Published : 10/01/2022 01:16 IST

119 ఏళ్ల బామ్మ.. ఆరోగ్య పాఠాలివీ!

రెండు పదులు దాటితే అనారోగ్యాల చిట్టా విప్పేస్తున్న కాలమిది! కానీ జపాన్‌కు చెందిన ఒక బామ్మ మాత్రం తన ఆరోగ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆమె వయసెంతో తెలుసా? ఇటీవలే తన 119వ పుట్టినరోజును జరుపుకొని, ప్రపంచంలోనే వృద్ధమహిళగా గిన్నిస్‌ రికార్డునూ సాధించింది. తన ఆరోగ్య రహస్యాన్ని అందరితో పంచుకుంది. అవేంటో.. చదివేయండి.

నే తనాకా 1903లో జన్మించింది. తొమ్మిదిమంది తోబుట్టువుల్లో ఈమెది సరిగా మధ్యస్థానం. ఈమెకు 19వ ఏట పెళ్లైంది. భర్త, కొడుకు రెండో సినో జపనీయుల యుద్ధానికి వెళ్లగా, ఈమె నూడుల్స్‌ విక్రయించి కుటుంబాన్ని పోషించింది. చిన్నప్పటి నుంచీ ఉదయం 6 గంటలకు నిద్రలేచి తన పనులు పూర్తి చేసుకోవడం ఈమెకి అలవాటు. ఇప్పటికీ ఈమె దినచర్యలో ఎలాంటి మార్పూ లేదు. ఈమెకు పాఠశాల స్థాయి నుంచి లెక్కలంటే ఎంతో ఇష్టం. దాంతో ఇప్పటికీ  ఏమాత్రం సమయం దొరికినా గణితాంశాలను నేర్చుకుంటూనే ఉంటుంది. చిన్నచిన్న లెక్కలను మనసులోనే చేయడం అలవాటుగా మార్చుకుంది. ఇదే ఈమె మెదడును నిత్యం ఉత్సాహంగా ఉండేలా చేసింది. అలాగే ఖాళీ సమయాల్లో పజిల్స్‌ పూర్తిచేయడం ఈమె అభిరుచి. కుటుంబానికి ఓ నిత్యావసరాలను అమ్మే దుకాణం ఉంది. తనకు 103 ఏళ్లు వచ్చేవరకూ దాని నిర్వహణ బాధ్యతలను స్వయంగా చూసుకునేది. చాక్లెట్‌, పండ్లరసాన్ని తీసుకోందే ఈ బామ్మకు రోజు గడవదు. కంటినిండా నిద్రపోవడంతోపాటు ఏ సమస్యనైనా సానుకూలంగా ఆలోచించి, పరిష్కరించడం ఈ బామ్మకు అలవాటు. పులియబెట్టిన ఆహారాలు, వేళ్లు, ఆకుకూరలు, చేపలు.. వంటి పౌష్టిక విలువలున్న ఆహారాన్నే తీసుకుంటుందట. అవే తనను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా నిలిపాయి అంటుంది. గణితం, పజిల్స్‌ వంటివి తన మెదడును ఉత్సాహంగా ఉంచుతున్నాయని చెబుతోంది. అయితే ఎంత నచ్చిన ఆహారమైనా ఎప్పుడూ వందశాతం కడుపు నింపుకొనే అలవాటు లేదంటోంది. 80 శాతం నిండింది అనిపించగానే ఆహారాన్ని తీసుకోవడం ఆపేస్తుందట. మనసునెప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడమే తన సంతోషానికి కారణమని చెప్పే ఈమె తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలతోపాటు మరెన్నో ఘట్టాలనూ చూసింది. ఆ కబుర్లను నేటి తరానికీ కథలుగా చెబుతుంటుంది. నిత్యం సంతోషంగా ఉండటం తెలిస్తే చాలు.. వందేళ్లు తేలికగా బతికేయొచ్చు అని చెప్పే బామ్మ నేటి తరానికి స్ఫూర్తినందిస్తోంది కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని