Updated : 13/05/2022 15:52 IST

వేల పచ్చళ్ల రాణి

ఆవకాయ, ఉసిరి, చింత ఇలా అందరికీ తెలిసిన పచ్చళ్లు పదో ఇరవయ్యో ఉంటాయి. అయితే ఆవిడ పుస్తకంలో వెయ్యి రకాల పచ్చళ్ల తయారీ పద్ధతులు... చదువుతుంటేనే నోరూరిస్తాయి. అలాగే వెయ్యిరకాల రసాలపై మరో పుస్తకం అందరితో లొట్టలేయిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే... ‘ఇండియాస్‌ పికిల్‌ క్వీన్‌’ ఉషా ప్రభాకరన్‌.

చెన్నైలో స్థిరపడ్డ న్యాయవాదుల జంట ఉషా, ఎస్‌జీ ప్రభాకరన్‌. అత్తగారు చేసి పంపించే సంప్రదాయ వంటకాలు, పచ్చళ్ల రుచి ఉషకు కొత్తగా అనిపించేవి. చట్నీలు, ఊరగాయలు, తువయల్‌, రకరకాల పొడుల రుచిని ఆస్వాదించే ఆమె, వాటి తయారీనీ నేర్చుకోవడం మొదలుపెట్టారు. నచ్చిన పచ్చళ్లను చేసి, స్నేహితులకు పంచేవారు. నిల్వ పచ్చళ్ల నుంచి అప్పటికప్పుడు చేసే రకాల వరకు ఎన్నో వందలు తెలుసుకున్నారీమె. వీటన్నింటినీ తరువాత తరానికి అందించాలనుకున్నారు.

అందరి నుంచీ సేకరించి...

ఇవే కాకుండా, దేశవ్యాప్తంగా ఉండే రకాలనూ తెలుసుకోవాలనుకున్నారు ఉష. స్నేహితులు, తెలిసిన వారినే కాకుండా, హోటళ్లలో చెఫ్‌లను కలుసుకునేవారు. విందులకెళ్లినప్పుడు వంట వారితో మాట్లాడి కొత్త రకాలు తెలుసుకుని రాసుకునేవారు. ఇలా మొత్తం 5 వేల పచ్చళ్ల క్యాటలాగ్‌ను తయారు చేశారు. ఏది తెలుసుకున్నా దాన్ని ఇంటికొచ్చి తనే చేసి రుచి చూసి నిర్ధారించుకోవడం తన అలవాటు. ఆ సేకరణ నుంచి వెయ్యి రకాలతో పుస్తక రూపాన్నిచ్చారు. తొమ్మిది విభాగాలుగా ఉండే ఈ రచనలో నూనెతో, నూనె లేకుండా, అలాగే వాటివల్ల ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పోషకవిలువలు వంటి వివరాలనీ పొందుపరిచారు. కానీ ఈ పుస్తకంపై పబ్లిషర్స్‌ ఆసక్తి చూపించలేదు. దాంతో తానే ప్రచురించాలని నిశ్చయించుకున్నారు. ఈ పుస్తకం విడుదలకు ముందే ఉష తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బ్రెయిన్‌ ట్యూమర్‌కు శస్త్రచికిత్స అనంతరం ఇంటికొచ్చాక ఆ పుస్తకం విడుదలై హాట్‌కేకులా అమ్ముడుపోయింది. ఆ ఉత్సాహం ఆమెకు మరో ఆలోచననిచ్చింది.

సర్జరీలైనా..

అన్ని వయసుల వారికీ తేలికగా జీర్ణమయ్యే చారు అంటే ఉషకు అమిత ప్రీతి. అందులోనూ దక్షిణ భారత చారు రుచిని దేనితోనూ పోల్చలేం అంటారామె. ‘పచ్చళ్ల పుస్తకం విడుదలైన తర్వాత నాకు చారులపై రాయాలనిపించింది. ఎవరికైనా తేలికగా తయారు చేసుకోగలిగేలా, ఆరోగ్యాన్ని పెంపొందించే చారుల గురించి పుస్తకం మొదలుపెట్టా. వాటి గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదివా. తెలిసిన వారిని, వారింట్లో ఉండే పెద్దలనూ పలకరించే దాన్ని. వారు చేసే చారుల గురించి రాసుకోవడం మొదలుపెట్టా. బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా రెండు శస్త్ర చికిత్సలు జరగడంతో దాదాపు పదేళ్లు విశ్రాంతిలోనే ఉన్నా. ఆ తర్వాత నా భర్త చనిపోయారు. అయినా ఈ పుస్తకాల విషయం నా మనసులో మెదులుతూనే ఉండేది. తిరిగి పుస్తక రచనపై మనసు మళ్లింది. ఇప్పటి వరకు వెయ్యి రకాలను తెలుసుకున్నా. వీటిలో కూరగాయలు, పండ్లు, నట్స్‌, విత్తనాలు, హెర్బ్స్‌, మసాలాలతో చేసేవి ఉన్నాయి. వీటన్నింటినీ నిమిషాల్లో చేయొచ్చు. ‘ఉషాస్‌ రసం డైజెస్ట్‌’ పుస్తకం విడుదల చేశా. దాంతో నన్ను ‘రసం క్వీన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తున్నారంతా. ఇన్ని వంటకాల్లో నాకు అత్యంత ఇష్టమైనవేంటంటే.. తాజాగా, అప్పటికప్పుడు పెరుగు, ఉసిరితో చేసే పచ్చడి, ములక్కాయ ఊరగాయ, పచ్చి టొమాటో చట్నీతోపాటు ఇనుము ఎక్కువగా లభ్యమయ్యే అరటికాయపువ్వు ఊరగాయ. వీటిని చూస్తే... తినకుండా ఉండలేను’ అని నవ్వేస్తారు 64 ఏళ్ల ఉషాప్రభాకరన్‌. మన దేశ సంప్రదాయాల్లో ఉండే కనీస రుచులను రేపటి తరం తెలుసుకోవాలనేదే నా లక్ష్యం అనే ఆవిడ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని