Updated : 29/12/2021 05:16 IST

సంక్షోభాలకు ఎదురీదిన ధీరలు

కొవిడ్‌, వాతావరణ మార్పులు, తీవ్ర అసమానతలతో ప్రపంచం 2021లో కల్లోలంలోకి జారిపోయింది. ఈ సంక్షోభ సమయంలో స్త్రీ సహజ భావోద్వేగాలకు సమర్థ వ్యూహాల్ని జోడించి అమోఘ నాయకత్వ పటిమను ప్రదర్శించిన మహిళా నేతలు వీరు.


1. జెసిండా ఆర్డెర్న్‌... ఏ సవాలునైనా వేగంగా నిర్ణయాత్మకంగా ఎదుర్కొనే సత్తా తనకుందని న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి ఆర్డెర్న్‌ పలు మార్లు నిరూపించుకున్నారు. కరోనా జాడలు కనిపించిన వెంటనే దేశంలో లాక్‌డౌన్‌ విధించి వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేశారు. క్రైస్ట్‌ చర్చ్‌లో ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 51 మంది ప్రాణాలు తీశాడు. మరు క్షణమే జెసిండా న్యూజిలాండ్‌లో రైఫిళ్లు, సెమీ ఆటోమేటిక్‌ ఆయుధాల అమ్మకాలను నిషేధించారు. అమెరికాలో ఎన్నిసార్లు కాల్పుల్లో అమాయకులు హతమవుతున్నా, తుపాకులు, రివాల్వర్లను నిషేధించడానికి ఏ ప్రభుత్వమూ సాహసించడం లేదు. దేశ నాయకురాలిగా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో జెసిండా ఎప్పుడూ వెనుకాడలేదు.


2. ఆంగెలా మెర్కెల్‌... జర్మనీ ప్రప్రథమ మహిళా ఛాన్స్‌లర్‌గా దాదాపు 16 ఏళ్లు పాలించి ఇటీవలే 67 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఆంగెలా మెర్కెల్‌ ఐరోపాలో అత్యంత శక్తిమంతురాలిగా పేరు తెచ్చుకున్నారు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్నీ, ఐరోపా రుణ సంక్షోభాన్నీ, కొవిడ్‌ మహమ్మారినీ అధిగమించడానికి సర్వశక్తులూ ఒడ్డారు. 27 దేశాల ఐరోపా సమాఖ్య (ఈయూ)ను అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించి సమైక్యంగా నిలిపారు. 2015-16లో సిరియా శరణార్థులకు జర్మనీలో ఆశ్రయం కల్పించి, చల్లని మనసు చాటుకున్నారు. క్రిమియా, ఉక్రెయిన్‌లలో రష్యా దూకుడుకు వ్యతిరేకంగా మెర్కెల్‌ ఈయూతో ఆర్థిక ఆంక్షలను విధింపజేశారు. ఛాన్స్‌లర్‌ పదవిలోకి వచ్చినా తన పాత అపార్ట్‌మెంట్‌లోనే నివసించడం ఆవిడ నిరాడంబరతకు నిదర్శనం.


3. కమలా హారిస్‌... అగ్రరాజ్యమైన అమెరికాలో రెండో శక్తిమంతమైన పదవిని చేపట్టిన మహిళగా కమలా హారిస్‌ చరిత్రకెక్కారు. ఆ దేశంలో ఉపాధ్యక్ష పదవిని అధిష్ఠించిన తొలి నల్లజాతి వనిత, మొట్టమొదటి దక్షిణాసియా సంతతి మహిళ కమల. ఆవిడ తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్‌. కమల క్యాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రప్రథమ మహిళా అటార్నీ జనరల్‌, ఆ పదవిని చేపట్టిన తొలి ఆఫ్రికన్‌-అమెరికన్‌ కూడా. అమెరికా ఎగువ సభ సెనెట్‌కు 2016లో ఎన్నికైన ప్రప్రథమ భారత సంతతి అమెరికన్‌ కూడా ఆమే. జో బైడెన్‌ తరవాత కమల ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినా ఆశ్చర్యం లేదు.


4. నిర్మలా సీతారామన్‌... పురుషాధిక్య రాజకీయ వాతావరణంలో కీలకమైన రక్షణమంత్రి, ఆర్థిక మంత్రి పదవులను చేపట్టి నిర్మలా సీతారామన్‌ వనితా శక్తిని చాటి చెప్పారు. గతంలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా స్త్రీ సాధికారత కోసం పోరాడారు. భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి నిరుడు ఏర్పాటు చేసిన ఆర్థిక కార్యాచరణ బృందానికి ఆమె సారథ్యం వహిస్తున్నారు.


5. జెనెట్‌ యెల్లెన్‌... అనేక రకాలుగా ఆమె ప్రథమురాలు. అమెరికా చరిత్రలో మొట్ట మొదటి మహిళా ఆర్థిక మంత్రి జేనెట్‌ యెల్లెన్‌. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా (2014-18) వ్యవహరించిన ఘనత ఆమెది. 1997-99 మధ్య బిల్‌ క్లింటన్‌ హయాంలో దేశాధ్యక్షుడి ఆర్థిక సలహా మండలి తొలి అధ్యక్షురాలిగా పనిచేశారు.


6. త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌... చైనా ఎంత దూడుకుగా వ్యవహరిస్తున్నా అదరక బెదరక మేరు నగంలా నిలుస్తున్న తైవాన్‌ తొలి మహిళా అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌. ఆమె దేశానికి మొట్టమొదటి అవివాహిత అధ్యక్షురాలు కూడా. వంశ పారంపర్యంగా కాకుండా స్వీయ ప్రతిభతో దేశ నాయకత్వాన్ని సాధించిన తొలి ఆసియా నాయకురాలు త్సాయ్‌. కరోనా వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్న కొద్దిమంది ప్రపంచ నాయకుల్లో త్సాయ్‌ ఒకరు. 2020 డిసెంబరు వరకు 200 రోజులపాటు దేశంలో ఒక్క కొవిడ్‌ కేసూ నమోదు కాలేదంటే అది ఆమె తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల చలవే.


7. షేక్‌ హసీనా వాజిద్‌... బంగ్లాదేశ్‌ను నాలుగోసారి ప్రధానమంత్రిగా పాలిస్తున్న షేక్‌ హసీనా వాజిద్‌, దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న అధినేతగా రికార్డు సృష్టించారు. ఆమె హయాంలో బంగ్లాదేశ్‌ ఆర్థికంగానే కాకుండా మానవాభివృద్ధి సూచీలోనూ అపూర్వ ప్రగతి సాధించింది. ఇదే తన చివరి పదవీ కాలమంటున్న హసీనా, తాను పదవీ విరమణ చేసే లోగా బంగ్లాకు ఆర్థిక భద్రత సాధించి, అన్ని వర్గాలకు విద్యావైద్య సౌకర్యాలను అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. మతోన్మాద శక్తుల ఆగడాలను సాగనివ్వకుండా బంగ్లాను సుస్థిర ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దాలని ఆమె కంకణం కట్టుకున్నారు.


8. ఎన్‌ గోజీ ఒకాంజో ఇవియాలా... ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్‌ అయిన ఇవియాలా ఈ పదవిని చేపట్టిన ప్రప్రథమ ఆఫ్రికన్‌ కూడా. దీనికిముందు మాతృదేశం నైజీరియాలో ఆర్థిక, విదేశాంగ మంత్రి పదవులను నిర్వహించిన తొలి మహిళగా కూడా రికార్డు సృష్టించారు. ప్రపంచ బ్యాంకులో 25 ఏళ్లు పనిచేసిన సుదీర్ఘ అనుభవం కొవిడ్‌ వల్ల కుదేలైన ప్రపంచ వాణిజ్యాన్ని మళ్లీ గాడిన పెట్టడంలో ఆమెకు తోడ్పడుతుంది.


9. క్రిస్టీన్‌ లాగార్డ్‌... యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) తొలి మహిళా అధ్యక్షురాలిగా 2019లో నియమితులైన క్రిస్టీన్‌ లాగార్డ్‌, కొవిడ్‌ విధ్వంసం నుంచి యూరోపియన్‌ దేశాలను వేగంగా బయటపడేసే బాధ్యత తీసుకున్నారు. ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రిగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఈ సందర్భంగా ఎంతో అక్కరకొస్తుంది.


10. ఉర్సులా ఫాన్‌ డెర్‌ లెయెన్‌... జర్మనీలో ఆంగెలా మెర్కెల్‌ మంత్రివర్గ సభ్యురాలిగా 14 ఏళ్ల సుదీర్ఘకాలం పనిచేసిన ఘనత ఫాన్‌ డెర్‌ లెయెన్‌ ది. అందులో ఆరేళ్లపాటు రక్షణమంత్రి పదవిని నిర్వహించారు. 2019లో యూరోపియన్‌ కమిషన్‌ (ఈసీ) తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన డెర్‌ లెయెన్‌ తీసుకునే నిర్ణయాలు 70 కోట్ల ఐరోపా వాసుల జీవితాలను ప్రభావితం చేస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని