిన వారు 242 కోట్ల 88 లక్షలు. ఏటా రూ.2 కోట్ల పైచిలుకుతో దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న యూట్యూబర్‌... ఈ ఘనతలన్నీ 62 ఏళ్ల నిషా మధులిక సాధించినవే...

ధులిక వాళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పట్నుంచి వంటలంటే మహాఇష్టం. డిగ్రీ తర్వాత గుప్తతో పెళ్లై దిల్లీలో స్థిర పడ్డారు. వీరికిద్దరు పిల్లలు. కుటుంబాన్ని చూసుకుంటూనే, భర్తకు వ్యాపారంలో సాయం చేసే వారు. పిల్లలు పెద్దవాళ్లై, చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడంతో ఒంటరితనం తనను వెంటాడేది. అది తీవ్ర కుంగుబాటుకు దారితీసింది. వైద్యులు దీన్ని ‘ఎంప్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌’ అన్నారు. నచ్చిన పనితో బిజీగా ఉంటే దీన్నుంచి బయటపడొచ్చని సలహా ఇచ్చారు. దీంతో నిషా 48 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ నేర్చుకుని 2007లో బ్లాగ్‌ ప్రారంభించారు. భారతీయ వంటకాల తయారీని అందులో రాసే వారు. అవి చదివిన వారంతా ఆ వంటలను చేసి చూపించొచ్చు కదా అని అడిగేవారు. ఇంకేం... 2011లో ‘ఫుడ్‌ అండ్‌ రెసిపీ’ యూట్యూబ్‌ ఛానెల్‌ను మొదలుపెట్టారావిడ. ఇప్పుడు ప్రతినెలా ఈ ఛానెల్‌ వీక్షకుల సంఖ్య 1.80 కోట్లు. గతేడాది సబ్‌స్క్రైబర్స్‌ కోటికి చేరడంతో ‘యూట్యూబ్‌ డైమండ్‌ ప్లే బటన్‌’ని దక్కించుకున్నారు.

లక్ష్యం నెరవేరింది... ‘పాకశాస్త్రంలో డిగ్రీలు లేకపోయినా ఆసక్తి, కృషితో ప్రముఖ పాకశాస్త్ర నిపుణుల సరసన నిలవగలిగా. ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నా. ఎంతో మంది మీరు మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసిస్తూ ఉంటే నా లక్ష్యం నెరవేరినట్టు అనిపిస్తుంది. వీడియోలను ఉదయాన్నే పూర్తి చేస్తా. నేను వండుతుంటే మా వారు, పిల్లలు షూట్‌ చేస్తారు. కొత్తలో తడబడ్డా క్రమేపీ అనుభవాన్ని సంపాదించా. శాకాహారం పైనే ఇప్పటి వరకూ 1700 వీడియోలు చేశా. నా ఆమ్లా మురబ్బా వీడియోను 2.6 కోట్లమంది చూశారు. రోజూ పుస్తకాలు చదివి, కొత్త వంటలపై ప్రయోగాలు చేస్తా. చాలామందికి శిక్షణ ఇస్తున్నా. కొన్ని రెస్టారెంట్స్‌కు కన్సల్టెంట్‌ని కూడా. ఏ వయసువారికైనా నేను చెప్పేదేంటంటే... మనసుకు నచ్చిన దాన్ని ఎంచుకోండి... ఏకాగ్రతతో కృషి చేయండి... అప్పుడు ఏదైనా సాధించగలరు. వయసు అడ్డం కాదనడానికి నేనే ఉదాహరణ’ అంటున్నారు నిషా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని