Updated : 12/01/2022 05:31 IST

నాచు వ్యాపారంతో 50 లక్షలు గెలిచింది

సముద్రం ముందు కూర్చున్న ఆమెకు దానిలోకి చేరుతోన్న వ్యర్థాలను చూసి బాధేసింది. ఈ వ్యర్థాలు భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలినీ దూరం చేస్తాయనుకుంది. అప్పుడే నేహా జైన్‌కు ఓ ఆలోచన తట్టింది. అది ఆమెకు వ్యాపార మార్గమవడంతోపాటు అంతర్జాతీయ గుర్తింపునీ తెచ్చిపెట్టింది.

నేహా తన గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక గూగుల్‌లో ఉద్యోగంలో చేరింది. అందులో భాగంగా దేశమంతా తిరిగింది. చివరకు 2009లో ముంబయిలో స్థిరపడింది. వాతావరణంపై దుష్ప్రభావాల్ని నివారించడం, కాలుష్య కట్టడి ఏ కొందరి జాగ్రత్తల వల్లో సాధ్యం కాదనేది ఆమె అభిప్రాయం. పనిలో స్ఫూర్తి కోసం ఓరోజు సముద్ర తీరాన కూర్చొంది. అప్పుడే ఆమె దృష్టి సముద్ర నాచుపై పడింది. దాంతోపాటే ఓ ఆలోచనా తట్టింది. ‘సముద్రం మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. దాని క్షేమం మన బాధ్యతే. కానీ దాన్ని డంప్‌యార్డ్‌ చేసేస్తున్నాం. పైగా మనం తీసుకునే ఆక్సిజన్‌లో ఎక్కువ శాతం వచ్చేదీ సముద్ర మొక్కల నుంచే! అందుకే ఈ తీరులో మార్పు తేవాలనిపించింది. చాలావరకూ ప్యాకేజింగ్‌లో ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌ను ఎక్కువ మోతాదులో వినియోగిస్తాం. చాలాసార్లు దాని ఉపయోగం 5 నిమిషాలు మించి ఉండదు. కానీ అది భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. పర్యావరణ హితమైనవిగా పేర్కొనే కాగితం, గ్లాస్‌, వస్త్రం వంటి వాటి విషయంలోనూ దశాబ్దాలు పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సముద్ర నాచునే ఉపయోగించాలనుకున్నా’ అంటుంది నేహా.

2020 లాక్‌డౌన్‌ సమయంలో జీరోసర్కిల్‌ పేరుతో సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా వివిధ సంస్థలకు ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ను అందజేస్తోంది. ‘సముద్రాన్ని సురక్షితంగా ఉంచాలి, కార్బన్‌ రహిత ప్యాకేజింగ్‌ను అందించాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించా. సున్నా పర్యావరణ హాని, అలాగే ఎకానమీకీ ఇబ్బంది అవొద్దు అన్న అర్థమొచ్చేలా ‘జీరోసర్కిల్‌’ పేరు పెట్టాం. ఆహారం, ఆహారేతర వస్తువులు రెండింటికీ పనికొచ్చేలా వీటిని తీర్చిదిద్దాం. దీని కోసం చాలా పరిశోధననూ చేశాం. అవసరం తీరాక వీటిని చెత్తలో పడేయొచ్చు లేదా ఎరువుగానూ ఉపయోగించొచ్చు. సముద్రాల్లోకి చేరినా నీటిలో కరిగిపోతాయి. ఆహార విషయంలో ఈ ప్యాకేజింగ్‌తో పాడవడం, త్వరగా పండిపోవడం వంటి సమస్యలూ ఉండటం లేవంటోంది. పైగా చేపలు పట్టేవారికి అదనపు ఆదాయమూ చేకూరుతోంది’ అని చెబుతోంది. ఎన్నో ప్రముఖ బ్యూటీ, ఆహార, ఈకామర్స్‌ సంస్థలు ఈమె సేవలను వినియోగించుకుంటున్నాయి. అంతర్జాతీయంగా మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తూ, అవసరమైన సాయమందించే ద ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (టీఐఈ) తన ఆలోచనను మెచ్చింది. గత ఏడాది జీఐటెక్స్‌, టీఐఈ విమెన్‌ గ్లోబల్‌ కాంపిటిషన్లలో విజేతగా నిలిచింది. రూ.50 లక్షలకుపైగా నగదు బహుమతినీ పొందింది. భిన్నమైన ఆలోచనే కాక ప్రపంచమంతా పరిష్కరించలేకపోతున్న పెద్ద సమస్యకూ పరిష్కారం చూపుతోందని ప్రపంచవేదికల నుంచి కితాబునూ అందుకుంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని